
సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ప్రారంభించింది. సౌత్‌జోన్‌లో భాగంగా తమిళనాడుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఏడు వికెట్ల తేడాతో ఓడింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 119 పరుగులు చేసింది. రికీ భుయ్ (25; 2 ఫోర్లు, ఒక సిక్స్), రవితేజ (19), ప్రశాంత్ కుమార్ (19), షోయబ్ మొహమ్మద్ ఖాన్ (20 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం తమిళనాడు 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. కెప్టెన్ అపరాజిత్ (22 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్స్) నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో తమిళనాడుకు నాలుగు పాయింట్లు లభించాయి.
రాణించిన రాయుడు: హైదరాబాద్ గెలుపు
విజయనగరంలో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ పది పరుగుల తేడాతో కేరళను ఓడించింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ ఏటీ రాయుడు (31 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... అక్షత్ రెడ్డి (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), ఆశిష్ రెడ్డి (14 బంతుల్లో 21; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం కేరళ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 158 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ సచిన్ బేబీ (50 బంతుల్లో 79; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్ (3/28), సిరాజ్ (2/28) ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment