చైనాదే ఉబెర్ కప్
రన్నరప్ జపాన్
న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణించిన చైనా జట్టు 13వసారి మహిళల ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘ఉబెర్ కప్’ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో చైనా 3-1 తేడాతో జపాన్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ 21-15, 21-5తో మినత్సు మితానిపై గెలిచింది. రెండో మ్యాచ్‌లో మిసాకి-అయాకా (జపాన్) జోడి 21-18, 21-9తో యిక్సిన్ బావో-జిన్‌హువా తాంగ్ జంటను ఓడించి స్కోరును సమం చేసింది.
మూడో మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిజియాన్ వాంగ్ 21-16, 21-12తో సయాకా తకహాషిపై నెగ్గి చైనాకు 2-1 ఆధిక్యాన్ని అందించింది. నాలుగో మ్యాచ్‌లో యున్‌లీ జావో-జియోలి వాంగ్ ద్వయం 21-13, 21-6తో మియుకి-రీకా జంటను ఓడించి చైనా విజయాన్ని ఖాయం చేసింది. ఫలితం తేలడంతో నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్స్‌లో ఓడిన భారత్, దక్షిణ కొరియా జట్లకు కాంస్య పతకాలు లభించాయి. ఆదివారం పురుషుల విభాగంలో ‘థామస్ కప్’ కోసం మలేసియా, జపాన్ జట్లు పోటీపడతాయి.