రహానేకే ఎక్కువ అవకాశం: రోహిత్
చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగే తొలి మూడు వన్డేలకు భార్య అనారోగ్యం కారణంగా టీమిండియా జట్టు నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ విడుదల కావడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే భారత జట్టులో అజింక్యా రహానేతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఉండటంతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు రోహిత్ తో కలిసి ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దీనిపై రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తనతో కలిసి రహానే ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
'ధావన్ లేకపోవడం లోటే. చాంపియన్స్ ట్రోఫీతో పాటు శ్రీలంక పర్యటనలో విజయాల్లో ధావన్ పాత్ర కీలకం. అయితే అతని స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అందులో రహానే ఒకడు. వెస్టిండీస్ లో ఓపెనర్ గా మంచి ప్రదర్శన కనబరిచాడు. అదే క్రమంలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు కూడా. ఆసీస్ తో సిరీస్ లో రహానే నాతో కలిసి ఓపెనింగ్ కు వచ్చే అవకాశం ఉంది. రాహుల్ నాల్గో స్థానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ కోహ్లి కూడా రాహుల్ ను నాల్గో స్థానంలో పంపడంపైనే ఆసక్తిగా ఉన్నాడు.ఓపెనర్ గా కెరీర్ ను ఆరంభించిన రాహుల్ స్థానంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఏ స్థానంలోనైనా ఆడే ఆటగాళ్లు జట్టులో ఉండటం మంచి పరిణామం'అని రోహిత్ అన్నారు.