
ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ టీం ఇండియా క్రికెటర్లతో చేరాడు. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఇండియా క్రికెటర్లకు బౌలింగ్ చేశాడు. టీమిండియా అక్టోబర్ 22వ తేదీన న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియంలో ఆడనుంది. మ్యాచ్ కోసం ఇరుజట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. టీమిండియా కోచ్ రవిశాస్త్రి కెప్టెన్ కోహ్లితో పాటు మిగతా క్రికెటర్లంతా నెట్స్‌లో కసరత్తులు చేస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చిన అర్జున్ కోహ్లితో పాటు మిగతా బ్యాట్స్ మెన్లకు కూడా బౌలింగ్ చేశాడు.
జూనియర్ సచిన్ బౌలింగ్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అర్జున్ మొదట శిఖర్ దావన్‌కు బౌలింగ్ చేశాడు. ఆ తరువాత కోహ్లి, అజింకా రహనే, కేదర్ జాదవ్ లకు బౌలింగ్ చేశాడు. అర్జున్ బౌలింగ్ చేస్తున్న విధానాన్ని ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా పరిశీలించారు. అర్జున్ ఇండియా క్రికెటర్లకు బౌలింగ్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. మహిళల ప్రపంచకప్ పైనల్‌కు ముందు అర్జున్ మహిళా క్రికెటర్లకు బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.