ఒకవైపు ప్రత్యర్థులుగా మాజీ విశ్వవిజేతలు... మాజీ ఒలింపిక్ చాంపియన్‌లు... ప్రపంచకప్‌లో పతకాలు గెలిచినవారు.. మరోవైపు నూనుగు మీసాల కుర్రాడు... తన ప్రత్యర్థుల్లో కొందరి అనుభవమంత వయసు కూడా అతనికి లేదు... అసలే జట్టులో అతని ఎంపికపై విమర్శలు... షాట్ షాట్‌కు ఆధిక్యం తారుమారయ్యే పరిస్థితులు... ఇలాంటి స్థితిలో ఆ కుర్రాడు మాత్రం ఒక్కో బుల్లెట్‌ను లక్ష్యంలోకి దించాడు... ఒక్కోషాట్‌తో దిగ్గజాలను వెనక్కి నెట్టాడు... చివరకు అందర్నీ అబ్బురపరుస్తూ ‘పసిడి’ గురితో భళా అనిపించాడు. తన పిస్టల్‌తోనే అందరికీ సమాధానం ఇచ్చి ఆసియా క్రీడల వేదికపై మువ్వన్నెలను రెపరెపలాడించిన ఆ యువ షూటరే 16 ఏళ్ల సౌరభ్ చౌధరీ. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కలీనా గ్రామానికి చెందిన సౌరభ్ మంగళవారం ఆసియా క్రీడల్లో అద్భుతమే చేశాడు. హేమాహేమీలు బరిలో నిలిచిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్వాలిఫయింగ్‌లో ‘టాప్’గా నిలిచి... అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించి ఆసియా క్రీడల రికార్డు ప్రదర్శనతో స్వర్ణకాంతులు విరజిమ్మి ఈ క్రీడాంశంలో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఓవరాల్‌గా పోటీల నాలుగో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం, మూడు కాంస్యాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 10 పతకాలతో ఏడో స్థానంలో ఉంది.
పాలెంబంగ్: విజయకాంక్ష ఉండాలేగానీ బరిలో ఏస్థాయి వారున్నా అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చని భారత యువ పిస్టల్ షూటర్ సౌరభ్ చౌధరీ నిరూపించాడు. ఆసియా క్రీడల్లో భాగంగా మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 16 ఏళ్ల సౌరభ్ బంగారు పతకాన్ని సాధించాడు. 24 షాట్‌లతో కూడిన ఫైనల్లో సౌరభ్ 240.7 పాయింట్లు స్కోరు చేసి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2010 ప్రపంచ చాంపియన్, 42 ఏళ్ల తొమోయుకి మత్సుదా (జపాన్–239.7 పాయింట్లు) రజతం నెగ్గగా... భారత్‌కే చెందిన 29 ఏళ్ల అభిషేక్ వర్మ (219.3 పాయింట్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత... 2010, 2014 ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకాలు నెగ్గిన 38 ఏళ్ల కొరియా దిగ్గజ షూటర్ జిన్ జొంగో ఐదో స్థానంతో... 35 ఏళ్ల కజకిస్తాన్ షూటర్ వ్లాదిమిర్ ఇసాచెంకో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 40 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్ అందరికంటే ఎక్కువగా 586 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. న్యాయవాద వృత్తిలో ఉన్న అభిషేక్ వర్మ మూడేళ్ల క్రితమే ఈ క్రీడలో అడుగు పెట్టాడు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే కాంస్యాన్ని దక్కించుకున్నాడు. మిక్స్‌డ్ ట్రాప్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జంట లక్షయ్ షెరాన్, శ్రేయసి సింగ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
ఒక్క షాట్‌తో తారుమారు...
ఫైనల్లో చివరి సిరీస్‌లోని రెండు షాట్‌లే సౌరభ్‌కు స్వర్ణాన్ని ఖాయం చేశాయి. 22 షాట్‌లు పూర్తయ్యాక మత్సుదా 220.4 పాయింట్లతో అగ్రస్థానంలో... సౌరభ్ 220.1 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 23వ షాట్‌లో మత్సుదా 8.9 స్కోరు చేయగా... సౌరభ్ 10.2 కొట్టాడు. దాంతో సౌరభ్ 230.3తో తొలి స్థానంలోకి రాగా... మత్సుదా 229.3తో రెండో స్థానానికి పడిపోయాడు. చివరి షాట్‌లో మత్సుదా 10.3 కొట్టగా... సౌరభ్ 10.4 స్కోరు చేశాడు. దాంతో సౌరభ్ పాయింట్ తేడాతో పసిడి సొంతం చేసుకోగా.. మత్సుదా రజతంతో సరిపెట్టుకున్నాడు.
మూడేళ్లలో పైపైకి...
సరదా కోసం 2015లో షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సౌరభ్ ఏడాది తిరిగేలోపు ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో పోటీపడి రజతం సాధించాడు. ఆ తర్వాతి సంవత్సరం ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచాడు. ఈ ఏడాది జూన్‌లో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకాన్ని సాధించాడు. పోటీలు లేని సమయంలో మీరట్‌లోని అమిత్ షెరాన్ అకాడమీలో... జాతీయ శిబిరాల సమయంలో భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా పర్యవేక్షణలో సౌరభ్ శిక్షణ తీసుకుంటాడు. సౌరభ్ తండ్రి జగ్‌మోహన్ సింగ్ చెరకు రైతు. ఖాళీగా ఉన్న సమయంలో సౌరభ్ పొలం పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ‘నేను ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఒత్తిడితో ఎలాంటి ఉపయోగం కూడా లేదు. నా తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం’ అని సౌరభ్ అన్నాడు.
►ఆసియా క్రీడల చరిత్రలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన ఐదో భారతీయ షూటర్ సౌరభ్. గతంలో రణ్‌ధీర్ సింగ్ (1978), జస్పాల్ రాణా (1994, 2006), రంజన్ సోధి (2010), జీతూ రాయ్ (2014) ఈ ఘనత సాధించారు.
సెకనులో వందో వంతు తేడాతో...
పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో భారత స్విమ్మర్ వీర్‌ధవల్ ఖడేను దురదృష్టం వెంటాడింది. కేవలం సెకనులో వందో వంతు తేడాతో అతడు కాంస్యం చేజార్చుకున్నాడు. ఫైనల్లో ఖడే 22.47 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు. అయితే, జపాన్‌కు చెందిన షునిచి నకావ్ (22.46)... అతడి కంటే .01 సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకం ఎగురేసుకుపోయాడు. పతకం కోల్పోయినా, 26 ఏళ్ల ఖడే ఎనిమిదేళ్లుగా తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (22.52 సెకన్లు)ను సవరించాడు. ఇదే విభాగంలో అన్షుల్ కొఠారి (23.83 సెకన్లు)... 28వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.
ఉద్యోగం వస్తుందని ఆశ...
పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత సీనియర్ షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ తొలిసారి ఆసియా క్రీడల్లో వ్యక్తిగత పతకం సాధించాడు. ఫైనల్లో 37 ఏళ్ల సంజీవ్ 452.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచాడు. 18 ఏళ్లకే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందిన సంజీవ్ 2014లో హరియాణా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో అతను నేవీ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సంజీవ్‌కు ఇచ్చిన హామీ నెరవేరలేదు. రెండేళ్లు ఖాళీగా ఉన్న అతను 2016లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో కోచ్‌గా విధుల్లోకి చేరాడు. అయితే గతేడాది అతనిపై అత్యాచార ఆరోపణలు రావడంతో ‘సాయ్’ అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. ‘తాజా ప్రదర్శనతో మళ్లీ నాకు ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా తర్వాతి లక్ష్యం’ అని సంజీవ్ అన్నాడు.
