సైనా, సింధు మెరిసినా...
► చివరి మ్యాచ్‌లో 2-3తో
► జపాన్ చేతిలో ఓడిన భారత్
► ఓటమితో ముగించిన పురుషుల జట్టు
► థామస్-ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ
కున్‌షాన్ (చైనా): సైనా నెహ్వాల్, పీవీ సింధు ఒకరిని మించి మరొకరు మెరుగైన ఆటతీరును కనబరిచినా ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. జపాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో పోరాడి ఓడింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌తో భారత్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ నొజోమి ఒకుహారాతో జరిగిన పోటీలో ఎనిమిదో ర్యాంకర్ సైనా 21-18, 21-6తో నెగ్గి భారత్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21-11, 21-18తో ప్రపంచ 11వ ర్యాంకర్ అకానె యామగుచిని ఓడించడంతో భారత్ 2-0తో ముందంజ వేసింది.
అయితే మూడో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-సిక్కి రెడ్డి జంట 11-21, 8-21తో ప్రపంచ నంబర్‌వన్ జోడీ మిసాకి-అయాకా చేతిలో ఓడింది. నాలుగో మ్యాచ్‌లో గద్దె రుత్విక శివాని 7-21, 14-21తో ప్రపంచ 12వ ర్యాంకర్ సయాకా సాటో చేతిలో ఓడిపోయింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సింధు-అశ్విని పొన్నప్ప ద్వయం 21-15, 19-21, 16-21తో షిజుకా-మామి నైతో జంట చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 0-5తో ఇండోనేసియా చేతిలో ఓటమి చవిచూసింది.