ఐపీఎల్ 2020కి సంబంధించి డిసెంబర్ 19న కోల్‌కతాలో జరిగిన ఐపీఎల్ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం. ఈ సారి నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు వీదేశీ ఆటగాళ్లపై రూ.140.30 కోట్లు ఖర్చు చేశాయి. దీంట్లో అత్యధికంగా 13 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లపై రూ.58.25 కోట్లు వెచ్చించారు. తర్వాతి స్థానంలో రూ. 17.75 కోట్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లు, రూ. 17.25 కోట్లతో కరేబియన్ ఆటగాళ్లు ఉన్నారు.
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ రూ. 15.50 కోట్లకు కేకేఆర్ దక్కించుకోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం గెలుచుకున్న విదేశీ ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ 2017లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేసింది. మరో ఆస్ట్రేలియన్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ రూ.10.75 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకోగా, నాథన్ కౌల్టర్‌నీల్‌ను ముంబయి ఇండియన్స్ రూ. 8 కోట్లకు దక్కించుకుంది.
ఇక చివరిదాకా వేలంలో కొనసాగిన ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను మొదట్లో ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ అనూహ్యంగా చివరి రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4. 80 కోట్లకు దక్కించుకోవడం విశేషం. టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరు పొందిన ఆరోన్ పించ్‌ను ఆర్‌సీబీ రూ. 4.40 కోట్లకు దక్కించుకుంది. ఇక వేలంలో తీసుకున్న మిగతా ఆటగాళ్లను చూస్తే.. కేన్ రిచర్డ్‌సన్(ఆర్‌సీబీ), అలెక్స్ క్యారీ ( ఢిల్లీ క్యాపిటల్స్), జోష్ హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్(సన్‌రైజర్స్), క్రిస్ లిన్ ( ముంబయి ఇండియన్స్), అండ్రూ టై( రాజస్థాన్ రాయల్స్), టామ్ బాంటన్( కేకేఆర్), జూయిస్ ఫిలిప్ (ఆర్‌సీబీ), క్రిస్ గ్రీన్ (కేకేఆర్)లు ఉన్నారు.
ఇక ఇంగ్లండ్ ఆటగాళ్ల విషయానికి వస్తే 2019 వన్డే వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను రూ. 5.50 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. కాగా ఆల్‌రౌండర్ శామ్ కరణ్‌ను రూ. 5.50 కోట్లతో చైన్నె సూపర్ కింగ్స్, అతని అన్న టామ్ కరణ్‌ను రూ. 1 కోటితో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. మిగిలిన ఆటగాళ్లలో క్రిస్ జోర్డాన్( కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), జాసన్ రాయ్, క్రిస్ వోక్స్ ( ఢిల్లీ క్యాపిటల్స్)లు ఉన్నారు.
కరీబియన్ ఆటగాళ్లలో విండీస్ ఫాస్ట్‌బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను రూ. 8.50 కోట్లతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, స్టార్ బ్యాట్సమెన్ షిమ్రన్ హెట్‌మైర్‌ను రూ. 7.75 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. కాగా ప్రతీసారి వేలంలో ముందుండే దక్షిణాప్రికా, న్యూజిలాండ్ ఆటగాళ్లను ఈ సారి వేలంలో కొనడానికి ప్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదనే చెప్పాలి. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను మాత్రమే రూ.10 కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. డేల్ స్టేయిన్, డేవిడ్ మిల్లర్‌లు తమ బేస్ ప్రైస్‌కే ప్రాంచైజీలకు అమ్ముడుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment