కొండంత స్కోరు... సిరీస్‌ ఖరారు! | Australia trail India by 598 runs at stumps on Day 2 | Sakshi
Sakshi News home page

కొండంత స్కోరు... సిరీస్‌ ఖరారు!

Published Sat, Jan 5 2019 12:56 AM | Last Updated on Sat, Jan 5 2019 12:58 AM

 Australia trail India by 598 runs at stumps on Day 2 - Sakshi

అనుమానమేమీ లేదు! ఓటమి అన్న ప్రశ్నేలేదు! విజయానికీ ఢోకా లేదు! అదీ కాకపోతే... ‘డ్రా’! అంతే...! కంగారూల గడ్డపై టీమిండియా తొలి ‘చారిత్రక సిరీస్‌’ విజయానికి రాచబాట పడింది. అద్భుతం ఆవిష్కృతం కానుండటమే ఇక మిగిలింది. కోహ్లి సేన రికార్డులకెక్కడం వంద శాతం ఖాయమైంది. ఇది 2–1తోనా... 3–1తోనా అనేదే తేలాల్సి ఉంది. భారత్‌ సగర్వంగా నిలవనుండటమే మనం చూడాల్సి ఉంది.

చతేశ్వర్‌ పుజారా వేసిన పటిష్ఠ పునాదిపై చెలరేగిన రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా భారత్‌కు కొండంత స్కోరును సాధించి పెట్టారు. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ దూకుడైన ఆటతో పరుగుల వరద పారించి ప్రత్యర్థిని పిప్పి చేశారు. ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా ద్విశతక భాగస్వామ్యం నమోదు చేశారు.

ఇప్పటికే ఆధిక్యం కోల్పోయి మానసికంగానూ దెబ్బతిన్న కంగారూలు... ఎంత పోరాడినా, మరెంత శ్రమించినా కోహ్లి సేనను అందుకోవడం అసాధ్యం. వారు చేయాల్సిందల్లా ఓటమిని తప్పించుకోవడమే. తద్వారా కొంతలో కొంతైనా గౌరవాన్ని కాపాడుకోవడమే.  

సిడ్నీ: మెరుగైన స్కోరుతో తొలి రోజే సిడ్నీ టెస్టును తమవైపు తిప్పుకొన్న టీమిండియా... రెండో రోజు దానికి రెట్టింపు పైగా పరుగులు చేసి మ్యాచ్‌నే శాసించే స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా (373 బంతుల్లో 193; 22 ఫోర్లు) త్రుటిలో డబుల్‌ సెంచరీ కోల్పోయినా, యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (189 బంతుల్లో 159 నాటౌట్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకం... ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (114 బంతుల్లో 81; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో అదరగొట్టారు. ఫలితంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టులో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 622/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. నాథన్‌ లయన్‌ (4/178) నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్కస్‌ హారిస్‌ (19 బ్యాటింగ్‌), ఉస్మాన్‌ ఖాజా (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కంగారూలు మన తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 598 పరుగులు వెనుకబడి ఉన్నారు. 

