50 ఓవర్లు... 510 పరుగులు...
ఆల్ సెయింట్స్ స్కూల్ సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఓ మ్యాచ్‌లో తొలుత 500 పరుగులు చేసి, ఆ తర్వాత ప్రత్యర్థిని 100 పరుగులకు ఆలౌట్ చేస్తే... ఇది చాలామంది క్రికెటర్లు కనే కల. దీనిని నిజం చేశారు హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్స్ స్కూల్ పిల్లలు. హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 50 ఓవర్లలో 510 పరుగులు బాదారు.
ఎలెవన్ మాస్టర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌సెయింట్స్ ఆటగాళ్లు ఏకంగా 79 బౌండరీలు, 12 సిక్సర్లు బాదారు. మధు కుమార్ (145 బంతుల్లో 185; 32 ఫోర్లు, 1సిక్స్), ఆదిశ్ శశిధరన్ (73 బంతుల్లో 143; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. మారుతి రెడ్డి (64 బంతుల్లో 90; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), సులేమాన్ (23 బంతుల్లో 53 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం అసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన ఎలెవన్ మాస్టర్స్ 25.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ఆల్ సెయింట్స్ బౌలర్లు అద్వైత్ 5, హితేశ్ యాదవ్ 4 వికెట్లు తీశారు.