హైదరాబాద్: సరిగ్గా నాలుగేళ్ల క్రితం నగరం జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు వేదికైంది. నాడు జరిగిన పోటీల్లో సత్తా చాటిన హైజంపర్ సహానా కుమారి లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు మరో సారి ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ ఇక్కడే జరగనుంది. రేపటి (మంగళవారం) నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయి. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు టోర్నీ వివరాలు వెల్లడించారు. జూలై 2 వరకు ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తారు.
రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత అథ్లెట్లకు ఇది చివరి అవకాశం. ఇక్కడ నిర్ధారిత టైమింగ్ నమోదు చేస్తే భారత్ నుంచి మరింత మంది అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవుతారు. 25 రాష్ట్రాల నుంచి పురుషుల విభాగంలో 645, మహిళల విభాగంలో 237 మంది అథ్లెట్లు ఇందులో పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు భారత్ నుంచి 21 మంది అథ్లెట్లు రియోకు అర్హత సాధించారు.