చెన్నై: వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టును సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ప్రారంభించనుంది. ఇక్కడికి రాకముందు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడి వచ్చిన ఆసీస్.. వన్డే ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు నేడు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. భారత్‌తో జరగబోయే ఐదు వన్డేల సిరీస్‌కు ముందు స్పిన్‌లో తగిన ప్రాక్టీస్‌కు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోనుంది.
స్మిత్, వార్నర్, మ్యాక్స్‌వెల్ ఆసీస్ జట్టులో కీలకం కానున్నారు. ఇక బోర్డు ఎలెవన్‌లో ఆసీస్‌ను ఎదుర్కొన్న అనుభవం ఒక్క కెప్టెన్ గుర్‌కీరత్ సింగ్ మాన్‌కు మాత్రమే ఉంది. చాలామంది ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతుండటంతో ఎక్కువగా తృతీయ కేటగిరీ క్రికెటర్లను ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో మెరిసిన రాహుల్ త్రిపాఠి, నితిష్ రాణా, వాషింగ్టన్ సుందర్ పటిష్ట జట్టుపై తమ సత్తా చూపించేందుకు ఎదురుచూస్తున్నారు.