
Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు తండ్రి పేరు నిలబెట్టాడు. రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్.. 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి సచిన్ వారసత్వాన్ని ఘనంగా చాటాడు.
15 ఏళ్ల వయసులో సచిన్ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ బాది క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యాడు. 34 ఏళ్ల కిందట.. 1988 రంజీ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన సచిన్.. తన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు. తాజాగా అతని తనయుడు అర్జున్ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే శతక్కొట్టి, తండ్రికి తానే మాత్రం తీసిపోనని క్రికెట్ ప్రపంచానికి చాటాడు.
23 ఏళ్ల అర్జున్ టెండూల్కర్.. తన దేశవాలీ కెరీర్ ముంబై తరఫున మొదలు పెట్టినప్పటికీ, అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో గోవాకు షిఫ్ట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్ ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. ముంబై ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దొరకలేదు.
ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ గ్రూప్-సిలో భాగంగా నిన్న (డిసెంబర్ 13) రాజస్థాన్‌తో మొదలైన మ్యాచ్‌తో 4 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బరిలోకి దిగిన అర్జున్.. ఇవాళ సెంచరీ పూర్తి చేసుకుని 112 పరుగుల వద్ద అజేయంగా కొనసాగుతున్నాడు. మరో ఎండ్‌లో సుయాశ్ ప్రభుదేశాయ్ (172 నాటౌట్) ఇవాళే సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రెండో రోజు టీ విరామం సమయానికి గోవా 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment