ధోని సరసన రహానే
ధర్మశాల: భారత క్రికెట్ జట్టు ప్రధాన ఆటగాడు అజింక్యా రహానే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత టెస్టు క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించిన తొలి మ్యాచ్లోనే విజయాన్ని అందుకున్న రికార్డును రహానే సాధించాడు. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ లోనే విజయాన్ని సాధించిన తొమ్మిదో భారత టెస్టు కెప్టెన్గా రహానే నిలిచాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని, పాలీ ఉమ్రిగర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లేలు వంటి దిగ్గజాల సరసన రహానే చేరాడు. వీరంతా కెప్టెన్ గా చేసిన తొలి మ్యాచ్ ల్లో విజయం సాధించిన భారత క్రికెటర్లు. అయితే భారత తరపున కెప్టెన్ గా చేసిన తొలి మ్యాచ్లో విజయం సాధించిన చివరి కెప్టెన్ ధోని. ఆ తరువాత ఆ ఘనతను రహానే అందుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టెస్టుకు ముందు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గాయపడటంతో రహానే కు ఆ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో భారత 33వ టెస్టు కెప్టెన్గా రహానే గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-1తో కైవశం చేసుకుంది.ఆసీస్ విసిరిన 106 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. 19/0 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. తొలి సెషన్ ఆదిలో భారత్ వరుసగా మురళీ విజయ్(8), చటేశ్వర పూజరా(0)ల వికెట్లను కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్, కెప్టెన్ అజింక్యా రహానేలు మిగతా పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ జోడి స్కోరు బోర్డును వేగంగా పరుగులు పెట్టించడంతో భారత్ జట్టు 25.0 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. రాహుల్(52 నాటౌట్;76 బంతుల్లో9 ఫోర్లు), రహానే(38 నాటౌట్; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ తొలి సెషన్లోపే గెలుపును సొంతం చేసుకుంది.