శివ కేశవన్‌కు స్వర్ణం
నగానో (జపాన్): భారత స్టార్ వింటర్ ఒలింపియన్ శివ కేశవన్ మరోసారి రాణించాడు. ఆసియా ల్యూజ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ అతను అద్భుత ప్రతిభతో విజేతగా నిలిచాడు. గంటకు 130.4 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన అతను ఒక నిమిషం 39.962 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తనాకా షోహీ (జపాన్–1ని:44.874 సెకన్లు) రజత పతకాన్ని సంపాదించగా... లియెన్ తె ఆన్ (చైనీస్ తైపీ–1ని:45.120 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు.
35 ఏళ్ల శివ కేశవన్ ఇప్పటివరకు వరుసగా ఐదు వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు దూరంగా నిలిచిన కేశవన్... 2018లో కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, వరల్డ్ కప్ సర్క్యూట్ ఈవెంట్స్‌లో పాల్గొని ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానని తెలిపాడు.