మనోళ్లంతే...
భారత క్రికెట్ అభిమానులకు ఆనందం కలిగినా, ఆగ్రహం వచ్చినా పట్టలేం. అంతా అతిగానే ఉంటుంది. ఇప్పుడు కటక్‌లోనూ అదే జరిగింది. మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఘోరంగా విఫలం కావడం వారిని కలచి వేసినట్లుంది. అంతే వాటర్ బాటిల్స్ విసిరి బారాబతి స్టేడియంలో రచ్చ చేశారు. భారత్‌లోని చాలా మైదానాల్లో బాటిల్స్ తీసుకురావడంపై నిషేధం ఉంది. అయితే ఇక్కడ మాత్రం చిన్న బాటిల్స్, ప్యాకెట్లను తెచ్చేందుకు అనుమతి లేకున్నా... పెద్ద బాటిల్స్ మాత్రం తీసుకెళ్ల నిచ్చారు.
తొలి ఇన్నింగ్స్ ముగియగానే ప్రేక్షకులంతా ఒకరిని చూసి మరొకరు తమ భుజ బలాన్ని ప్రదర్శించారు. ఆటగాళ్లకు తగల్లేదు కానీ బౌండరీ బయట చెత్తంతా పేరుకుపోయింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు ముగిసిన అనంతరం ఇది పెద్ద సమస్యగా మారింది. సఫారీలు విజయానికి మరో 29 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ చాలాసేపు ఆగిపోయింది. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో మరో రెండు ఓవర్ల పాటు ఆట సాగింది. కానీ మళ్లీ అంతరాయం కలిగింది. చివరకు అంపైర్లు, రిఫరీ మ్యాచ్ కొనసాగించడానికే నిర్ణయించారు.
‘భారత్ గెలిచినప్పుడు మీ విలువైన వస్తువులు విసురుతారా! అలా చేయలేనివారికి ఓడినప్పుడు ఇలాంటి చెత్త వేసేందుకు హక్కు లేదు.’
-సునీల్ గవాస్కర్