మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో అంపైర్ల తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగా ఆఖరి ఓవర్ చివరి బంతిని నో బాల్ వేయగా అది ఫీల్డ్ అంపైర్ గమనించలేదు. దాంతో అది ముంబై ఇండియన్స్ వరంగా మారగా, ఆర్సీబీకి శాపంగా మారింది. దీనిపై మ్యాచ్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు కూడా. అంపైర్లు తమ విధుల్ని సరిగా నిర్వర్తించడంలో విఫలమవుతున్నారనే అర్థం వచ్చేలా విమర్శించాడు.
(ఇక్కడ చదవండి:అంపైర్లు కళ్లు తెరవాలి: కోహ్లి )
ఆ మ్యాచ్ జరిగే రెండు రోజులు గడవకముందే మరో అంపైరింగ్ తప్పిదం కనిపించింది. ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్‌కు దిగిన క్రమంలో కింగ్స్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి డీకాక్ ఫోర్ కొట్టాడు. అది ఏడో బంతిగా నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అశ్విన్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతిని రోహిత్ పరుగులేమీ చేయకపోగా, రెండో బంతికి సింగిల్ తీశాడు. ఇక మూడో బంతి ఆడిన డీకాక్ పరుగులేమీ చేయలేదు. నాల్గో బంతికి డీకాక్ పరుగు తీయగా, రోహిత్ ఆడిన ఐదో బంతికి పరుగులేమీ రాలేదు. ఆరో బంతిని రోహిత్ సింగిల్ తీయడంతో ఓవర్ పూర్తయ్యింది. అయితే ఆ విషయాన్ని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అంపైర్ గమనించకపోవడంతో అశ్విన్ మరో బంతి వేశాడు. ఆ బంతిని డీకాక్ ఫోర్ కొట్టాడు. అసలు ఆ ఓవర్ పూర్తయ్యే సరికి ముంబైకి మూడు పరుగులే రాగా, ఏడో బంతికి ఓవర్ పూర్తి కావడంతో ముంబై ఏడు పరుగులు చేసింది. ఒకవేళ ఇది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపితే మాత్రం మరొకసారి అంపైర్లపై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది.
(ఇక్కడ చదవండి: అంపైర్లపై చర్యలుండవ్!)
Comments
Please login to add a commentAdd a comment