న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం (ఏప్రిల్ 24) 48వ పడిలోకి అడుగుపెట్టాడు. కానీ వేడుకకు మాత్రం ‘మాస్టర్’ దూరంగా ఉన్నాడు. కరోనా మహమ్మారి వల్ల అంతా అతలాకుతలమవుతున్న వేళ తను పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం తగదని సచిన్ నిర్ణయించుకున్నాడు. ‘నా జన్మదినం నా తల్లి ఆశీర్వాదంతోనే మొదలవుతుంది. ఆమె ఇచ్చిన గణపతి బప్పా ప్రతిమ అమూల్యమైంది’ అని ట్విట్టర్‌లో ఈ బ్యాటింగ్ లెజెండ్ పోస్ట్ చేశాడు. ఈ క్రికెట్ దేవుడి పుట్టినరోజంటే భారత అభిమానులకు పండగ రోజు. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల సంబరాలు జరుపుకునే అవకాశం లేదు. అయితే సామాజిక సైట్ల ద్వారా భారత ఆటగాళ్లు విఖ్యాత అటగాడికి శుభాకాంక్షలు తెలిపారు. ‘బ్యాటింగే ప్రాణంగా... క్రికెటే లోకంగా ఎదిగిన సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మాలాంటి ఎందరికో మీరే స్ఫూర్తి’ అని కెప్టెన్ కోహ్లి ట్వీట్ చేశాడు. ‘మన గ్రేట్ మ్యాన్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి’ అని రోహిత్ శర్మ పోస్ట్ చేశాడు. పేసర్ బుమ్రా సహా పలువురు భారత క్రికెటర్లు, ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీ, టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ శుభాకాంక్షలు చెప్పినవారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment