శశిథరూర్
టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలవగానే శశిథరూర్ వర్డ్.. ఆఫ్ ది డే : ‘ఎపికేరికసీ’ అంటూ ట్వీట్ చేశారు. ఆ మాటకు స్పెల్లింగ్ Epicaricacy. ఆ మాటకు అర్థం.. ఒకరి బాధ ఇంకొకరికి సంతోషం అవడం. అయితే ఆయన ఉద్దేశం నేరుగా అదే కాకపోయినా, ఇండియాను.. చేతులెత్తేస్తుందనీ, కళ్లు తేలేస్తుందనీ, తలకిందులు అవుతుందనీ.. జోస్యం చెప్పిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ దిగ్గజాలకు ఇండియా గెలుపు తగిన సమాధానం చెప్పడం తనకెంతో ఆనందంగా ఉందని శశిథరూర్ చెప్పదలచుకున్నారు. అందుకు నిదర్శనంగా తన ‘వర్డ్ ఆఫ్ ది డే’ ట్వీట్‌కు.. ఈ సీరీస్‌లో టీమ్ ఇండియా పరాజయాన్ని ఊహించి మరీ కామెంట్స్ చేసిన వారి ఫొటోలను, వారి మాటలను జోడించారు. ఇంగ్లిష్ బాగా తెలిసిన వారికి టీమ్ ఇండియాపై ఎనలేని అభిమానం ఉంటే ఎలా స్పందిస్తారో సరిగ్గానే అలానే స్పందించారు శశి థరూర్.
శశిథరూర్ కాంగ్రెస్ నాయకుడు. తిరువనంతపురం (కేరళ) ఎంపీ. ఇంగ్లిష్ అన్నా, క్రికెట్ అన్నా ఇష్టం. ఇంగ్లిష్‌లో తనని ఎవరైనా పండితుడని అంటే ఆయన ఒప్పుకోరు కానీ, చేతన్ భగత్ వంటి ఆంగ్ల భాషా నవలా రచయితలు థరూర్‌ని.. ఆ పద సంపదను చూసి.. ఆరాధిస్తారు. ఈమధ్య మీరు చదివే ఉంటారు. ఈమధ్యంటే.. గత సెప్టెంబరులో. చేతన్ భగత్ ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికలో ఒక కామెంట్ రాశాడు. యూత్ అస్తమానం ఫోన్ గిల్లుకుంటూ కూర్చోవడం మాని, కాస్త దేశ ఆర్థిక స్థితి గురించి ఆలోచించాలని. గోళ్లు గిల్లుకోవడం అనే నానుడినే ఇప్పటి పరిస్థితులను బట్టి ఫోన్‌లు గిల్లుకోవడం అన్నాడు చే తన్. ఆ పన్, ఆ పెన్ థరూర్‌కి నచ్చింది. నచ్చిందని మామూలుగా చెబుతారా! తన స్టెయిల్‌లో చెప్పారు.
భారీ పదాల్లో! ‘ఓ మైడియర్ చేతన్.. నీ కాలమ్ Sesquipedalian అన్నారు. Rodomanted అన్నారు. Limpid perspicacity అని ఇంకో మాట కూడా వేశారు. ఆఖర్న సుపర్బ్ పీస్ అన్నారు. ఈ పదాలేవీ చేతన్ విని ఉండనివి కాకున్నా.. అంత పెద్ద థరూర్ తనను ప్రశంసించడం చేతన్‌లో చురుకుదనం పుట్టించింది. వెంటనే.. సర్, మరికొన్ని గంభీరమైన పదాల్లో నన్ను మీరు అభినందించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ పెట్టాడు. అది వాళ్లిద్దరి సరదా! సమస్థాయి కనుక. ఏమైనా థరూర్‌తో ఇంగ్లిష్ వర్డింగ్ యూసేజ్‌లో తలపడగలవారెవరూ ప్రస్తుతానికైతే ఇండియాలో లేరు. ఒకవేళ తల పండిన వాళ్లెవరైనా ఉన్నా.. వాళ్లకు తలపడే తలంపు లేకపోవచ్చు.
