
క్రీడాశాఖపై కోర్టుకెళతా: మనోజ్
పాటియాలా: అర్జున అవార్డుల జాబితాలో తన పేరును చేర్చకపోవడాన్ని అవమానంగా భావిస్తున్న బాక్సర్ మనోజ్‌కుమార్.. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళతానంటున్నాడు. కపిల్‌దేవ్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ.. ‘అర్జున’ కోసం ముందుగా నిర్ణయించిన 15 మంది క్రీడాకారుల జాబితాపై మంగళవారం సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో ఎటువంటి మార్పులూ చేయరాదని కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో మనోజ్ స్పందించాడు. ‘క్రీడాశాఖ కార్యదర్శి, సాయ్ డీజీ జిజి థామ్సన్‌లు మంగళవారం నాటి సమావేశంలో నా పేరును చేరుస్తామని మాట ఇచ్చారు.
వారు మాటను నిలబెట్టుకోకపోగా, నాకు డోపింగ్‌కు పాల్పడిన చరిత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని మనోజ్ అన్నాడు. మనోజ్ సోదరుడు, కోచ్ రాజేష్‌కుమార్ మాట్లాడుతూ.. అర్జున అవార్డుకు గత నాలుగేళ్ల ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటారని, ఈసారి దక్కకపోతే.. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మనోజ్‌కు వచ్చే ఏడాది ఆ అవకాశం ఉండదని అన్నారు.