మిర్పూర్: ప్రపంచంలోని ఏ వేదిక పైనైనా, ఎటువంటి పిచ్‌పైనైనా తాను సెంచరీ చేయగలనని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ టి20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అయితే అంతలోనే కొంత వెనక్కి తగ్గి... అది పిచ్ స్వభావంపై ఆధారపడి ఉంటుందన్నాడు.
డిఫెండింగ్ చాంపియన్‌గా ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న తమ జట్టుకు తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకునే సత్తా ఉందన్నాడు. జట్టులో ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ లేకపోవడం లోటే అయినా గత టోర్నీలో ఆడిన జట్టులో 12 మంది ఆటగాళ్లు ఈసారి కూడా ఆడుతుండడం తమకు కలిసివచ్చే అంశమని తెలిపాడు. పలు దేశాల లీగ్‌లలో ఆడిన అనుభవంతో తనకు గొప్ప ఆటగాళ్లతో సాన్నిహిత్యం ఏర్పడిందన్న గేల్.. తాను బరిలోకి దిగిన ప్రతిసారీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నందున ఆ మేరకు తనపై ఒత్తిడి ఉంటుందని అంగీకరించాడు.
అయితే సాధ్యమైనంత మేరకు వారిని అలరించేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఇప్పటిదాకా తాను వికెట్ పడగొట్టిన సమయంలో గంగ్‌నమ్ డ్యాన్స్‌తో అలరించిన గేల్.. ఈసారి సరికొత్త స్టైల్‌తో అలరిస్తానంటున్నాడు.