లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టాప్–8 ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్ కోసం తలపడనున్నారు. ‘పీట్ సంప్రాస్ గ్రూప్’లో రాఫెల్ నాదల్ (స్పెయిన్), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), డేవిడ్ గాఫిన్ (బెల్జియం)... ‘బోరిస్ బెకర్ గ్రూప్’లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మారిన్ సిలిచ్ (క్రొయేషియా), జాక్ సోక్ (అమెరికా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఉన్నారు.
గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్), స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ టోర్నీకి దూరమయ్యారు. దాంతో ఇద్దరు దిగ్గజాలు ఫెడరర్, రాఫెల్ నాదల్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ ఏడాది వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ... నాదల్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు.
ఆదివారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో జాక్ సోక్‌తో ఫెడరర్; జ్వెరెవ్‌తో సిలిచ్ ఆడతారు. రెండు గ్రూప్‌ల లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆయా గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈనెల 18న సెమీఫైనల్స్, 19న ఫైనల్ జరుగుతుంది. ఇదే టోర్నీ సందర్భంగా ఎనిమిది జోడీల మధ్య డబుల్స్ విభాగం మ్యాచ్‌లు కూడా జరుగుతాయి.
టెన్నిస్ ఆటగాళ్లందరూ గ్రాండ్‌స్లామ్ టోర్నీల తర్వాత ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 1970లో మొదలైన ఈ టోర్నీని తొలుత ‘మాస్టర్స్ గ్రాండ్‌ప్రి’ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత 1990లో దీనిని ‘ఏటీపీ టూర్ వరల్డ్ చాంపియన్‌షిప్’గా వ్యవహరించారు. 2000లో ‘టెన్నిస్ మాస్టర్స్ కప్’గా పేరు మార్చగా... 2009 నుంచి ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌గా పిలుస్తున్నారు.
భారీ మొత్తం...
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో పాల్గొన్న వారందరికీ భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభిస్తుంది. సింగిల్స్ విభాగంలో పాల్గొనే ఆటగాళ్లకు 1,91,000 డాలర్లు (రూ. కోటీ 24 లక్షలు) చొప్పున పార్టిసిపేషన్ ఫీజు చెల్లిస్తారు. రౌండ్ రాబిన్ లీగ్‌లో ఒక్కో విజయానికి 1,91,000 డాలర్లు (రూ. కోటీ 24 లక్షలు) అందజేస్తారు.
సెమీఫైనల్లో గెలిచిన వారికి 5,85,000 డాలర్లు (రూ. 3 కోట్ల 81 లక్షలు)... ఫైనల్లో నెగ్గిన వారికి 12 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 82 లక్షలు) లభిస్తాయి. అజేయ చాంపియన్‌కు మాత్రం 25 లక్షల 49 వేల డాలర్లు (రూ. 16 కోట్ల 61 లక్షలు) దక్కుతాయి.
Comments
Please login to add a commentAdd a comment