శశి థరూర్‌కి ఇంగ్లిష్ అంటే ఎంత ఆపేక్షో క్రికెట్ అంత ఇష్టం. ఈ సంగతి ఇండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రితో ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతున్నప్పుడు థరూర్ బయటపెట్టారు. అసలు క్రికెట్ ప్రస్తావన ఎందుకొచ్చింది? సునీల్ స్పోర్ట్స్ పర్సన్ కనుక థరూర్‌ని మీకే ఆట అంటే ఇష్టం. మీరు ఏ ప్లేయర్‌ని ఇష్టపడతారు.. అని అడిగారు. ఏ ఆట అంటే ఇష్టం అన్నప్పుడు ‘ఐయామ్ ఎ క్రికెట్ ట్రాజిక్’ అని చెప్పారు. క్రికెట్ అంటే పడి చచ్చిపోతానని. ‘‘సరే, మీకు ఇష్టమైన క్రికెటర్ పేరు చెప్పండి?’’ అని అడిగారు సునీల్. ఒకరని చెప్పలేను. ఓ ఇరవై మంది పేర్లు చెప్పమంటే చెప్తాను’’ అని థరూర్. ‘‘పోనీ ఇది చెప్పండి. అందరికంటే ముందుగా మీరు అభిమానించిన భారతీయ క్రికెటర్ ఎవరో చెప్పండి’’ అని సునీల్ మరో ప్రశ్న. ఎం.ఎల్. జైసింహ పేరు చెప్పారు థరూర్.
ఆయనే ఎందుకంటే.. ఆడతాడు ప్లస్ చూడ్డానికీ బాగుంటాడు అని థరూర్ ఆర్సర్. మెడకు కర్చీఫ్ కట్టుకోవడం అదీ ‘లుక్స్ నైస్’ అట. థరూర్‌కి నచ్చిన మరో క్రికెట్ ప్లేయర్ ఎం.ఎ.కె. పటౌడీ. 1961లో ఇంగ్లండ్‌లో జరిగిన కారు ఆక్సిడెంట్‌లో పటౌడీ కుడి కన్ను దెబ్బతిని చూపు పోయింది. ‘‘ఒక కంటి చూపు లేకున్నా ఆయన అద్భుతంగా ఆడేవారని’’ అంటారు థరూర్. అది నిజమే. చూపునకు, చూసే దృష్టికీ సంబంధం ఉండదు. ఆ సంగతిని ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెట్ పూర్వపు దిగ్గజాలు తెలుసుకునే ఉంటారు. టీమ్ ఇండియాను వాళ్లు తక్కువ చూపు చూశారు. టీమ్ ఇండియా తమ గెలుపుతో వాళ్ల కళ్లు తెరిపించింది.
►వాళ్ల బ్యాటింగ్ చూడండి. విరాట్ కోహ్లీ లేకుండా తర్వాతి రెండు టెస్ట్ మ్యాచిల్లో వాళ్లెలా ఆడబోతున్నారో మీరు ఊహించగలరా? టీమ్ ఇండియా పీకలోతు కష్టాల్లో పడిపోయింది. – మైఖేల్ క్లార్, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్
►తెలిసిపోతూనే ఉంది. ఏమీ దాచేపనిలేదు. కోహ్లీ లేడు. అతడే లేకపోయాక ఇండియా జట్టును ఇంకెవరూ కాపాడలేదు. ఓడిపోబోవడం కన్నా, కోహ్లీ లేకపోవడం పెద్ద నష్టం టీమ్ ఇండియాకు. – రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్
►మూడో రోజు (అడిలైడ్‌లో) ఆస్ట్రేలియా ఇండియాను తుడిచిపెట్టేశాక, తిరిగి వాళ్లెలా పుంజుకుంటారో నేను ఊహించలేకున్నాను. – మార్క్ వా, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్
►చెప్పాను కదా. టెస్ట్ సీరీస్‌లో ఇండియా తలబొప్పి కట్టబోతోంది. – మైఖేల్ వాగన్, ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్
►టెస్ట్ మ్యాచ్‌లో వాళ్లకున్న ఒకే ఒక గెలుపు అవకాశం అడిలైట్ అనుకున్నాను. అక్కడే గెలవలేకపోయారు. – బ్రాడ్ హడిన్, ఆస్ట్రేలియా జట్టు మాజీ వికెట్ కీపర్
Comments
Please login to add a commentAdd a comment