రాజ్‌కోట్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చేసిన ఒక పని కొంతమందికి నవ్వులు తెప్పించగా, మరికొంతమందిని గందరగోళానికి గురి చేసింది. తొలి టెస్టులో భాగంగా శుక్రవారం జడేజా సరదా రనౌట్ చేశాడు. అతడు చేసిన ఈ రనౌట్‌కు కెప్టెన్ కోహ్లితో పాటు బౌలర్ అశ్విన్, ఫీల్డర్ చతేశ్వర్ పుజారా అయోమయానికి గురయ్యారు.
అసలు ఏం జరిగిందంటే.. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా బౌలింగ్ ధాటికి 21 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ క్రమంలో అశ్విన్ వేసిన 12 ఓవర్ ఐదో బంతిని హెట్‌మెయిర్ ఆడాడు. బంతి కొంత దూరం వెళ్లడంతో హెట్‌మెయిర్ అవతలి ఎండ్‌లోని ఆటగాడు ఆంబ్రిస్‌ను పరుగుకు పిలిచాడు. బంతి మిడాన్‌లోకి వెళ్లింది. దాన్ని రవీంద్ర జడేజా అందుకున్నాడు. దీంతో సగం దూరం పరుగు తీసిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ గందరగోళానికి గురయ్యారు. ఇద్దరూ కీపర్ ఎండ్‌వైపే పరుగెత్తారు. బంతి అందుకున్న జడేజా బౌలర్ అశ్విన్‌కు బంతి విసరకుండా అలాగే నిలబడ్డాడు. బ్యాట్స్‌మెన్‌ను ఊరించాడు. హెట్‌మెయిర్ మళ్లీ సగం దూరం రాగానే జడేజా వికెట్ల దగ్గరకు వచ్చాడు. కానీ, గిరటేయకుండా పక్కచూపులు చూస్తున్నాడు. ఏం తెలియనట్టే నటించాడు. బ్యాట్స్‌మెన్ వేగం పెంచి క్రీజులోకి వస్తుండగా బంతిని వికెట్లకు విసిరాడు.
దీన్ని చూసిన ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు, అభిమానులు, వీక్షకులు ఒక క్షణం షాక్‌కు గురయ్యారు. బంతి వికెట్లకు తగిలింది కాబట్టి సరిపోయింది. లేదంటే మాత్రం అతడికి చుక్కలు కనిపించేవి. కాసేపటికే తేరుకున్న కోహ్లికి మాత్రం ఇది వినోదాన్ని పంచలేదు. యాంగ్రీ మ్యాన్ విరాట్ కోహ్లి.. జడేజాను చూస్తూ ఓయ్ ఏంటిది అనే అర్థం వచ్చేలా ఒక వార్నింగ్ ఇచ్చినట్లు కనబడింది.
Comments
Please login to add a commentAdd a comment