అద్భుతాన్ని ఆశిస్తున్నాం
ఇక్కడ గెలిస్తే చిరకాలం గుర్తుండిపోతుంది
♦ అవసరమైతే స్లెడ్జింగ్ కూడా చేస్తాం
♦ కోహ్లి, అశ్విన్ కోసం వ్యూహాలున్నాయి
♦ సవాల్‌కు సిద్ధమన్న ఆసీస్ కెప్టెన్ స్మిత్
భారత గడ్డపై ఆడిన గత మూడు సిరీస్‌లలో చిత్తుగా ఓటమి... ఉప ఖండంలో వరుసగా తొమ్మిది టెస్టులలో పరాజయం... ముంబైలో అడుగు పెట్టే సమయానికి ఆస్ట్రేలియా జట్టును వెంటాడుతున్న తాజా రికార్డు ఇది. అటు వైపు ప్రత్యర్థి భారత్‌ను చూస్తే 19 మ్యాచ్‌లుగా పరాజయమే లేదు. వరుసగా ఆరు సిరీస్ విజయాలు... టెస్టుల్లో అగ్రశ్రేణి జట్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు కూడా పోటీ ఇవ్వకుండా తలవంచాయి. ఇలాంటి స్థితిలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతాన్ని ఆశిస్తున్నాడు. భారత్‌ను ఓడించగలమని నమ్ముతున్నాడు. నాలుగేళ్ల క్రితం క్లీన్‌స్వీప్‌కు గురైన జట్టులో సభ్యుడైన తాను, నాటి చేదు జ్ఞాపకాలను తుడిచేయాలని కోరుకుంటున్నాడు!
ముంబై: భారత్‌తో సిరీస్ అంటే తమకు అతి పెద్ద సవాల్ అని, అయితే దానిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. రాబోయే ఆరు వారాల కఠిన పర్యటన కోసం తామంతా ఎంతో ఎదురు చూస్తున్నామని అతను చెప్పాడు. మంగళవారం జట్టు కోచ్ డారెన్ లీమన్‌తో కలిసి స్మిత్ మీడియాతో ముచ్చటించాడు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 23న పుణేలో మొదలవుతుంది. అంతకు ముందు ఈ నెల 17నుంచి 19 వరకు జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో ఆస్ట్రేలియా తలపడుతుంది.
ఈ సిరీస్‌లో తమ విజయావకాశాలు, ప్రత్యర్థి బలాబలాల గురించి అతను సుదీర్ఘంగా మాట్లాడాడు. ‘ఇది అంత సులువైన సిరీస్ కాదని మాకందరికీ బాగా తెలుసు. అయితే ఈ సవాల్‌ను అధిగమించాలని పట్టుదలగా ఉన్నాం. భారత గడ్డపై ఆడటం చాలా కష్టమైన విషయం. కాబట్టి ఈ సిరీస్‌కు ఎంతో విలువ ఉంది. ఇక్కడ మేం ఏదైనా అద్భుతం చేయగలిగితే అది మా జీవితంలో అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుంది. 10–20 ఏళ్ల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకొని దీని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు’ అని స్మిత్ అభిప్రాయ పడ్డాడు.
పేసర్లపై నమ్మకం...
భారత్‌కు రావడానికి ముందు ఆస్ట్రేలియా జట్టు దుబాయ్‌లో స్పిన్ పిచ్‌లపై సన్నద్ధమైంది. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనెసర్‌తో పాటు భారత మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను స్పిన్ కన్సల్టెంట్‌లుగా నియమించుకొని ప్రత్యేకంగా సాధన చేసింది. అయితే స్పిన్‌తో పాటు తమ పేస్ బౌలర్లు స్టార్క్, హాజల్‌వుడ్ కూడా ఈ పర్యటనలో కీలకం కానున్నారని స్మిత్ చెప్పాడు. ‘భారత గడ్డపై రివర్స్ స్వింగ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో స్టార్క్, హాజల్‌వుడ్‌లకు మంచి పట్టుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్‌ను వారు ఇబ్బంది పెట్టగలరు’ అని స్మిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేసేందుకు తమ స్పిన్నర్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అతను వెల్లడించాడు.
వారి జోరును ఆపుతాం...
భారత టెస్టు విజయాల్లో కోహ్లి, అశ్విన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసీస్‌కు కూడా వారిద్దరినుంచే పెద్ద ముప్పు పొంచి ఉంది. అయితే ఆ ఇద్దరి కోసం తాము ప్రత్యేకంగా వ్యూహాలు రూపొందిస్తున్నామని స్మిత్ వెల్లడించాడు. ‘కోహ్లిలాంటి స్టార్ బ్యాట్స్‌మన్ కోసం మా వద్ద ప్రణాళిక ఉంది. దాని గురించి ఇప్పుడే చర్చించదల్చుకోలేదు. అశ్విన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని తెలుసు. అయితే అతనిపై ఎదురు దాడి చేసేందుకు మా బ్యాట్స్‌మెన్ అంతా సిద్ధమయ్యారు. ఈ ఇద్దరిని నిరోధించగలిగితేనే మా పని సులువవుతుంది’ అని స్మిత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఏడాది శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత కెప్టెన్‌గా తన ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చిందని... అందు వల్ల దూకుడుగా ఆడే తమ ఆటగాళ్ల సహజమైన బ్యాటింగ్ శైలిని మార్చే ప్రయత్నం చేయనని స్మిత్ అన్నాడు. ఆత్మరక్షణా ధోరణిలో ఆడటం మొదలు పెడితే మొదటికే మోసం వస్తుందని, కాబట్టి సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేస్తామని అతను చెప్పుకొచ్చాడు.
అందుకు మేం రెడీ...
భారత్, ఆస్ట్రేలియా సిరీస్ అంటే మాటల యుద్ధం జరగకుండా ఉండదు. ఈ సారి కూడా స్లెడ్జింగ్ వల్ల తమకు ‘మంచి’ జరుగుతుందని భావిస్తే తన ఆటగాళ్లను అడ్డుకోనని స్మిత్ పరోక్షంగా చెప్పాడు. ‘మైదానంలో ఒక్కో ఆటగాడు తనదైన తరహాలో ఆడతాడు. వారు మాటలతో ప్రత్యర్థిని కవ్వించాలని చూస్తే, దాని వల్ల వారిలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుందని భావిస్తే వారు దానిని కొనసాగించవచ్చు. చివర్లో మన ఆట వల్లే విజయవంతం అవుతామనే విషయం మరచిపోవద్దు’ అని స్మిత్ స్పష్టం చేశాడు.