ENG VS NZ 2nd ODI: రీఎంట్రీలో ఇరగదీసిన బౌల్ట్‌.. అద్భుత గణాంకాలు | ENG vs NZ, 2nd ODI: Trent Boult Strikes Thrice In First 15 Balls On His ODI Return | Sakshi
Sakshi News home page

ENG VS NZ 2nd ODI: రీఎంట్రీలో ఇరగదీసిన బౌల్ట్‌.. అద్భుత గణాంకాలు

Published Sun, Sep 10 2023 7:57 PM | Last Updated on Mon, Sep 11 2023 9:58 AM

ENG VS NZ 2nd ODI: Trent Boult Strikes Thrice In First 15 Balls On His ODI Return - Sakshi

ఓ రోజు తక్కువ ఏడాది తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కివీస్‌ పేస్‌ గన్‌ ట్రెంట్‌ బౌల్ట్‌.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. వచ్చీ రాగానే బౌల్ట్‌ తనదైన శైలిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్‌తో వారి స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 10) జరుగుతున్న రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన బౌల్ట్‌ తాను సంధించిన తొలి 17 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్‌ ఉంది.

బౌల్ట్‌ పడగొట్టిన వికెట్లు ఆషామాషీ ఆటగాళ్లవనుకుంటే పొరపాటే. ప్రపంచ క్రికెట్‌లో అతి భయంకర ఆటగాళ్లు జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌లను బౌల్ట్‌ వరుస పెట్టి పెవిలియన్‌కు సాగనంపాడు. సాంట్నర్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో బెయిర్‌స్టో (6), ఎల్బీడబ్ల్యూగా రూట్‌ (0), సౌథీ క్యాచ్‌ పట్టడంతో స్టోక్స్‌ (1) పెవిలియన్‌ బాటపట్టారు. బౌల్ట్‌తో పాటు మరో పేసర్‌ మ్యాట్‌ హెన్రీ (4-1-17-1), స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ (4-0-15-1) ధాటికి ఇంగ్లండ్‌ టాపార్డర్‌ కకావికలమైంది.

12.1 ఓవర్లలో ఆ జట్టు 55 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. హ్యారీ బ్రూక్‌ (2)ను హెన్రీ.. బట్లర్‌ను (30) సాంట్నర్‌ ఔట్‌ చేశారు. 16 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 73/5గా ఉంది. లివింగ్‌స్టోన్‌ (14), మొయిన్‌ అలీ (17) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బౌల్ట్‌​కు ఇది కెరీర్‌లో 100వ వన్డే కావడం విశేషం.

కాగా, 4 టీ20లు, 4 వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌ 2-2తో సమం కాగా.. తొలి వన్డే విజయం సాధించిన కివీస్‌ వన్డే సిరీస్‌లో ఆధిక్యంలో (1-0) ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement