world Team badminton championship
-
థాయ్ లాండ్ పై భారత్ విజయం
కున్షాన్ (చైనా): ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత జట్టు పతకం ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1 తేడాతో థాయ్‌లాండ్ ను ఓడించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్‌లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 12-21,19-21 తేడాతో మాజీ వరల్డ్ చాంపియన్ రాచ్నోక్ ఇంతానాన్ చేతిలో పరాజయం చవిచూసింది. అయితే మరో సింగిల్స్ మ్యాచ్‌లో పివి సింధు 21-18, 21-7 తేడాతో బుసానాన్పై గెలిచి స్కోరును 1-1గా సమం చేసింది. కేవలం 43 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు ఆకట్టుకుంది. అనంతరం డబుల్స్‌లో భారత జోడి గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్పలు 21-18, 21-16 తేడాతో సప్సిరీ-టెరాట్టాన్ చాయ్‌పై గెలిచి ఆధిక్యాన్నిమరింత పెంచారు. మరోపోరులో రుత్వికా శివానీ 21-18, 21-16 తేడాతో నిచోన్ జిందాపాల్పై విజయం సాధించడంతో భారత్ కు పతకం ఖాయమైంది. 2014లో సెమీ ఫైనల్లో జపాన్ చేతిలో భారత్ ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ వరుసగా రెండోసారి పతకం సాధించడం విశేషం. -
సైనా, సింధు మెరిసినా...
► చివరి మ్యాచ్‌లో 2-3తో ► జపాన్ చేతిలో ఓడిన భారత్ ► ఓటమితో ముగించిన పురుషుల జట్టు ► థామస్-ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ కున్షాన్ (చైనా): సైనా నెహ్వాల్, పీవీ సింధు ఒకరిని మించి మరొకరు మెరుగైన ఆటతీరును కనబరిచినా ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. జపాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో పోరాడి ఓడింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌తో భారత్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ నొజోమి ఒకుహారాతో జరిగిన పోటీలో ఎనిమిదో ర్యాంకర్ సైనా 21-18, 21-6తో నెగ్గి భారత్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21-11, 21-18తో ప్రపంచ 11వ ర్యాంకర్ అకానె యామగుచిని ఓడించడంతో భారత్ 2-0తో ముందంజ వేసింది. అయితే మూడో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-సిక్కి రెడ్డి జంట 11-21, 8-21తో ప్రపంచ నంబర్‌వన్ జోడీ మిసాకి-అయాకా చేతిలో ఓడింది. నాలుగో మ్యాచ్‌లో గద్దె రుత్విక శివాని 7-21, 14-21తో ప్రపంచ 12వ ర్యాంకర్ సయాకా సాటో చేతిలో ఓడిపోయింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సింధు-అశ్విని పొన్నప్ప ద్వయం 21-15, 19-21, 16-21తో షిజుకా-మామి నైతో జంట చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 0-5తో ఇండోనేసియా చేతిలో ఓటమి చవిచూసింది. -
చైనాదే ఉబెర్ కప్
రన్నరప్ జపాన్ న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణించిన చైనా జట్టు 13వసారి మహిళల ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘ఉబెర్ కప్’ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో చైనా 3-1 తేడాతో జపాన్ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ 21-15, 21-5తో మినత్సు మితానిపై గెలిచింది. రెండో మ్యాచ్‌లో మిసాకి-అయాకా (జపాన్) జోడి 21-18, 21-9తో యిక్సిన్ బావో-జిన్హువా తాంగ్ జంటను ఓడించి స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిజియాన్ వాంగ్ 21-16, 21-12తో సయాకా తకహాషిపై నెగ్గి చైనాకు 2-1 ఆధిక్యాన్ని అందించింది. నాలుగో మ్యాచ్‌లో యున్లీ జావో-జియోలి వాంగ్ ద్వయం 21-13, 21-6తో మియుకి-రీకా జంటను ఓడించి చైనా విజయాన్ని ఖాయం చేసింది. ఫలితం తేలడంతో నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్స్‌లో ఓడిన భారత్, దక్షిణ కొరియా జట్లకు కాంస్య పతకాలు లభించాయి. ఆదివారం పురుషుల విభాగంలో ‘థామస్ కప్’ కోసం మలేసియా, జపాన్ జట్లు పోటీపడతాయి. -
సైనా, సింధు గెలిచినా...
సెమీస్‌లో జపాన్ చేతిలో ఓడిన భారత్ ఖాతాలో కాంస్య పతకం ఉబెర్ కప్ టోర్నమెంట్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు జోరుకు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెరపడింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో టీమిండియా 2-3 తేడాతో జపాన్ చేతిలో ఓడిపోయింది. ఉబెర్ కప్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరిన భారత్ ఈ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. డబుల్స్ విభాగంలో జపాన్ జోడిలు పటిష్టంగా ఉండటం భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది. మరో సెమీఫైనల్లో చైనా 3-0తో దక్షిణ కొరియాను ఓడించి శనివారం జరిగే ఫైనల్లో జపాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. సెమీఫైనల్స్‌లో ఓడిన భారత్, కొరియా జట్లకు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల విభాగంలో చైనాకు షాక్ థామస్ కప్ పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ చైనాకు జపాన్ షాక్ ఇచ్చింది. సెమీఫైనల్లో జపాన్ 3-0తో చైనాను ఓడించి పెను సంచలనం సృష్టించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 4వ ర్యాంకర్ కెనిచి టాగో 21-13, 21-11తో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్‌పై; రెండో మ్యాచ్‌లో కెనిచి హయకావా-హిరోయుకి ఎండో 22-20, 21-19తో బియావో చాయ్-వీ హాంగ్లపై; మూడో మ్యాచ్‌లో కెంటో మొమొటా 23-25, 21-18, 21-14తో పెంగ్యూ డూపై నెగ్గి జపాన్‌కు చిరస్మరణీయ విజయం అందించారు. గత ఐదు పర్యాయాల్లో (2004, 06, 08, 2010, 2012) విజేతగా నిలిచిన చైనా 2002 తర్వాత తొలిసారి సెమీఫైనల్లో ఓడింది. మరో సెమీఫైనల్లో మలేసియా 3-0తో ఇండోనేసియాపై గెలిచి ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఆ ఇద్దరూ అజేయం... తొలి మ్యాచ్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ 21-12, 21-13తో ప్రపంచ 12వ ర్యాంకర్ మినత్సు మితానిపై గెలిచి భారత్‌కు శుభారంభం అందించింది. వేర్వేరు టోర్నీల్లో మితానితో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సైనా సొంతగడ్డపై మాత్రం ఏకపక్ష ఆటతీరుతో పైచేయి సాధించింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ పి.వి.సింధు 19-21, 21-18, 26-24తో ప్రపంచ 13వ ర్యాంకర్ సయాకా తకహాషిపై నెగ్గి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులోని నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు మ్యాచ్ పాయింట్‌ను కాచుకొని గెలువడం విశేషం. మూడో గేమ్‌లో 19-20తో వెనుకబడిన సింధు ఆ తర్వాత వరుసగా రెండు పాయింట్లు నెగ్గి 21-20తో ముందంజ వేసింది. అనంతరం సింధు ఆధిక్యంలోకి వెళ్లిన మూడుసార్లూ తకహాషి స్కోరును సమం చేసింది. అయితే స్కోరు 24-24 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో సైనా, సింధు ఆడిన ఐదేసి సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా నిలువడం విశేషం. జ్వాల-అశ్విని జోడి నెగ్గి ఉంటే... ఈ టోర్నీ డబుల్స్ విభాగంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం కీలకమైన పోటీలో అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 36వ స్థానంలో ఉన్న జ్వాల-అశ్విని జంట 12-21, 22-20, 16-21తో ప్రపంచ 4వ ర్యాంక్ జోడి హిసాకి మత్సుతోమో-అయాకా తకహాషి చేతిలో ఓడిపోయింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక జ్వాల జంట నెగ్గి ఉంటే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లేది. మూడో మ్యాచ్‌లో గెలిచి ఈ పోటీలో నిలిచిన జపాన్‌కు నాలుగో మ్యాచ్ ఫలితం కూడా అనుకూలంగా వచ్చింది. ప్రపంచ 16వ ర్యాంకర్ ఎరికో హిరోస్ 21-14, 21-15తో ప్రపంచ 65వ ర్యాంకర్ పి.సి.తులసీపై నెగ్గి స్కోరును 2-2తో సమం చేసింది. ఇక నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్-పి.వి.సింధు కలిసి జతగా బరిలోకి దిగినా ఫలితం లేకపోయింది. ప్రపంచ 5వ ర్యాంక్ జోడి మియుకి మయెదా-రీకా కకీవా జోడి 21-14, 21-11తో సైనా-సింధు జంటను ఓడించి జపాన్‌కు 3-2తో విజయాన్ని అందించింది. 1981 తర్వాత ఈ మెగా ఈవెంట్లో జపాన్ మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.