సానియా ముందుకు...
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శనివారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సానియా మీర్జా (భారత్)-హొరియా టెకావ్ (రుమేనియా) జోడి 4-6, 7-6 (7/3), 10-8తో చాన్ (చైనీస్ తైపీ)-లిండ్‌స్టెడ్ (స్వీడన్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం 7-5, 6-1తో మోనికా నికెలెస్కూ (రుమేనియా)-జకోపలోవా (చెక్ రిపబ్లిక్) జంటపై గెలిచింది.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-స్రెబోత్నిక్ (స్లొవేనియా) 6-2, 6-3తో రాకెల్ కాప్స్ జోన్స్ (అమెరికా)-హుయ్ (ఫిలిప్పీన్స్) లపై నెగ్గారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో మహేశ్ భూపతి (భారత్)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడి 4-6, 6-7 (7/9)తో పెయా (ఆస్ట్రియా)-సోరెస్ (బ్రెజిల్) జంట చేతిలో ఓడిపోయింది. అయితే బోపన్న-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జంట 4-6, 6-3, 6-2తో ఫ్లెమింగ్-హచిన్స్ (బ్రిటన్) జోడిపై, లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం 6-1, 6-4తో బ్రాకియాలి (ఇటలీ) -డల్గొపలోవ్ (ఉక్రెయిన్) జోడిపై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకున్నాయి.
‘లక్కీ’ స్టీఫెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి ‘లక్కీ లూజర్’గా స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. మరో ‘లక్కీ లూజర్’ క్లిజాన్ (స్లొవేకియా)తో జరి గిన మూడో రౌండ్‌లో స్టీఫెన్ రాబర్ట్ 6-0, 7-6 (7/2), 6-4తో గెలిచాడు. టోర్నీ మెయిన్ ‘డ్రా’ విడుదలయ్యాక ఎవరైనా ఆటగాళ్లు గాయాలతో వైదొలిగితే ‘లక్కీ లూజర్స్’తో ఆ స్థానాలను భర్తీ చేస్తారు.
క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో ఓడిన అత్యుత్తమ ర్యాంక్ ఆటగాళ్లకు ఈ అవకాశం లభిస్తుంది. క్వాలిఫయింగ్‌లో రెండో సీడ్ క్లిజాన్, ఏడో సీడ్ స్టీఫెన్ చివరి రౌండ్‌లో ఓడిపోయారు. మెయిన్ ‘డ్రా’లో కోల్‌ష్రైబర్ (జర్మనీ), అల్మాగ్రో (స్పెయిన్) వైదొలగడంతో స్టీఫెన్, క్లిజాన్‌లకు ‘లక్కీ లూ జర్స్’గా మెయిన్ ‘డ్రా’లో అవకాశం దక్కింది.