సాక్షి, ఒంగోలు: హైదరాబాద్‌తో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు విజయం దిశగా సాగుతోంది. ఇక్కడి సీఎస్‌ఆర్ శర్మ కాలేజీ మైదానంలో ఓవర్‌నైట్ స్కోరు 237/1తో సోమవారం ఆట కొనసాగించిన ఆంధ్ర... తమ తొలి ఇన్నింగ్స్‌ను 153 ఓవర్లలో 8 వికెట్లకు 489 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 264 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. రెండో రోజు పూర్తిగా చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు మూడో రోజు ఫర్వాలేదనిపించారు. ఆట ఆరంభంలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ప్రశాంత్ కుమార్ (119; 15 ఫోర్లు, సిక్స్), హనుమ విహారి (55; 7 ఫోర్లు)లతో పాటు శ్రీకర్ భరత్ (5; ఫోరు)ను 20 పరుగుల తేడాలో పెవిలియన్‌కు చేర్చి ఆంధ్రను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసేలా కనిపించారు.
ఈ సమయంలో రికీ భుయ్ (69; 11 ఫోర్లు), కరణ్ షిండే (94; 13 ఫోర్లు) హైదరాబాద్ బౌలర్ల దూకుడును అడ్డుకున్నారు. వీరు బాధ్యతాయుతంగా ఆడుతూ ఐదో వికెట్‌కు 161 పరుగులు జోడించడంతో ఆంధ్రకు భారీ ఆధిక్యం ఖాయమైంది. సెంచరీ చేసేలా కనిపించిన కరణ్‌ను మెహదీ హసన్ బౌల్డ్ చేశాడు. చివర్లో శశికాంత్ (31; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆంధ్ర భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్ (3/150) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హైదరాబాద్‌ను పైడికాల్వ విజయ్ కుమార్ (3/8) దెబ్బ తీయడంతో ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ తన్మయ్ (20 బ్యాటింగ్), జావీద్ అలీ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే హైదరాబాద్ మరో 219 పరుగులు చేయాల్సి ఉంది. నేడు ఆటకు చివరి రోజు.
Comments
Please login to add a commentAdd a comment