తొలిరోజు ఆసీస్‌దే | Australia lead by first day in third test match against india | Sakshi
Sakshi News home page

తొలిరోజు ఆసీస్‌దే

Published Thu, Mar 16 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

తొలిరోజు ఆసీస్‌దే

తొలిరోజు ఆసీస్‌దే

స్మిత్‌ సెంచరీ, మ్యాక్స్‌వెల్‌ అర్ధశతకం
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 299/4
ఆకట్టుకున్న ఉమేశ్‌ భారత్‌తో మూడో టెస్టు


రెండోటెస్టులో ఎదురైన ఘోర పరాజయానికి ఆస్ట్రేలియా దీటుగా బదులిచ్చింది. రాంచీలో భారత్‌తో ప్రారంభమైన మూడోటెస్టులో శుభారంభం చేసింది. డీఆర్‌ఎస్‌ వివాదంతో ఏమాత్రం ఏకాగ్రత చెదిరిపోని కెప్టెన్‌ స్మిత్‌ సిరీస్‌లో రెండో సెంచరీతో సత్తాచాటాడు. మరోవైపు మూడేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో రాంచీ టెస్టులో ఆసీస్‌ భారీ స్కోరు వైపు దూసుకెళ్తోంది. మరోవైపు భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ ‘రివర్స్‌ స్వింగ్‌’తో ఆకట్టుకున్నాడు.

అయితే ఈ ట్రాక్‌పై స్పిన్‌ మంత్రం పారలేదు. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా అంతంతమాత్రంగానే చెరో వికెట్‌తో రాణించారు. మరోవైపు ‘పులి మీద పుట్ర’లా భుజం గాయంతో భారత కెప్టెన్‌ కోహ్లి మైదానాన్ని వీడడం జట్టు యాజమానాన్ని కలవరపెడుతోంది. ఏదేమెనా ఈ టెస్టులో భారత్‌ పుంజుకోవాలంటే రెండోరోజు వీలైనంత త్వరగా ఆసీస్‌ను ఆలౌట్‌ చేసి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించాల్సి ఉంటుంది.


రాంచీ: భారత్‌–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా రాంచీలో ప్రారంభమైన మూడోటెస్టులో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న రాంచీ వికెట్‌పై కంగారూ జట్టు అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శన చేసింది. గురువారం తొలిరోజు టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 90 ఓవర్లలో నాలుగు వికెట్లకు 299 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ అజేయ సెంచరీ (244 బంతుల్లో 117 బ్యాటింగ్, 13 ఫోర్లు), ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అర్ధ శతకం (82 బ్యాటింగ్‌)తో ఆకట్టుకున్నారు. ఓపెనర్‌ మ్యాట్‌ రెన్‌షా (44) ఫర్వాలేదనిపించాడు. ఓ దశలో 140/4తో కష్టాల్లో పడిన జట్టును స్మిత్‌–మ్యాక్స్‌వెల్‌ జోడీ ఆదుకుంది. సుదీర్ఘంగా 47.4 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసిన వీరిద్దరూ అభేద్యమైన ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ (2/63) ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌ (1/78), రవీంద్ర జడేజా (1/80) ప్రభావం చూపించలేకపోయారు.  

సెషన్‌ 1: సమం సమం
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తుది జట్టులోకి కమిన్స్, మ్యాక్స్‌వెల్‌లను తీసుకోగా,  గాయంనుంచి కోలుకున్న భారత ఓపెనర్‌ విజయ్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌ ఓపెనర్లలో వార్నర్‌ (19) జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేయగా, రెన్‌షా మాత్రం దూకుడు ప్రదర్శించాడు. రెన్‌షా తన తొలి 24 పరుగులను 17 బంతుల వ్యవధిలో ఆరు బౌండరీలతోనే సాధించడం విశేషం. అయితే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వార్నర్, ఈ సారి జడేజాకు చిక్కాడు. ఫుల్‌టాస్‌ను వార్నర్‌ బలంగా బాదగా, రాకెట్‌ వేగంతో దూసుకొచ్చిన బంతిని జడేజా అద్భుత రిటర్న్‌ క్యాచ్‌తో అందుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి రెన్‌షా వెనుదిరిగాడు. ఆ వెంటనే షాన్‌ మార్‌‡్ష (2)ను అశ్విన్‌ పెవిలియన్‌ పంపించాడు. పుజారా క్యాచ్‌ పట్టిన అనంతరం అంపైర్‌ తిరస్కరించగా... రివ్యూ కోరిన భారత్‌ ఫలితం సాధించింది. మరో ఎండ్‌లో స్మిత్‌ మాత్రం తనదైన శైలిలో క్రీజ్‌లో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు.
ఓవర్లు: 30, పరుగులు: 109, వికెట్లు: 3

సెషన్‌ 2: స్మిత్‌ జోరు
లంచ్‌ తర్వాత కొద్ది సేపటికే బౌండరీ వద్ద బంతిని ఆపబోయి కోహ్లి గాయపడటంతో 40వ ఓవర్‌నుంచి రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. మరో వైపు ఆసీస్‌ కెప్టెన్‌ చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. 104 బంతుల్లో స్మిత్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే తర్వాతి బంతికే హ్యాండ్స్‌కోంబ్‌ (19)ను ఉమేశ్‌ చక్కటి బంతితో అవుట్‌ చేశాడు. ఈ దశలో జత కలిసిన స్మిత్, మ్యాక్స్‌వెల్‌ మళ్లీ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే పనిలో పడ్డారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ తన సహజసిద్ధమైన దూకుడును కట్టిపెట్టి స్మిత్‌ అండతో చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. తాను ఎదుర్కొన్న 57వ బంతికి గానీ అతను తొలి ఫోర్‌ కొట్టలేదు.
ఓవర్లు: 30, పరుగులు: 85, వికెట్లు: 1

సెషన్‌ 3: ఆసీస్‌ హవా
విరామం అనంతరం ఆస్ట్రేలియా దూసుకుపోయింది. భారత బౌలర్లు కొన్నిసార్లు చక్కటి బంతులు వేసి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కంగారూలకు అది పెద్ద సమస్య కాలేదు. జడేజా బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదిన మ్యాక్స్‌వెల్‌ 95 బంతుల్లో కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు 90ల్లోకి వచ్చిన తర్వాత చాలా సేపు ఉత్కంఠక్షణాలు ఎదుర్కొన్న స్మిత్‌ ఎట్టకేలకు విజయ్‌ బౌలింగ్‌లో మిడాన్‌ మీదుగా ఫోర్‌ కొట్టి 227 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఒకే సిరీస్‌లో కనీసం రెండు శతకాలు బాదిన తొలి ఆసీస్‌ కెప్టెన్‌గా, ఓవరాల్‌గా మూడో విదేశీ కెప్టెన్‌గా నిలిచాడు. 86 ఓవర్ల తర్వాత భారత్‌ కొద్ది బంతిని తీసుకున్నా... ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ ఎలాంటి ప్రమాదం లేకుండా రోజును ముగించారు.
ఓవర్లు: 30, పరుగులు: 105, వికెట్లు: 0

కోహ్లికి గాయం  
మూడో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గాయపడ్డాడు. లంచ్‌ బ్రేక్‌ ముందు ఫీల్డింగ్‌ చేస్తుండగా కుడి భజానికి గాయమవడంతో మైదానాన్ని వీడాడు. మిడ్‌వికెట్‌లో బౌండరీ దిశగా దూసుకెళ్తున్న బంతిని ఆపడానికి ప్రయత్నించి గాయపడ్డాడు. వెంటనే భారత ఫిజియో పాట్రిక్‌ ఫర్హాత్‌.. కోహ్లికి తక్షణ వైద్య సేవలు అందించాడు. కోహ్లి గాయడడంతో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

నోబాల్‌కు రివ్యూ!
షాన్‌ మార్ష్ విషయంలో విజయవంతంగా అప్పీల్‌ చేసిన భారత్‌ మరో రెండు సందర్భాల్లో మాత్రం రివ్యూ విషయంలో తడబడింది. ఇషాంత్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ (17 పరుగుల వద్ద) ఎల్బీ కోసం చేసిన అప్పీల్‌ను అంపైర్‌ తిరస్కరించగా, వెంటనే రివ్యూ కోరింది. అయితే రివ్యూలో అది నోబాల్‌గా తేలింది. దాంతో అవుట్‌కు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అయితే 67 పరుగుల వద్ద అదే మ్యాక్స్‌వెల్‌ రివ్యూ విషయంలో భారత్‌ తప్పు చేసింది. జడేజా బౌలింగ్‌లో బంతి మ్యాక్సీ గ్లవ్‌కు తగిలి స్లిప్‌లో పడినా భారత్‌ దానిని గుర్తించలేదు. దాంతో రివ్యూ కోరలేదు. రీప్లేలు చూస్తే మ్యాక్స్‌వెల్‌ అవుటయ్యేవాడని తేలింది.  

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement