
ముక్కోణపు సిరీస్ తొలి వన్డేలో ఆసీస్ విజయం
ముక్కోణపు సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు.. ఇంగ్లండ్ జట్టుపై మూడు వికెట్ల తేడాతో గెలిచింది.
ముక్కోణపు సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు.. ఇంగ్లండ్ జట్టుపై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ నిర్దేశించిన విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ విజృంభించి 115 బంతుల్లో 18 ఫోర్లతో 127 పరుగులు చేశాడు. 39.5 ఓవర్లలో 235 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో కెప్టెన్ మోర్గాన్ ఒక్కడే 136 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 121 పరుగులు సాధించాడు. ఆ జట్టులో ముగ్గురు డకౌట్ అయ్యారు. బట్లర్, మొయిన్ అలీ మాత్రమే 20 పరుగుల మార్కును దాటారు. ఆసీస్ బౌలర్లు బాగా రాణించడంతో తొలి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు పడ్డాయి, అప్పటికి ఇంగ్లండ్ జట్టు ఇంకా పరుగుల ఖాతా కూడా తెరవలేదు. స్టార్క్ 4 వికెట్లు, ఫాల్కనర్ 3 వికెట్లతో చెలరేగిపోయారు.
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 33 పరుగులకే ఫించ్ వికెట్ను కోల్పోయింది. వాట్సన్ కూడా పెద్దగా పరుగులు చేయకుండా 16 పరుగులకే వెనుదిరిగాడు. స్మిత్ మాత్రం నిలదొక్కుకుని వార్నర్కు అండగా నిలిచాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అలీ బౌలింగ్లో వెనుదిరిగాడు. కెప్టెన్ బెయిలీ కూడా 10 పరుగులకే ఔటయ్యాడు. వార్నర్ మాత్రం 115 బంతుల్లో ఒక్క సిక్సర్ కూడా లేకుండా 18 ఫోర్లతో 127 పరుగులు చేసి ఆసీస్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. చివర్లో వికెట్లు టపటపా రాలిపోయినా.. ఆసీస్ జట్టు మాత్రం మరో 10.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ముక్కోణపు సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఒక్క ఓక్స్ మినహా మిగిలిన వాళ్లు పెద్దగా రాణించలేదు. ఓక్స్ 4 వికెట్లు తీయగా, జోర్డాన్, అలీలకు చెరో వికెట్ దక్కింది.