ఆస్ట్రేలియా ఆటగాళ్లపై రాయితో దాడి
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. దీంతో బస్సు కిటికీ అద్దం పగిలిపోగా ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. సోమవారం బంగ్లాదేశ్-ఆసీస్ మధ్య చిట్టగాంగ్ వేదికగా రెండోటెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం హోటల్‌కు వెళ్లున్న ఆటగాళ్ల బస్సుపై ఎవరో రాయి విసిరారు. దీంతో అప్రమత్తమైన బంగ్లాదేశ్ సెక్యూరిటీ అధికారులు ఆ రూట్‌లో మరింత భద్రతను పెంచారు.
ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది.ఎవరో చిన్నరాయి విసిరారని, ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని, ఈ విషయంపై బంగ్లా అధికారులతో చర్చించామని పేర్కొంది. రికీపాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 2006లో తొలిసారి బంగ్లాలో పర్యటించిగా మళ్లీ ఇప్పుడే పర్యటిస్తుంది. 2015లో పర్యటించాల్సిఉండగా భద్రతా కారణాల వల్లే స్మిత్ సేన పర్యటనను రద్దు చేసుకుంది. ఇక తొలి టెస్టులో ఆసీస్‌పై బంగ్లా చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే.