కున్‌షాన్ (చైనా): ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత జట్టు పతకం ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1 తేడాతో థాయ్లాండ్ ను ఓడించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 12-21,19-21 తేడాతో మాజీ వరల్డ్ చాంపియన్ రాచ్నోక్ ఇంతానాన్ చేతిలో పరాజయం చవిచూసింది.
అయితే మరో సింగిల్స్ మ్యాచ్లో పివి సింధు 21-18, 21-7 తేడాతో బుసానాన్పై గెలిచి స్కోరును 1-1గా సమం చేసింది. కేవలం 43 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సింధు ఆకట్టుకుంది. అనంతరం డబుల్స్లో భారత జోడి గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్పలు 21-18, 21-16 తేడాతో సప్సిరీ-టెరాట్టాన్ చాయ్పై గెలిచి ఆధిక్యాన్నిమరింత పెంచారు. మరోపోరులో రుత్వికా శివానీ 21-18, 21-16 తేడాతో నిచోన్ జిందాపాల్పై విజయం సాధించడంతో భారత్ కు పతకం ఖాయమైంది. 2014లో సెమీ ఫైనల్లో జపాన్ చేతిలో భారత్ ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ వరుసగా రెండోసారి పతకం సాధించడం విశేషం.