క్రీజ్‌లోకి మళ్లీ ‘మాస్టర్‌’  | Australia Cricket Board Conducted Bushfire Charity Cricket Match | Sakshi
Sakshi News home page

క్రీజ్‌లోకి మళ్లీ ‘మాస్టర్‌’ 

Published Mon, Feb 10 2020 2:06 AM | Last Updated on Mon, Feb 10 2020 2:06 AM

Australia Cricket Board Conducted Bushfire Charity Cricket Match - Sakshi

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ ‘దేవుడు’ సచిన్‌ టెండూల్కర్‌ మళ్లీ క్రీజులోకి దిగాడు. తనను క్రికెట్‌లో రారాజుగా చేసిన బ్యాటింగ్‌తో మళ్లీ మెరిశాడు. ‘కార్చిచ్చు’తో మసి అయిన ఆస్ట్రేలియాలో తన పెద్ద మనసు చాటుకున్నాడు. విరాళాలు పోగు చేసే సత్కార్యంలో తన బ్యాటింగ్‌ ఆట చూపెట్టాడు. బ్యాటింగ్‌ ఎవరెస్ట్, క్రికెట్‌ గ్రేటెస్ట్‌కు బౌలింగ్‌ చేసే అదృష్టం ఆస్ట్రేలియన్‌ మహిళల జట్టు సూపర్‌స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ దక్కించుకుంది. ఈ ‘మెన్‌ ఇన్‌ బ్లూ’ ఆటగాడు కొంగొత్త డ్రెస్సింగ్‌తో బరిలోకి దిగాడు. పసుపు రంగు హెల్మెట్‌ ధరించి, అల్ట్రాలైట్‌ కూకాబుర్రా లోగో (సాధారణంగా ఎంఆర్‌ఎఫ్‌ లేదంటే అడిడాస్‌ లోగో) ఉన్న బ్యాట్‌తో ఐదు నిమిషాలు సచిన్‌ బ్యాటింగ్‌ చేశాడు.

షార్ట్‌ ఫైన్‌ లెగ్, డీప్‌ స్క్వేర్‌లో తనదైన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అక్కడి ప్రేక్షకుల్ని టెండూల్కర్‌ అలరించాడు. నిజానికి కార్చిచ్చు విరాళాల సేకరణలో పాలుపంచుకునేందుకు అక్కడికి వెళ్లాడు. కానీ 10 ఓవర్ల ఆటలో మాత్రం ఆడలేదు. అయితే మహిళా స్టార్‌ పెర్రీ తన బౌలింగ్‌ను ఎదుర్కోవాలని సామాజిక సైట్‌లో వీడియో మెసేజ్‌ చేయగా... సచిన్‌ సరేనంటూ ఆమె ముచ్చట తీర్చాడు. తన క్రికెట్‌ అభిమానుల్ని అలరించాడు. అంతకుముందు జరిగిన 10 ఓవర్ల పొట్టి మ్యాచ్‌లో పాంటింగ్‌ ఎలెవన్‌ పరుగు తేడాతో గిల్‌క్రిస్ట్‌ ఎలెవన్‌పై నెగ్గింది.

పాంటింగ్‌ జట్టు 104/5 స్కోరు చేయగా... మన యువరాజ్‌ సింగ్‌ (2) ఆడిన గిల్‌క్రిస్ట్‌ జట్టు 103/6 వద్ద ఆగిపోయింది. లారా, కోట్నీ వాల్‌‡్ష, వసీమ్‌ అక్రమ్, పాంటింగ్, హేడెన్, గిల్‌క్రిస్ట్, వాట్సన్, సైమండ్స్‌ తదితర క్రికెటర్లు చారిటీ మ్యాచ్‌లో ఉత్సాహంగా ఆడారు. ఈ మ్యాచ్‌ ద్వారా 77 లక్షల 23 వేల 129 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 36 కోట్ల 85 లక్షలు) విరాళంగా సేకరించామని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ మొత్తాన్ని కార్చిచ్చు బాధితులకు అందజేస్తామని తెలిపింది.

ఔరా... లారా... 
క్రికెట్‌ తెలిసిన వారికి లారా తెలియకుండా ఉండడు. వెస్టిండీస్‌ క్రికెట్‌లోనే కాదు... ప్రపంచ క్రికెట్‌లోనే అసాధారణ బ్యాటింగ్‌ మాంత్రికుడు బ్రియాన్‌ లారా. అతని ఆట, కెరీర్‌ ఎంతో అద్భుతంగా సాగింది. ఇంకా చెప్పాలంటే అతని రికార్డు (టెస్టుల్లో 400 నాటౌట్‌) ఇంకా చెక్కు చెదరలేదు. 50 ఓవర్లలోనే 350 లక్ష్యమైనా ఉఫ్‌మని ఊదేస్తున్న ఈ రోజుల్లో... వన్డేల్లోనే డబుల్‌ సెంచరీల మీద డబుల్‌ సెంచరీలు బాదుతున్న రోహిత్, పరుగులు పరుగుల్లా కాకుండా వరదలెత్తిస్తున్న విరాట్, విధ్వంసం సృష్టించే వార్నర్‌లాంటి వారంతా ఉన్న నేటితరం క్రికెట్లో... లారా సంప్రదాయ క్రికెట్‌లో సాధించిన ‘క్వాడ్రపుల్‌ సెంచరీ’ జోలికి ఎవరూ వెళ్లలేకపోయారు. కానీ లారా మాత్రం తనకు ఏమాత్రం తెలియని టి20 క్రికెట్‌ను అవలీలగా ఆడేస్తానని తన బ్యాట్‌తో అది కూడా 50 ఏళ్ల వయసులో చాటడం గొప్ప విశేషం. ఈ క్రికెట్‌ చరిత్రకారుడు బుష్‌ఫైర్‌ (కార్చిర్చు) చారిటీ మ్యాచ్‌లో పాంటింగ్‌ ఎలెవన్‌ తరఫున 10 ఓవర్ల క్రికెట్‌ ఆడాడు. 11 బంతుల్లోనే 30 పరుగులు చేశారు. అతని 3 ఫోర్లు, 2 సిక్సర్లు చూస్తే మాత్రం ఇప్పటికీ అతను తాజాగా ఆడుతున్న క్రికెటర్‌నే గుర్తుచేస్తాయి తప్ప రిటైర్డ్‌ క్రికెటర్‌ అని అనిపించదు!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement