పాకిస్థాన్ బ్యాట్స్ మన్ పై ఆగ్రహం
కరాచీ: తన బ్యాటింగ్ స్థానం మార్చడంపై మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు ఫిర్యాదు చేసిన పాకిస్థాన్ బ్యాట్స్ మన్ ఉమర్ అక్మల్ పై టీమ్ మేనేజ్ మెంట్ ఆగ్రహంగా ఉంది. తనను బ్యాటింగ్ ఆర్డర్ లో కిందకు పంపించడంపై అసంతృప్తిగా ఉన్న అక్మల్ ఈ విషయమై ఇమ్రాన్ కు ఫిర్యాదు చేశాడు. తనను టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపాలని కెప్టెన్(ఆఫ్రిది)కి చెప్పాలని ఇమ్రాన్ కు అక్మల్ మొరపెట్టుకున్నాడు. ఇమ్రాన్ తో అక్మల్ మాట్లాడుతున్న వీడియోను వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. అక్మల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపాలని ఇమ్రాన్ సూచించాడు. అక్మల్ తీరుపై మాజీ కెప్టెన్ రమీజ్ రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇమ్రాన్ ను ఎప్పుడు కలిసినా తన బ్యాటింగ్ ఆర్డర్ గురించే అక్మల్ ఫిర్యాదు చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. తర్వాతి మ్యాచ్ లో అతడికి చోటు దక్కకపోవచ్చని అన్నాడు. కోల్ కతాలో ఉన్న పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ కూడా అక్మల్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీ-20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడిన గత రెండు మ్యాచుల్లో అక్మల్ ను లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపారు. కాగా, గతంలోనూ పలుమార్లు క్రమశిక్షణ ఉల్లంఘించి అక్మల్ జరిమానా ఎదుర్కొన్నాడు.