ఆ లోటు తప్ప... అంతా ఏకపక్షమే! 
ఓవర్‌నైట్‌ స్కోరు 303/4తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్‌... హనుమ విహారి (96 బంతుల్లో 42; 5 ఫోర్లు) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు 3 పరుగులు మాత్రమే జోడించిన అతడు... లయన్‌ బౌలింగ్‌లో స్వీప్‌నకు యత్నించి షార్ట్‌లెగ్‌లో లబ్‌షేన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అంపైర్‌ ఔటివ్వగా, సమీక్ష కోరినా వ్యతిరేకంగానే రావడంతో విహారి వెనుదిరిగాడు. ఇదే ఓవర్లో 150 మైలురాయిని దాటిన పుజారాకు పంత్‌ జత కలిశాడు. స్టార్క్‌ వాడివేడి యార్కర్లను కాచుకుంటూ, గతి తప్పిన లయన్‌ బంతులను బౌండరీకి పంపిస్తూ ఈ జోడీ లంచ్‌ విరామం వరకు వికెట్‌ పడకుండా చూసుకుంది. ఈ సెషన్‌లో భారత్‌ 86 పరుగులు చేయగా, ఇందులో పుజారావే 51 ఉండటం గమనార్హం. అలసిపోవడంతో పాటు డబుల్‌ సెంచరీకి దగ్గరగా ఉండటంతో విరామం తర్వాత పుజారా జోరు తగ్గించాడు. అప్పటికీ 192 పరుగుల వద్ద లయన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ఖాజా క్యాచ్‌ వదిలేయడంతో అతడికి లైఫ్‌ దక్కింది. మరో 16 బంతులు ఎదుర్కొన్నా ఒక్క పరుగే చేయగలిగాడు. లయన్‌ ఓవర్లో బంతిని లెగ్‌సైడ్‌ పంపబోయి అతడికే క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో పుజారా మారథాన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికి స్కోరు 418/6. 

పంత్‌–జడేజా జోడీ జోరు...  
పుజారా వెనుదిరిగిన కాసేపటికే పంత్‌ అర్ధశతకం (85 బంతుల్లో) పూర్తయింది. ఈ దశలో మహా అయితే భారత్‌ 500కు అటుఇటుగా చేస్తుందని అంతా భావించారు. కానీ పంత్, జడేజా జోరుతో అది అమాంతం పెరిగిపోయింది. వారిద్దరి ధాటికి 500, 550, 600 ఇలా ఒక్కో గణాంకం చెదిరిపోయింది. పంత్‌ ఎప్పటిలానే దూకుడుగా కనిపించగా మరో ఎండ్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో అద్భుతమైన కట్‌ షాట్‌తో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఫోర్, ఫుల్‌ డెలివరినీ లాంగాన్‌లోకి సిక్స్‌గా పంపి జడేజా వేగం పెంచాడు. టీమిండియా 491/6తో ‘టీ’కి వెళ్లింది. ఇక్కడి నుంచే కథ పూర్తిగా మారింది. అప్పటివరకు 16 ఓవర్లలో 73 పరుగులు జత చేసిన ఈ జోడీ... తర్వాత ఎదుర్కొన్న 21.2 ఓవర్లలో ఏకంగా 131 పరుగులు పిండుకుంది. బ్రేక్‌ తర్వాత లబ్‌షేన్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ దిశగా ఫోర్‌ కొట్టి పంత్‌ 137 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు. 89 బంతుల్లో జడేజా అర్ధ శతకం పూర్తయింది. ఆసీస్‌ మూడో కొత్త బంతి తీసుకున్నాక స్టార్క్, హాజల్‌వుడ్‌ ఓవర్లలో ఒక్కో ఫోర్‌ బాదిన జడేజా... కమిన్స్‌కైతే నాలుగు ఫోర్లతో చుక్కలు చూపాడు. దీంతో జట్టు స్కోరు 600 దాటింది. అటు హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో మూడు బౌండరీలు కొట్టిన పంత్‌ 150 (185 బంతుల్లో) మార్క్‌ను అందుకున్నాడు. సెంచరీ చేస్తాడనిపించిన జడేజా... లయన్‌ బంతిని భారీ షాట్‌ ఆడేందుకు క్రీజు వదిలి ముందుకొచ్చి బౌల్డ్‌ కావడంతో కోహ్లి భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. అనంతరం ఆసీస్‌ ఇన్నింగ్స్‌ పది ఓవర్లు సాగింది. పంత్‌ ఒకింత తేలికైన క్యాచ్‌ వదిలేయడంతో షమీ వేసిన మూడో ఓవర్లోనే ఖాజాకు లైఫ్‌ దక్కింది. మరో ఓపెనర్‌ హారిస్‌ పెద్దగా ఇబ్బంది పడకుండానే రోజును ముగించాడు. 

నా ఆట మారలేదు.. భాగస్వామి తప్ప!
గతంలో నేను బ్యాటింగ్‌కు దిగిన సందర్భాల్లో టెయిలెండర్లతో కలిసి ఆడాల్సి వచ్చేది. పరుగులు చేయాల్సిన బాధ్యత నాపై ఉండేది. ఇప్పుడు మాత్రం అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ (జడేజా) ఉన్నాడు. దీంతో నా ఆటనేమీ మార్చుకోవాల్సి రాలేదు. ఈ విషయంలో జట్టు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అందుకని క్రీజులో దిగినప్పుడల్లా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నా. భారత్‌లో వెస్టిండీస్‌పై రెండుసార్లు 92 వద్ద ఔటవడంతో నిరుత్సాహపడ్డా. కానీ, వెంటనే తేరుకున్నా. ఇంకా అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభంలోనే ఉన్నా. అందుకని ప్రతి శతకం ప్రత్యేకమైనదే. వీటికంటే, జట్టుకు ఏది కావాలో అది చేయడం నా దృష్టిలో అత్యంత ముఖ్యం.     
– రిషభ్‌ పంత్, భారత వికెట్‌ కీపర్‌

‘ఎ’ ప్లస్‌ కాంట్రాక్టులోకి పుజారా! 
ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు సెంచరీలతో సహా 521 పరుగులు సాధించిన చతేశ్వర్‌ పుజారాకు తగిన బహుమతి లభించనుంది. ప్రస్తుతం సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో ‘ఎ’ కేటగిరీలో ఉన్న అతడిని ‘ఎ’ ప్లస్‌లోకి తీసుకునేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది.  

►8 190ల్లో ఔటైన 8వ భారత బ్యాట్స్‌మన్‌ పుజారా. అజహర్, ద్రవిడ్, సచిన్‌ రెండేసి సార్లు, బుదీ కుందరన్, సెహ్వాగ్, కేఎల్‌ రాహుల్, ధావన్‌ ఒక్కోసారి ఔటయ్యారు. 

►1 ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన తొలి భారత, ఆసియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో శతకం చేసిన తొలి భారత కీపర్‌ కూడా అతడే. 

► 1258 ఈ సిరీస్‌లో పుజారా ఎదుర్కొన్న బంతులు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓ భారత బ్యాట్స్‌మన్‌కు ఇదే అత్యధికం. 2003–04లో ద్రవిడ్‌ 1203 బంతులు ఆడాడు. 

► 2 ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. 2003–04 సిరీస్‌లో 705/7 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.  

► 204 ఏడో వికెట్‌కు పంత్‌–జడేజా జోడించిన పరుగులు. ఏ దేశంపైనైనా భారత్‌ తరఫున ఇదే అత్యధికం. 2017లో పుజారా–సాహా ఆసీస్‌పై 199 పరుగులు చేశారు.

► 1 చిన్న వయసు (21 ఏళ్ల 91 రోజులు)లో 150 పరుగులు చేసిన తొలి కీపర్‌ పంత్‌. తైబు (21 ఏళ్ల 245 రోజులు; 2005లో బంగ్లాదేశ్‌పై) రికార్డును పంత్‌ సవరించాడు.

► 2 గావస్కర్‌ తర్వాత ఓ సిరీస్‌లో అత్యధిక నిమిషాలపాటు క్రీజులో నిలిచిన రెండో భారత బ్యాట్స్‌మన్‌ పుజారా. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పుజారా 1868 నిమిషాలు క్రీజులో గడిపాడు. గతంలో గావస్కర్‌ (1978 నిమిషాలు; 1971లో వెస్టిండీస్‌పై, 1976 నిమిషాలు; 1981/82లో ఇంగ్లండ్‌పై) ఈ ఘనత సాధించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement