⇔ చివరి టెస్టులో భారత్ ఘనవిజయం
⇔ సిరీస్ 2–1తో సొంతం
⇔ బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కైవసం ‘నంబర్‌వన్’గా సీజన్ ముగింపు
⇔ రాహుల్ అర్ధసెంచరీ
⇔ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా రవీంద్ర జడేజా
ఫలితంలో మార్పేమీ లేదు. ఆసీస్ బౌలర్లు అద్భుతాలేమీ చేయలేదు. ఊహించినట్టుగానే భారత జట్టు చివరి టెస్టును ఒక రోజు మిగిలి ఉండగానే గెలుచుకుంది. 106 పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అధిగమించిన భారత్ మూడేళ్ల అనంతరం బోర్డర్–గావస్కర్ ట్రోఫీని కూడా సగర్వంగా తిరిగి దక్కించుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సిరీస్‌లో మరో అర్ధ సెంచరీతో చెలరేగగా... అజింక్యా రహానే టి20 తరహా ఆటతీరుతో విరుచుకుపడడంతో తొలి సెషన్‌లోనే భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2–1తో సొంతం చేసుకుంది.
అలాగే సొంతగడ్డపై ఆరు నెలల పాటు జరిగిన తమ 13 టెస్టుల సుదీర్ఘ సీజన్‌ను భారత జట్టు విజయవంతంగా ముగించగలిగింది. ఇందులో 10 విజయాలు, రెండు ‘డ్రా’లు, ఒక ఓటమి ఉన్నాయి. 2015 నుంచి వరుసగా భారత్ ఏడు టెస్టు సిరీస్‌లను గెల్చుకోవడం విశేషం. అటు టెస్టుల్లో నంబర్‌వన్‌గా తమ స్థానాన్ని పదిలపరుచుకుని ఐసీసీ గదతో పాటు పది లక్షల డాలర్లను కూడా తమ ఖాతాలో వేసుకోగలిగింది.
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ సత్తా చూపించగలిగింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన చివరి టెస్టులో అద్వితీయంగా రాణించిన టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. దీంతో తొలి టెస్టును ఓటమితో ప్రారంభించిన భారత్ చివరి టెస్టును విజయంతో ముగించినట్టయ్యింది. 19 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 23.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగుల విజయలక్ష్యాన్ని సాధించింది.
ఓపెనర్ కేఎల్ రాహుల్ (76 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో నిలవగా... స్టాండ్ ఇన్ కెప్టెన్ రహానే (27 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగవంతంగా ఆడి లక్ష్యం మరింత ముందుగానే పూర్తయ్యేలా చేశాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు అజేయంగా 60 పరుగులు జత చేరాయి. మురళీ విజయ్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా... ఐదు బంతులే ఆడిన చతేశ్వర్ పుజారా పరుగులేమీ చేయకుండా రనౌట్ అయ్యాడు.
కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో విశేష ప్రతిభ కనబర్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. అంతకుముందు వికెట్ నష్టపోకుండా 16 పరుగులతో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ప్రారంభ ఓవర్‌లోనే వరుసగా రెండు బంతుల్లో విజయ్ ఎల్బీ అవుట్ కోసం ఆసీస్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్ స్పందించలేదు.
అటు రాహుల్ తన దూకుడును వదిలిపెట్ట లేదు. తొమ్మిదో ఓవర్‌లో ఓ ఫోర్, పదో ఓవర్‌లో రెండు ఫోర్లతో విరుచుకుపడి లక్ష్యాన్ని తగ్గించాడు. అయితే 14వ ఓవర్‌లో విజయ్‌తో పాటు పుజారా అవుట్ కావడంతో ఒకింత ఆందోళన నెలకొంది. కమిన్స్ బౌలింగ్‌లో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వేడ్ చేతుల్లోకి వెళ్లడంతో విజయ్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి పుజారా లేని పరుగు కోసం ప్రయత్నించగా రాహుల్ వేగంగా నాన్‌స్ట్రయిక్ ఎండ్ నుంచి కదిలాడు. మధ్యలో కొద్దిసేపు ఇద్దరూ ఆగినా ముందుకే వెళ్లారు. పాయింట్‌లో బంతిని అందుకున్న మ్యాక్స్‌వెల్ నాన్‌స్ట్రయిక్ వికెట్లకు నేరుగా విసరడంతో పుజారా వెనుదిరగాల్సి వచ్చింది.
అయితే ఈ ఆనందం ఆసీస్‌కు ఎంతో సేపు నిలవలేదు. కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బంతులకు రహానే వరుసగా రెండు ఫోర్లు బాది సమాధానం ఇచ్చాడు. మరోసారి తన ఓవర్‌లోనే వరుసగా రెండు అద్భుత సిక్సర్లు బాదడంతో లక్ష్యం 13 పరుగులకు వచ్చింది. అటు ఇన్నింగ్స్ 24వ ఓవర్ ఐదో బంతికి రెండు పరుగులు చేసిన రాహుల్ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేయడంతో పాటు భారత్‌కు సిరీస్ విజయాన్ని అందించడంతో మ్యాచ్ ముగిసింది. అయితే విజయానికి రెండు పరుగులే కావాల్సి ఉన్నా రాహుల్, రహానే కసిగా పరిగెత్తి మూడు పరుగులు చేయడం విశేషం.
స్కోరు వివరాలు
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 300; భారత్ తొలి ఇన్నింగ్స్: 332; ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 137; భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 51; విజయ్ (సి) వేడ్ (బి) కమిన్స్ 8; పుజారా రనౌట్ 0; రహానే నాటౌట్ 38; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం (23.5 ఓవర్లలో రెండు వికెట్లకు) 106.
వికెట్ల పతనం: 1–46, 2–46.
బౌలింగ్: కమిన్స్ 8–2–42–1; హాజల్‌వుడ్ 6–2–14–0; ఒకీఫ్ 4.5–1–22–0; లయన్ 5–0–19–0.
4 తొలి టెస్టును ఓడిన అనంతరం సిరీస్ గెలవడం భారత్‌కు ఇది నాలుగోసారి. గతంలో ఇంగ్లండ్ (1972–73)పై, ఆసీస్(2000–01)పై, శ్రీలంక (2005)పై భారత్ గెలిచింది.
1 స్వదేశంలో ఆడిన 50 ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడం పుజారాకిదే తొలిసారి.
6 ఆసీస్‌పై ఓ సిరీస్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన భారత ఓపెనర్‌గా రాహుల్.
5 ఓవరాల్‌గా ఒక్క సెంచరీ చేయకుండా సిరీస్‌లో ఆరు హాఫ్ సెంచరీలు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా రాహుల్.
9 తమ తొలి టెస్టును విజయంతో ఆరంభించిన భారత కెప్టెన్లలో రహానే తొమ్మిదో వాడు.
1 భారత్‌తో జరిగిన సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన రెండో పర్యాటక జట్టు
కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్. ఇంతకుముందు అలిస్టర్ కుక్ (2012–13) ఉన్నాడు.
26 ఆసీస్‌పై భారత్ సాధించిన టెస్టు
విజయాలు. గతంలో ఏ ప్రత్యర్థిపై ఇన్ని మ్యాచ్‌లను గెలవలేదు.
7 స్వదేశంలో భారత్‌కు వరుసగా ఏడో టెస్టు సిరీస్ విజయం ఇది. భారత్‌కన్నా ముందు తొమ్మిది సిరీస్ విజయాలతో ఇంగ్లండ్ (1884–92), ఆసీస్ (2005–08) ఉన్నాయి.
కంగారూల పై కసితీరా...
Published Wed, Mar 29 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM
Advertisement
Advertisement