సెపక్‌తక్రాలో తొలిసారి కాంస్యం...
1990 నుంచి ఆసియా క్రీడల్లో మెడల్ ఈవెంట్‌గా ఉన్న సెపక్‌తక్రాలో తొలిసారి భారత్ కాంస్య పతకం సాధించింది. పటిష్టమైన థాయ్‌లాండ్ జట్టుతో మంగళవారం జరిగిన రెగూ ఈవెంట్ సెమీఫైనల్లో భారత్ 0–2తో ఓడిపోయి కాంస్యం ఖాయం చేసుకుంది. 2006లో తొలిసారి ఈ క్రీడలో పోటీపడిన భారత్ నాలుగో ప్రయత్నంలో పతకం నెగ్గడం విశేషం.
భారత్ 21 – 0 కజకిస్తాన్
మహిళల హాకీలో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు గోల్స్ వర్షం కురిపించారు. పూల్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 21–0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ ఐదు, గుర్జీత్ కౌర్ నాలుగు, లల్రెమ్‌సియామి, వందనా కటారియా మూడేసి గోల్స్ కొట్టారు. భారత్ మరొక్క గోల్ చేసి ఉంటే... 1982 ఆసియా క్రీడల్లో హాంకాంగ్‌పై భారత్ సాధించిన 22–0 రికార్డు స్కోరును అందుకునేది.
దివ్య పట్టుకు కాంస్యం
రెజ్లింగ్‌లో భారత్‌కు మరోపతకం వచ్చింది. మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ కాంస్య పతకాన్ని సాధించింది. చెన్ వెన్‌లింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన కాంస్య పతక బౌట్‌లో దివ్య ఒక నిమిషం 29 సెకన్లలో విజయాన్ని అందుకుంది. మరోవైపు 76 కేజీల విభాగంలో కిరణ్ క్వార్టర్ ఫైనల్లో 2–4తో ఐపెరి మెడిట్‌కిజి (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత్‌కు చెందిన జ్ఞానేందర్ (60 కేజీలు)... మనీశ్ (67 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశారు.
వాల్ట్ ఫైనల్లో అరుణా రెడ్డి
మహిళల జిమ్నాస్టిక్స్‌లో భారత క్రీడాకారిణులు ఆకట్టుకున్నారు. వాల్ట్‌లో ప్రణతి నాయక్ (13.425), హైదరాబాద్ అమ్మాయి అరుణారెడ్డి (13.350)లు ఆరు, ఏడు స్థానాల్లో నిలిచి ఫైనల్ రౌండ్‌కు వెళ్లారు. స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన ఆమె...బీమ్‌లో మాత్రం ముందడుగేసింది. టీమ్ విభాగంలో దీపా, ప్రణతి, అరుణ, ప్రణతి దాస్‌లతో కూడిన భారత బృందం ఏడో స్థానంలో నిలిచింది. బుధవారం టీమ్ విభాగంలో ఫైనల్స్ ను నిర్వహిస్తారు.
సెమీస్‌లో కబడ్డీ జట్లు
కీలకమైన విజయాలతో భారత కబడ్డీ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. గ్రూప్ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో పురుషుల జట్టు 49–30తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్‌లో భారత్... బంగ్లాదేశ్, శ్రీలంకపై గెలిచి, దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. కొరియా మ్యాచ్‌లు పూర్తయ్యాక.. గ్రూప్ టాపర్ ఎవరో తేలనుంది. మరోవైపు మహిళల జట్టు శ్రీలంకను 38–12తో, ఇండోనేసియాను 54–22తో ఓడించింది. అంతకుముందు జపాన్, థాయ్‌లాండ్‌లపైనా విజయం సాధించడంతో గ్రూప్ ‘ఎ’లో అజేయంగా నిలిచినట్లైంది. సెమీఫైనల్స్ గురువారం జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment