భారత్ 10 జపాన్ 2
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ
రూపిందర్ ఆరు గోల్స్
క్వాంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్‌స ట్రోఫీ హాకీ టోర్నీని భారత జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. గత రన్నరప్ జపాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10-2తో తేడాతో గెలిచింది. తాత్కాలిక కెప్టెన్ రూపిందర్ పాల్ సింగ్ ఒక్కడే ఇందులో ఆరు గోల్స్ చేయడం విశేషం. 22న తమ తదుపరి మ్యాచ్‌లో భారత్, దక్షిణ కొరియాతో ఆడుతుంది. అద్భుత డ్రాగ్ ఫ్లిక్స్‌తో మైదానంలో పాదరసంలా కదిలిన రూపిందర్‌ను జపాన్ డిఫెండర్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. జట్టుకు లభించిన పది పెనాల్టీ కార్నర్స్‌లో ఆరింటిని రూపిందరే సాధించడం విశేషం. రమణ్‌దీప్ సింగ్ రెండు గోల్స్, తల్వీందర్ సింగ్, యూసుఫ్ అఫ్ఫాన్ చెరో గోల్ చేశారు. జపాన్ తరఫున కెంటా టనకా, హిరోమాస ఒచాయ్ గోల్స్ కొట్టారు.
పలువురు సీనియర్లు గాయాలతో జట్టుకు దూరమైనా ఆటతీరులో ఏమాత్రం మార్పు కనిపించని భారత్ ప్రత్యర్థిని చావుదెబ్బ తీసింది. రెండో నిమిషంలోనే రమణ్ దీప్ సింగ్ గోల్ అందించాడు. ఏడో నిమిషంలో జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం చిక్కింది. దీన్ని రూపిందర్ డెరైక్ట్ ఫ్లిక్ షాట్‌తో గోల్‌గా మలిచాడు. 10వ నిమిషంలోనే జట్టుకు లభించిన మరో పీసీని కూడా రూపిందర్ గోల్‌గా మలిచాడు. 15వ నిమిషంలో రమణ్‌దీప్ రివర్స్ డ్రైవ్ గోల్‌తో భారత్‌కు తొలి క్వార్టర్‌లో 4-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత కూడా రూపిందర్ 17, 19, 22 నిమిషాల్లో వెంటవెంటనే గోల్స్ చేయడంతో జట్టు ఆధిక్యం 7-0కి వెళ్లింది. 23వ నిమిషంలో ఎట్టకేలకు జపాన్ ఖాతా తెరిచింది. 38వ నిమిషంలో తన రెండో గోల్ సాధించింది. అరుుతే 46వ నిమిషంలో రూపిందర్ మరోసారి విరుచుకుపడి తన ఆరో గోల్ చేశాడు. ఇక 50వ నిమిషంలో యూసుఫ్ గోల్‌తో భారత్ విజయం పరిపూర్ణమైంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో మలేసియా 4-2తో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్‌ను ఓడించింది.