న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కబళించని రంగం లేదు. ఈ వైరస్ బారిన పడి నష్టపోని వ్యాపారం మనకు కనిపించదు. ముఖ్యంగా క్రీడారంగంపై దీని ప్రభావం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వైరస్ దెబ్బకు ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్సే వెనక్కి వెళ్లిపోయాయి. ఐపీఎల్ స్థితి అగమ్యగోచరంగా తయారైంది. మైదానాలు బోసి పోతున్నాయి. ఆటలెప్పుడు ప్రారంభమవుతాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే కోవిడ్–19 కట్టడి తర్వాత కూడా పరిస్థితులు మాత్రం మునుపటిలా ఉండవంటున్నారు దిగ్గజ క్రీడాకారులు. మ్యాచ్‌ల కోసం ప్రేక్షకులు పోటెత్తడం కష్టమేనని అంటున్నారు. జట్టుగా ఆడే క్రీడల్లో ఆటగాళ్లు స్వేచ్ఛగా కదల్లేరంటూ... కరోనా తర్వాత ఆటల్లో వచ్చే మార్పు గురించి భారత క్రీడారంగం ప్రముఖులు సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా, మేరీకోమ్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, సాయిప్రణీత్, మహేశ్ భూపతి వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే...
మరో మాటకు తావు లేకుండా మన జీవితకాలంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే. దీని కారణంగా బౌలర్లు బంతిని మెరిపించేందుకు ఉమ్మిని వాడాలంటే జంకుతారు. మైదానంలో సహచరులను కౌగిలించుకోవాలన్నా, అభినందించాలన్నా భయపడతారు. ఆటలోనూ భౌతిక దూరం పాటిస్తారు. –సచిన్ టెండూల్కర్ (క్రికెటర్)
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసే సాధనం క్రీడలు. వీటికి ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు ఆరోగ్య భద్రత కోసం విధించిన ఆంక్షలు భవిష్యత్‌లో మేలు చేస్తాయి. సాధారణ ప్రజలు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ వహించి ఆటలను జీవితంలో భాగంగా చేసుకుంటారు. – అభినవ్ బింద్రా (షూటర్)
క్రీడలు ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు. ఒక్కసారి వైరస్ నుంచి మనం బయటపడితే యథావిధిగా ఆటలు జరుగుతాయి. –మహేశ్ భూపతి (టెన్నిస్ ప్లేయర్)
పరిస్థితి సద్దుమణిగి ప్రపంచం మునుపటిలా మారిపోవాలని మనందరం కోరుకుంటున్నాం. కానీ అలా జరిగే అవకాశం కనిపించట్లేదు. కంటికి కనబడని ఈ శత్రువు కారణంగా ఆట స్వరూపం మారుతోంది. ప్రత్యర్థిని తాకకుండా బాక్సింగ్‌లో తలపడలేం. ఇదే ఆందోళన కలిగిస్తోంది. ప్రాక్టీస్‌లో కూడా తీవ్రత తగ్గిపోయింది. దీనికి నేను వ్యతిరేకం. అంతా చక్కబడ్డాక మ్యాచ్ చూసేందుకు అభిమానులు వస్తారు. వారి కోసం అత్యున్నత స్థాయిలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలి. వ్యాక్సిన్ కనిపెడితే మునుపటి పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. అంతవరకు ప్రయాణాలు, ప్రాక్టీస్ అన్ని విషయాల్లో రాజీ పడాల్సిందే. – మేరీకోమ్ (బాక్సర్)
అభిమానులతో మైదానాల్లో క్రీడల నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితం కాదు. మరో ఏడాది వరకు ఆటల్ని నిర్వహించకపోవడమే ఉత్తమం. నా అభిప్రాయం ప్రకారం మనం కొంతకాలం ఓపిక పట్టాల్సిందే.
– కోనేరు హంపి (చెస్ గ్రాండ్‌మాస్టర్)
ప్రపంచం దీని నుంచి బయటపడేందుకు మరికొంత సమయం పడుతుంది. దాదాపు ఒక సీజన్ క్రీడలు ఆగిపోయాయి. చాలా మంది క్రీడాకారులను ఇది ప్రభావితం చేస్తుంది. మరో ఆరు నెలలు లేదా సంవత్సరంలో ఎటువంటి సమస్య లేకుండా ఆటలు జరుగుతాయని అనుకుంటున్నా. – హారిక (చెస్ గ్రాండ్‌మాస్టర్)
బ్యాడ్మింటన్ టోర్నీలు ఆడే క్రమంలో చైనా, కొరియా లాంటి దేశాలకు తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆడే సమయంలో లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనస్సులో కచ్చితంగా వైరస్‌కు సంబంధించిన భయం ఉంటుంది. మ్యాచ్ సమయంలో షర్ట్ మార్చుకునేటపుడు లేదా షటిల్‌ను ఆటగాళ్లు, సర్వీస్ జడ్జి తాకాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాకే ఆట జరగాలని కోరుకుంటున్నా.
– సాయిప్రణీత్ (షట్లర్)
Comments
Please login to add a commentAdd a comment