ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ విజేత జ్వెరెవ్
లండన్: ఈ ఏడాదిని గొప్ప విజయంతో ముగించాలని ఆశించిన సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఐదుసార్లు మాజీ చాంపియన్ జొకోవిచ్ ఈసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల జర్మనీ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ 6–4, 6–3తో జొకోవిచ్‌ను ఓడించి ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ను తొలిసారి గెల్చుకున్నాడు. సెమీస్‌లో రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై సాధించిన విజయం గాలివాటమేమీ కాదని ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్‌ను ఓడించి జ్వెరెవ్ నిరూపించాడు. ‘ఈ విజయాన్ని ఎలా వర్ణించాలో తెలియడంలేదు. నా జీవితంలోనే అతి పెద్ద విజయమిది. అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీపడి గెలిచినందుకు అద్భుతంగా అనిపిస్తోంది’ అని ఈ సీజన్‌ను నాలుగో ర్యాంక్‌లో ముగించిన జ్వెరెవ్ వ్యాఖ్యానించాడు.
హావిజేత జ్వెరెవ్‌కు 25 లక్షల 9 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 17 కోట్ల 96 లక్షలు), 1300 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ జొకోవిచ్‌కు 14 లక్షల 32 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 25 లక్షలు), 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. హాఈ టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లో జ్వెరెవ్ 4–6, 1–6తో జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో విజయంతో లీగ్ దశ ఓటమికి బదులు తీర్చుకున్నాడు. హాఅజేయంగా ఫైనల్‌కు చేరిన జొకోవిచ్ ఈ క్రమంలో ఒక్కసారి కూడా సర్వీస్‌ను కోల్పోలేదు. అయితే ఫైనల్లో జ్వెరెవ్ తన తడాఖా చూపించాడు. ఏకంగా నాలుగుసార్లు జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. అంతేకాకుండా 10 ఏస్‌లు కూడా సంధించాడు. హా 80 నిమిషాలపాటు సాగిన టైటిల్ పోరులో తొలి సెట్ తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. పదో గేమ్‌లో తన సర్వీస్‌లో మూడు ఏస్‌లు సంధించి గేమ్‌తోపాటుసెట్‌ను 6–4తో దక్కించుకున్నాడు. హారెండో సెట్ బ్రేక్ పాయింట్లతో మొదలైంది. తొలి గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను జ్వెరెవ్... రెండో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను జొకోవిచ్ బ్రేక్ చేశారు.
మూడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన జ్వెరెవ్ ఆ తర్వాతతన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–1తో ముందంజ వేశాడు. ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను కళ్లు చెదిరే బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. హా 2008లో జొకోవిచ్ (21 ఏళ్లు) తర్వాత ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు. హా జర్మనీ తరఫున బోరిస్ బెకర్ (1995లో) తర్వాత ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన రెండో జర్మన్ ప్లేయర్ జ్వెరెవ్ కావడం విశేషం. హాఆండీ అగస్సీ (1990లో) తర్వాత టాప్ సీడ్, రెండో సీడ్ క్రీడాకారులను ఓడించి ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచిన మరో ప్లేయర్ జ్వెరెవ్.
Comments
Please login to add a commentAdd a comment