రహానే Vs స్పిన్నర్ లియోన్
పుణే: ఒకవైపు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయిన ఆస్ట్రేలియా ఉండగా, మరోవైపు సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ టెస్ట్ సిరీస్ కు సిద్ధమైంది. అందులోనూ విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలోనూ దూకుడే మంత్రంగా సాగిపోతున్నాడు. అయితే వచ్చిన చిక్కంతా.. భారత టెస్ట్ వైస్ కెప్టెన్, టాప్ క్లాస్ ప్లేయర్ అజింక్య రహానే ఫామ్. వరుసగా రెండేళ్లపాటు జట్టు విజయాలలో పాలుపంచుకున్న రహానే కొన్ని టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ను ఏ మేరకు ఎదుర్కుంటాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అతడి స్థానంలో ఇంగ్లండ్ తో చివరిటెస్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేయడం రహానేపై మరింత ఒత్తిడిని పెంచింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో భాగంగా రేపు (గురువారం) పుణేలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
ఆసీస్ జట్టులో అందరి దృష్టి ప్రధానంగా స్పిన్నర్ నాథన్ లియోన్ పైనే ఉంది. ఎందుకంటే అతడు ఎంతగా రాణిస్తే జట్టుకు అంత ప్రయోజనం ఉంటుందని ఆసీస్ టీమ్ మేనెజ్ మెంట్ భావిస్తోంది. కోహ్లీని ఎలాగూ ప్రత్యర్థి జట్టు అపడం కష్టమే కనుక.. ఆసీస్ స్పిన్నర్ టార్గెట్ రహానే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ తో ఆడిన మూడు టెస్టుల్లో ఓ 5 వికెట్ల ఇన్నింగ్స్ సహా 15 వికెట్లు తీశాడు లియోన్. రహానే తర్వాత ఆసీస్ స్పిన్నర్ టార్గెట్ చతేశ్వర్ పుజారా. ఇటీవల ఇంగ్లండ్ సిరీస్ లో భారత్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి కనీసం అర్ధశతకం చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం పుజారా అలవాటు. దీంతో ప్రధానంగా భారత బ్యాట్స్ మన్లలో రహానే, పుజారా వర్సెస్ స్పిన్నర్ లియోన్ పోరుగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. విదేశాల్లోనూ సులువుగా పరుగులు రాబట్టే రహానే స్వదేశంలో జరిగే ఈ సిరీస్ లో లియోన్ సహా ఆసీస్ బౌలర్లపై పైచేయి సాధిస్తాడని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.