![Saurabh Chaudhary shoots down junior record for gold at ISSF - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2018/09/7/Untitled-12.jpg.webp?itok=TDHBNGYC)
చాంగ్‌వాన్ (దక్షిణ కొరియా): ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గి సంచలనం సృష్టించిన 16 ఏళ్ల భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి అదే జోరును ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కొనసాగించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ ఈవెంట్‌లో అతను బంగారు పతకం సాధించాడు. ఈ పోటీలో సౌరభ్ 245.5 స్కోరుతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (243.7 పాయింట్లు)ను తానే అధిగమించి కొత్త రికార్డు సృష్టించాడు. జర్మనీలో జూన్‌లో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు.
హోజిన్ లిమ్ (243.1 పాయింట్లు; కొరియా) రజతం నెగ్గగా, అర్జున్ సింగ్ చీమా (218 పాయింట్లు; భారత్) కాంస్యం గెలిచాడు. పలు టీమ్ ఈవెంట్లలో భారత షూటర్లు పతకాలపై గురి పెట్టారు. జూనియర్ పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో అమన్ అలీ, వివాన్ కపూర్, మానవాదిత్య సింగ్ రాథోడ్‌లతో కూడిన భారత బృందం (348 పాయింట్లు) రజత పతకం గెలిచింది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ఓంప్రకాశ్, షాజర్ రిజ్వీ బృందం (1738 పాయింట్లు) రజతం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment