Captain Smith
-
సూపర్ స్మిత్
ప్లే ఆఫ్ ఆశలు నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సమష్టిగా రాణించింది. కొత్త కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథ్యంలో స్ఫూర్తిదాయక విజయాన్ని సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా స్మిత్ రాణించడంతో రాజస్తాన్ రాజసం ముందు రోహిత్ సేన మరోసారి తలవంచింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌తో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ ఓడిపోవడం గమనార్హం. జైపూర్: ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముంబైని ఓడించి ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ మూడో విజయం నమోదు చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (47 బంతుల్లో 65; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... సూర్యకుమార్ (34; 1 ఫోర్, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది. ఇప్పటి వరకు టోర్నీలో పెద్దగా రాణించని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్మిత్ (48 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రియాన్ పరాగ్ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (19 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. ముంబై లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆకట్టుకున్న డికాక్... ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే రోహిత్ శర్మ (5) వికెట్ తీసి గోపాల్ ముంబైకి షాకిచ్చాడు. అదే ఓవర్లో వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద ఆర్చర్ క్యాచ్ వదిలేయడంతో డికాక్ ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. కానీ ధావళ్ కులకర్ణి వేసిన మరుసటి ఓవర్లోనే వరుసగా 4, 4, 4, 6తో డికాక్ చెలరేగిపోయా డు. దీంతో పవర్‌ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. సూర్యకుమార్ స్ట్రయిక్ రొటేట్ చేయగా... డికాక్ అప్పుడప్పుడు ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే అతను అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బిన్నీ విడగొట్టాడు. సూర్యకుమార్‌ను ఔట్ చేసి రెండో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. వెంటనే డికాక్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 15 ఓవర్లకు జట్టు స్కోరు 112/3తో నిలిచింది. స్లో వికెట్‌కు తోడు ఆర్చర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో డెత్ ఓవర్లలోనూ ముంబై ధాటిగా ఆడలేకపోయింది. చివరి ఐదు ఓవర్లలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 16 పరుగులే ఇచ్చి హార్దిక్ వికెట్‌ను దక్కించుకున్నాడు. పొలార్డ్ (10) విఫలమయ్యాడు. ఆర్చర్ రెండు సార్లు క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన హార్దిక్, కటింగ్ (13) చివర్లో కీలక పరుగులు జోడించారు. స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్... లక్ష్యఛేదనను రాజస్తాన్ రాయల్స్ ధాటిగా ప్రారంభిం చింది. మొదటి రెండు ఓవర్లలో ఐదు బౌండరీలతో సంజూ సామ్సన్ చెలరేగాడు. వేగంగా ఆడే క్రమంలో రహానే (12) ఔటయ్యాడు. స్మిత్ కూడా వేగంగా ఆడటంతో పవర్ ప్లేలో రాజస్తాన్ 60 పరుగులు చేసింది. లక్ష్యం దిశగా వేగంగా దూసుకెళ్తోన్న రాయల్స్‌ను కట్టడి చేసేందుకు చహర్ ప్రయత్నించాడు. ఒకే ఓవర్లో జోరు మీదున్న సామ్సన్, బెన్ స్టోక్స్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో స్మిత్‌కు 17 ఏళ్ల కుర్రాడు పరాగ్ జతయ్యాడు. వీరిద్దరూ చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ రాయల్స్‌ను గెలుపు దిశగా నడిపించారు. ఈ క్రమంలో స్మిత్ 40 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. విజయానికి 16 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో పరాగ్, టర్నర్ (0) వెంటవెంటనే ఔటైనప్పటికీ... స్టువర్ట్ బిన్నీ సహకారంతో స్మిత్ రాజస్తాన్‌ను గెలిపించాడు. రహానేపై వేటు ఐపీఎల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రహానేపై వేటు వేశారు. నూతన సారథిగా స్టీవ్ స్మిత్‌ను నియమించారు. జట్టు పురోగతి కోసం చిన్న పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టినట్లు రాయల్స్ యాజమాన్యం తెలిపింది. గతేడాది బాల్ ట్యాంపరింగ్ కారణంగా స్మిత్ ఐపీఎల్‌కు దూరం కావడంతో అతని స్థానంలో రహానే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. కానీ ఈ సీజన్లో రహానే సారథ్యంలోని రాజస్తాన్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. -
పడగొట్టలేకపోయారు
⇔‘డ్రా’గా ముగిసిన మూడో టెస్టు ⇔రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 204/6 ⇔ ఆదుకున్న హ్యాండ్స్కోంబ్, మార్ష్ ⇔ఆలౌట్ చేయడంలో భారత్ విఫలం ∙25 నుంచి చివరి టెస్టు ప్చ్...ఆశించిన ఫలితం దక్కలేదు. చివరి రోజు ఆటలో ఎనిమిది వికెట్లు తీసి ఆస్ట్రేలియా కథ ముగిద్దామని భావించిన భారత్ ఆ ప్రయత్నంలో విఫలమైంది. అనుకూలంగా కనిపిస్తున్న పిచ్‌పై స్పిన్ తంత్రంతో ప్రత్యర్థి పని పట్టవచ్చని టీమిండియా పెట్టుకున్న నమ్మకాన్ని కంగారూ బ్యాట్స్‌మెన్ వమ్ము చేశారు. ఆరంభంలో రెండు కీలక వికెట్లు తీసి ఆశలు రేపినా... ఆ తర్వాత 62 ఓవర్ల పాటు మరో వికెట్టే దక్కలేదు. చివర్లో మరో రెండు వికెట్లు పడగొట్టగలిగినా అప్పటికే విజయం చేజారిపోయింది. అనూహ్య మలుపులు తిరిగి, ఆసక్తికరంగా సాగిన రాంచీ టెస్టులో చివరకు కోహ్లి సేనకు ‘డ్రా’నందమే మిగిలింది. నాలుగు పరుగుల వ్యవధిలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు అవుటయ్యాడు... సిరీస్‌లో ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ స్మిత్ వెనుదిరిగే సమయానికి జట్టు ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది. ఈ దశలో ఆసీస్ కుప్పకూలిపోవచ్చని అనిపించింది. కానీ హ్యాండ్స్కోంబ్, షాన్ మార్ష్ ఆసీస్‌ను ఆదుకున్నారు. ప్రత్యర్థి ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా పట్టు వదలకుండా మొండిగా పోరాడారు. భారత బౌలింగ్‌ను పట్టుదలగా ఎదుర్కొంటూ ఒకరు 200 బంతులు ఆడితే, మరొకరు 197 బంతులు ఎదుర్కొని తమ జట్టును క్షేమంగా తీరం చేర్చారు. మూడు టెస్టుల్లో మూడు రకాల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక తాడోపేడో తేల్చుకోవాల్సింది ధర్మశాలలోనే. రాంచీ: హోరాహోరీగా సాగుతున్న బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో మరో టెస్టుకు ఆసక్తికర ముగింపు లభించింది. ఐదు రోజుల పాటు ఇరు జట్లు పట్టుదలగా, పట్టు విడవకుండా పోరాడిన అనంతరం రాంచీలో జరిగిన మూడో టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ ఆఖరి రోజు సోమవారం ఓటమిని తప్పించుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దానిని విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ మెరుగైన ప్రదర్శనే ఇచ్చినా... ఆసీస్‌ను పడగొట్టడంలో మాత్రం విఫలమైంది. ఐదో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. పీటర్ హ్యాండ్స్కోంబ్ (200 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు), షాన్ మార్‡్ష (197 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో జడేజాకు 4 వికెట్లు దక్కాయి. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో ఇరు జట్లు ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచాయి. చివరిదైన నాలుగో టెస్టు శనివారం నుంచి ధర్మశాలలో జరుగుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 451, భారత్ తొలి ఇన్నింగ్స్: 603/9 డిక్లేర్డ్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (బి) జడేజా 14; రెన్షా (ఎల్బీ) (బి) ఇషాంత్ 15; లయన్ (బి) జడేజా 2; స్మిత్ (బి) జడేజా 21; మార్ష్ (సి) విజయ్ (బి) జడేజా 53; హ్యాండ్స్కోంబ్ (నాటౌట్) 72; మ్యాక్స్‌వెల్ (సి) విజయ్ (బి) అశ్విన్ 2; వేడ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (100 ఓవర్లలో 6 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–17; 2–23; 3–59; 4–63; 5–187; 6–190. బౌలింగ్: అశ్విన్ 30–10–71–1; జడేజా 44–18–54–4; ఉమేశ్ 15–2–36–0; ఇషాంత్ 11–0–30–1. సెషన్–1: స్మిత్ (బి) జడేజా ఓవర్‌నైట్ స్కోరు 23/2తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడగా, భారత బౌలర్లు చక్కటి బంతులతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఈ దశలో రెన్షా (15)తో వాదోపవాదాలు సాగిన అనంతరం అద్భుత బంతితో అతడిని అవుట్ చేసి ఇషాంత్ భారత్‌కు కీలక వికెట్ అందించాడు. మరో నాలుగు బంతులకే స్మిత్ (21)ను జడేజా బౌల్డ్ చేయడంతో భారత శిబిరంలో ఆనందం రెట్టింపైంది. జడేజా వేసిన బంతిని ముందుకొచ్చి ప్యాడ్‌తో స్మిత్ అడ్డుకునే ప్రయత్నం చేయగా, అది అతడిని దాటుకుంటూ వెళ్లి స్టంప్‌ను గిరాటేసింది. ఓవర్లు: 28.4, పరుగులు: 60, వికెట్లు: 2 సెషన్–2: కీలక భాగస్వామ్యం లంచ్ తర్వాత షాన్ మ, హ్యాండ్స్కోంబ్ తమ పోరాటం కొనసాగించారు. ఒకవైపు జాగ్రత్తగా డిఫెన్స్ ఆడుతూనే, మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా చక్కటి షాట్లతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. 27 పరుగుల వద్ద ఉమేశ్ బౌలింగ్‌లో మార్ష్ ఎల్బీడబ్ల్యూ కోసం భారత్ కోరిన రివ్యూ వృథా అయింది. ఒక దశలో వరుసగా 32 బంతులపాటు పరుగే తీయని హ్యాండ్స్కోంబ్ ఆ తర్వాత అశ్విన్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు బాదడం విశేషం. ఓవర్లు: 33, పరుగులు: 66, వికెట్లు: 0 సెషన్–3: భారత్‌కు నిరాశ చివరి సెషన్లో కూడా ఆసీస్ బ్యాట్స్‌మెన్ పట్టు వదల్లేదు. భారత బౌలర్లందరూ గట్టి ప్రయత్నం చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయారు. ఉమేశ్ బౌలింగ్‌లో హ్యాండ్స్కోంబ్ 44 పరుగుల వద్ద అంపైర్ ఎల్బీని తిరస్కరించడంతో భారత్ రివ్యూ చేసింది. అయినా ఫలితం లభించలేదు. స్కోరు సమం చేసిన తర్వాత ఇద్దరు బ్యాట్స్‌మెన్ మరింత స్వేచ్ఛగా ఆడారు. ఈ క్రమంలో ముందుగా హ్యాండ్స్కోంబ్ 126 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ కొత్త బంతిని తీసుకున్నా కూడా లాభం లేకపోయింది. మరోసారి మార్ష్ విషయంలో రివ్యూ కోరి భారత్ భంగపడగా...ఆ వెంటనే అతను 190 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అనంతరం తక్కువ వ్యవధిలో మార్ష్, మ్యాక్స్‌వెల్ (2) వెనుదిరిగినా ఆసీస్‌కు ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది. ఓవర్లు: 31, పరుగులు: 55, వికెట్లు: 2 ♦ ♦ ♦ నిజానికి 150 పరుగుల ఆధిక్యాన్ని మేం కూడా ఊహించలేదు. ముందు రోజు రెండు వికెట్లు తీసిన తర్వాత మాకు మంచి అవకాశం ఉందనిపించింది. కానీ ఇద్దరు ఆసీస్ బ్యాట్స్‌మెన్ చాలా బాగా ఆడారు. వారిని అభినందించక తప్పదు. చివరి రోజు బంతి చాలా తొందరగా మెత్తబడిపోవడమే రెండో సెషన్లో మాకు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడానికి కారణం. బలమైన ప్రత్యర్థి పోరాడుతుందని, అంత సులువుగా వికెట్లు ఇవ్వదని కూడా తెలుసు. రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం లేకుండానే గెలిచే స్థితిలో నిలవడం మాకు సంతృప్తినిస్తే, డ్రాతో బయటపడినందుకు వారు కూడా సంతోషించి ఉంటారు. నా దృష్టిలో పుజారా అమూల్యమైన ఆటగాడు. చాలా మంది అతని విలువను గుర్తించలేకపోవడం నాకు బాధ కలిగిస్తుంది. అశ్విన్, జడేజా సీజన్లో చెరో 4 వేలకు పైగా బంతులు విసిరారని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. కానీ తప్పదు. జట్టు గెలవాలంటే అలాంటి విలువైన బౌలర్లను పూర్తిగా వాడుకోవాల్సిందే. –కోహ్లి, భారత కెప్టెన్ ♦ ♦ ♦ క్రికెట్లో జోరు కొనసాగించడం లాంటి మాట ఏదైనా ఉంటే నాలుగో టెస్టుకు ముందు అది ఇప్పుడు మా వైపే ఉందని చెప్పగలను. ఎందుకంటే మమ్మల్ని ఆలౌట్ చేయలేకపోవడం భారత్‌ను తీవ్రంగా బాధించి ఉంటుంది. మార్, హ్యాండ్స్కోంబ్ ప్రదర్శన అద్భుతం. నాకు గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి ఆటతీరు ప్రదర్శించడం గురించే మేం పదే పదే చర్చించుకున్నాం. ఐదు రోజులు టెస్టు సాగుతుందని నేను అనుకోలేదు. మేం మరో వంద పరుగులు చేయాల్సింది. పుజారా, సాహా చాలా బాగా ఆడారు. 210 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం నా కెరీర్లో ఎప్పుడూ జరగలేదు. బాగా అలసిపోయాను. –స్టీవ్ స్మిత్, ఆసీస్ కెప్టెన్ ⇔ భారత గడ్డపై ఒక విదేశీ జట్టు 150 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి మ్యాచ్‌ను కాపాడుకోవడం 2008 తర్వాత ఇదే తొలిసారి. అదే విధంగా భారత్‌లో టెస్టు మ్యాచ్ చివరి రోజు కనీసం 75 ఓవర్లు ఎదుర్కొని ఓటమి తప్పించుకోవడం కూడా 2008 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ⇔ ఈ టెస్టులో జడేజా మొత్తం 93.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 1990లో ఇంగ్లండ్‌తో నరేంద్ర హిర్వాణీ తర్వాత ఒక భారత బౌలర్ ఇన్ని ఓవర్లు వేయడం ఇదే మొదటిసారి. కోహ్లి మరో ఆరోపణ! బెంగళూరు టెస్టులో రివ్యూ వివాదం మరచిపోక ముందే కోహ్లి మరో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చాడు. భారత జట్టు ఫిజియో పాట్రిక్ ఫర్హర్ట్ను కొంత మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కావాలని అగౌరవపరిచారంటూ కోహ్లి ఆరోపించాడు. తనకు చికిత్స చేయడం అతని బాధ్యత అని, అనవసరంగా అతని పేరును ఎందుకు లాగారో తనకు అర్థం కావడం లేదని విరాట్ అన్నాడు. అయితే ఈ ఆరోపణలను స్మిత్ ఖండించాడు. కోహ్లి వ్యాఖ్యలతో తాను నిరాశ చెందానని, అసలు అలాంటిదేమీ జరగలేదని అతను వివరణ ఇచ్చాడు. భారత్‌లో ఆడే సమయంలో మైదానంలో ఉద్రిక్తతలు సహజమేనని, అయితే క్రీడా స్ఫూర్తితో ఆడటం ముఖ్యమని స్మిత్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు తన భుజం గాయం, మ్యాక్స్‌వెల్ వెక్కిరింతల అంశాన్ని చాలా చిన్నదిగా కోహ్లి కొట్టిపారేశాడు. చివరి రోజు కూడా భారత బౌలర్ ఇషాంత్‌కు, రెన్షాకు మధ్య మాటల యుద్ధం జరిగింది. కోపంగా కనిపించిన ఇషాంత్ ఒకే ఓవర్లో వరుస బౌన్సర్లతో రెన్షాను బెదరగొట్టాడు. చివరకు అదే ఓవర్లో ఒక ఫుల్ బంతితో రెన్షాను ఎల్బీగా అవుట్ చేసి విజయగర్వంతో అరిచేశాడు! -
తొలిరోజు ఆసీస్‌దే
⇒స్మిత్ సెంచరీ, మ్యాక్స్‌వెల్ అర్ధశతకం ⇒ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 299/4 ⇒ఆకట్టుకున్న ఉమేశ్ భారత్‌తో మూడో టెస్టు రెండోటెస్టులో ఎదురైన ఘోర పరాజయానికి ఆస్ట్రేలియా దీటుగా బదులిచ్చింది. రాంచీలో భారత్‌తో ప్రారంభమైన మూడోటెస్టులో శుభారంభం చేసింది. డీఆర్ఎస్ వివాదంతో ఏమాత్రం ఏకాగ్రత చెదిరిపోని కెప్టెన్ స్మిత్ సిరీస్‌లో రెండో సెంచరీతో సత్తాచాటాడు. మరోవైపు మూడేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న మ్యాక్స్‌వెల్ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో రాంచీ టెస్టులో ఆసీస్ భారీ స్కోరు వైపు దూసుకెళ్తోంది. మరోవైపు భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ‘రివర్స్ స్వింగ్’తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ ట్రాక్‌పై స్పిన్ మంత్రం పారలేదు. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా అంతంతమాత్రంగానే చెరో వికెట్‌తో రాణించారు. మరోవైపు ‘పులి మీద పుట్ర’లా భుజం గాయంతో భారత కెప్టెన్ కోహ్లి మైదానాన్ని వీడడం జట్టు యాజమానాన్ని కలవరపెడుతోంది. ఏదేమెనా ఈ టెస్టులో భారత్ పుంజుకోవాలంటే రెండోరోజు వీలైనంత త్వరగా ఆసీస్‌ను ఆలౌట్ చేసి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించాల్సి ఉంటుంది. రాంచీ: భారత్–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో భాగంగా రాంచీలో ప్రారంభమైన మూడోటెస్టులో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న రాంచీ వికెట్‌పై కంగారూ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. గురువారం తొలిరోజు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 90 ఓవర్లలో నాలుగు వికెట్లకు 299 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అజేయ సెంచరీ (244 బంతుల్లో 117 బ్యాటింగ్, 13 ఫోర్లు), ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అర్ధ శతకం (82 బ్యాటింగ్)తో ఆకట్టుకున్నారు. ఓపెనర్ మ్యాట్ రెన్షా (44) ఫర్వాలేదనిపించాడు. ఓ దశలో 140/4తో కష్టాల్లో పడిన జట్టును స్మిత్–మ్యాక్స్‌వెల్ జోడీ ఆదుకుంది. సుదీర్ఘంగా 47.4 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ అభేద్యమైన ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (2/63) ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (1/78), రవీంద్ర జడేజా (1/80) ప్రభావం చూపించలేకపోయారు. సెషన్ 1: సమం సమం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తుది జట్టులోకి కమిన్స్, మ్యాక్స్‌వెల్‌లను తీసుకోగా, గాయంనుంచి కోలుకున్న భారత ఓపెనర్ విజయ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆసీస్ ఓపెనర్లలో వార్నర్ (19) జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేయగా, రెన్షా మాత్రం దూకుడు ప్రదర్శించాడు. రెన్షా తన తొలి 24 పరుగులను 17 బంతుల వ్యవధిలో ఆరు బౌండరీలతోనే సాధించడం విశేషం. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వార్నర్, ఈ సారి జడేజాకు చిక్కాడు. ఫుల్‌టాస్‌ను వార్నర్ బలంగా బాదగా, రాకెట్ వేగంతో దూసుకొచ్చిన బంతిని జడేజా అద్భుత రిటర్న్ క్యాచ్‌తో అందుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి రెన్షా వెనుదిరిగాడు. ఆ వెంటనే షాన్ మార్‡్ష (2)ను అశ్విన్ పెవిలియన్ పంపించాడు. పుజారా క్యాచ్ పట్టిన అనంతరం అంపైర్ తిరస్కరించగా... రివ్యూ కోరిన భారత్ ఫలితం సాధించింది. మరో ఎండ్‌లో స్మిత్ మాత్రం తనదైన శైలిలో క్రీజ్‌లో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. ఓవర్లు: 30, పరుగులు: 109, వికెట్లు: 3 సెషన్ 2: స్మిత్ జోరు లంచ్ తర్వాత కొద్ది సేపటికే బౌండరీ వద్ద బంతిని ఆపబోయి కోహ్లి గాయపడటంతో 40వ ఓవర్‌నుంచి రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. మరో వైపు ఆసీస్ కెప్టెన్ చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. 104 బంతుల్లో స్మిత్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే తర్వాతి బంతికే హ్యాండ్స్కోంబ్ (19)ను ఉమేశ్ చక్కటి బంతితో అవుట్ చేశాడు. ఈ దశలో జత కలిసిన స్మిత్, మ్యాక్స్‌వెల్ మళ్లీ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే పనిలో పడ్డారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న మ్యాక్స్‌వెల్ తన సహజసిద్ధమైన దూకుడును కట్టిపెట్టి స్మిత్ అండతో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. తాను ఎదుర్కొన్న 57వ బంతికి గానీ అతను తొలి ఫోర్ కొట్టలేదు. ఓవర్లు: 30, పరుగులు: 85, వికెట్లు: 1 సెషన్ 3: ఆసీస్ హవా విరామం అనంతరం ఆస్ట్రేలియా దూసుకుపోయింది. భారత బౌలర్లు కొన్నిసార్లు చక్కటి బంతులు వేసి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కంగారూలకు అది పెద్ద సమస్య కాలేదు. జడేజా బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ బాదిన మ్యాక్స్‌వెల్ 95 బంతుల్లో కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు 90ల్లోకి వచ్చిన తర్వాత చాలా సేపు ఉత్కంఠక్షణాలు ఎదుర్కొన్న స్మిత్ ఎట్టకేలకు విజయ్ బౌలింగ్‌లో మిడాన్ మీదుగా ఫోర్ కొట్టి 227 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఒకే సిరీస్‌లో కనీసం రెండు శతకాలు బాదిన తొలి ఆసీస్ కెప్టెన్‌గా, ఓవరాల్‌గా మూడో విదేశీ కెప్టెన్‌గా నిలిచాడు. 86 ఓవర్ల తర్వాత భారత్ కొద్ది బంతిని తీసుకున్నా... ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఎలాంటి ప్రమాదం లేకుండా రోజును ముగించారు. ఓవర్లు: 30, పరుగులు: 105, వికెట్లు: 0 కోహ్లికి గాయం మూడో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గాయపడ్డాడు. లంచ్ బ్రేక్ ముందు ఫీల్డింగ్ చేస్తుండగా కుడి భజానికి గాయమవడంతో మైదానాన్ని వీడాడు. మిడ్వికెట్లో బౌండరీ దిశగా దూసుకెళ్తున్న బంతిని ఆపడానికి ప్రయత్నించి గాయపడ్డాడు. వెంటనే భారత ఫిజియో పాట్రిక్ ఫర్హాత్.. కోహ్లికి తక్షణ వైద్య సేవలు అందించాడు. కోహ్లి గాయడడంతో భారత జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. నోబాల్‌కు రివ్యూ! షాన్ మార్ష్ విషయంలో విజయవంతంగా అప్పీల్ చేసిన భారత్ మరో రెండు సందర్భాల్లో మాత్రం రివ్యూ విషయంలో తడబడింది. ఇషాంత్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (17 పరుగుల వద్ద) ఎల్బీ కోసం చేసిన అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించగా, వెంటనే రివ్యూ కోరింది. అయితే రివ్యూలో అది నోబాల్‌గా తేలింది. దాంతో అవుట్‌కు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అయితే 67 పరుగుల వద్ద అదే మ్యాక్స్‌వెల్ రివ్యూ విషయంలో భారత్ తప్పు చేసింది. జడేజా బౌలింగ్‌లో బంతి మ్యాక్సీ గ్లవ్‌కు తగిలి స్లిప్‌లో పడినా భారత్ దానిని గుర్తించలేదు. దాంతో రివ్యూ కోరలేదు. రీప్లేలు చూస్తే మ్యాక్స్‌వెల్ అవుటయ్యేవాడని తేలింది. -
దాసోహం
333 పరుగులతో చిత్తుగా ఓడిన భారత్ ► ఆసీస్ స్పిన్ వలలో టీమిండియా విలవిల ► ఓకీఫ్, లియోన్ ధాటికి 107 పరుగులకే ఆలౌట్ ► అద్భుత సెంచరీతో రాణించిన స్మిత్ ► 13 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆసీస్ విజయం న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్... ఇలా ఏ జట్టు భారత పర్యటనకు వచ్చినా దారుణ పరాజయాలను రుచి చూపించిన విరాట్ కోహ్లి బృందం జోరుకు చెక్ పడింది. సొంతగడ్డపై 2012 నుంచి ఎదురులేకుండా సాగుతున్న విజయ ప్రస్థానానికి ఆస్ట్రేలియా అడ్డుకట్ట వేసింది. బలహీన జట్టుగా తమను ఎంతో మంది వెక్కిరించినా కూడా ఉపఖండ పిచ్‌లపై రాణించాలంటే ఏ ఆయుధాన్ని ఉపయోగించుకోవాలో తెలుసుకుని మరీ వేటాడింది. ఇక స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో ఆరితేరిన టీమిండియా బ్యాట్స్‌మెన్ మాత్రం.. ఆడుతోంది మన పిచ్లపైనేనా లేక ఆసీస్ బౌన్సీ పిచ్‌లపైనా అనే అనుమానాన్ని కలిగిస్తూ రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ను అప్పగించడం విచిత్రమే! అదే దృశ్యం.. రెండో రోజు ఆటనే భారత జట్టు సేమ్ టు సేమ్ దింపేసింది. కాకపోతే ఓ రెండు పరుగులు ఎక్కువ చేసింది.. అంతే. తొలి ఇన్నింగ్స్‌లో దిమ్మ తిరిగేలా షాకిచ్చిన స్పిన్నర్ ఓకీఫ్ ఈసారీ చావుదెబ్బ తీశాడు. 441 పరుగుల లక్ష్య ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత జట్టు ప్రత్యర్థి బౌలర్లకు శ్రమ ఎందుకని అనుకుందో తొలి ఇన్నింగ్స్‌కన్నా ఓ 7 ఓవర్లు తక్కువగానే ఆడి 107 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 333 పరుగుల భారీ తేడాతో పరాజయం. టీమిండియాకు వరుసగా 20 టెస్టుల అనంతరం తగిలిన ఎదురుదెబ్బ ఇది. మరోవైపు 2004 అనంతరం ఆస్ట్రేలియా ఇక్కడ తొలి విజయాన్ని అందుకుంది. ఇంత కఠినమైన పిచ్‌పై కూడా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒక్కడే 109 పరుగులు చేయడం విశేషం. పుణే: అద్భుతమేమీ జరగలేదు. మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతోందో రెండో రోజే తెలిసిపోయింది. కాకపోతే కనీస పోరాటాన్ని ఆశించిన అభిమానుల ఆశలను అడియాసలు చేస్తూ దారుణ ఆటతీరుతో టీమిండియా ఆస్ట్రేలియా జట్టుకు దాసోహమైంది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ తొలి టెస్టులో కోహ్లి సేన ఏకంగా 333 పరుగుల తేడాతో ఓడింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 1–0తో ఆధిక్యాన్ని పొందింది. మార్చి 4 నుంచి బెంగళూరులో రెండో టెస్టు జరుగుతుంది. 2004లో సిరీస్ గెల్చుకున్న అనంతరం భారత గడ్డపై వరుసగా ఏడు టెస్టుల్లో ఓడిన ఆసీస్‌కు ఇది తొలి విజయం కాగా... 2012లో కోల్‌కతా టెస్టులో ఇంగ్లండ్‌పై చివరిసారిగా భారత్ ఓడింది. శనివారం కష్టసాధ్యమైన 441 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 33.5 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. చతేశ్వర్ పుజారా (58 బంతుల్లో 31; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. రహానే (21 బంతుల్లో 18; 3 ఫోర్లు), కోహ్లి (37 బంతుల్లో 13; 1 ఫోర్), రాహుల్ (9 బంతుల్లో 10; 1 ఫోర్) రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి ఓకీఫ్ ఆరు వికెట్లతో చెలరేగి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. ఇందులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ వికెట్ల ముందే దొరికిపోగా ఒకరు బౌల్డ్ అయ్యారు. లియోన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 87 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ స్మిత్ (202 బంతుల్లో 109; 11 ఫోర్లు) సెంచరీ చేయగా... స్టార్క్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి వేగంగా ఆడాడు. మొత్తం 12 వికెట్లతో చెలరేగిన ఓకీఫ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 260; భారత్ తొలి ఇన్నింగ్స్: 105; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ ఎల్బీడబ్లు్య (బి) అశ్విన్ 10; షాన్ మార్‡్ష ఎల్బీడబ్లు్య (బి) అశ్విన్ 0; స్మిత్ ఎల్బీడబ్లు్య (బి) జడేజా 109; హ్యాండ్స్కోంబ్ (సి) విజయ్ (బి) అశ్విన్ 19; రెన్షా (సి) ఇషాంత్ (బి) జయంత్ 31; మిషెల్ మార్‡్ష (సి) సాహా (బి) జడేజా 31; వేడ్ (సి) సాహా (బి) ఉమేశ్ యాదవ్ 20; స్టార్క్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 30; ఓకీఫ్ (సి) సాహా (బి) జడేజా 6; లియోన్ ఎల్బీడబ్లు్య (బి) ఉమేశ్ యాదవ్ 13; హాజెల్‌వుడ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (87 ఓవర్లలో ఆలౌట్) 285. వికెట్ల పతనం: 1–10, 2–23, 3–61, 4–113, 5–169, 6–204, 7–246, 8–258, 9–279, 10–285. బౌలింగ్: అశ్విన్ 28–3–119–4; జడేజా 33–10–65–3; ఉమేశ్ యాదవ్ 13–1–39–2; జయంత్ 10–1–43–1; ఇషాంత్ 3–0–6–0. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబలు్య (బి) ఓకీఫ్ 2; రాహుల్ ఎల్బీడబ్లు్య (బి) లియోన్ 10; పుజారా ఎల్బీడబ్లు్య (బి) ఓకీఫ్ 31; కోహ్లి (బి) ఓకీఫ్ 13; రహానే (సి) లియోన్ (బి) ఓకీఫ్ 18; అశ్విన్ ఎల్బీడబ్లు్య (బి) ఓకీఫ్ 8; సాహా ఎల్బీడబ్లు్య (బి) ఓకీఫ్ 5; జడేజా (బి) లియోన్ 3; జయంత్ యాదవ్ (సి) వేడ్ (బి) లియోన్ 5; ఇషాంత్ (సి) వార్నర్ (బి) లియోన్ 0; ఉమేశ్ యాదవ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (33.5 ఓవర్లలో ఆలౌట్) 107. వికెట్ల పతనం: 1–10, 2–16, 3–47, 4–77, 5–89, 6–99, 7–100, 8–102, 9–102, 10–107. బౌలింగ్: స్టార్క్ 2–2–0–0; లియోన్ 14.5–2–53–4; ఓకీఫ్ 15–4–35–6; హాజెల్‌వుడ్ 2–0–7–0. తొలి సెషన్: స్మిత్ శతకం ఓవర్‌నైట్ స్కోరు 143/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఏడు ఓవర్ల అనంతరం మిషెల్ మార్‡్ష (31) రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. అంతకుముందు ఓవర్లో స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకోలేకపోయాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 26 పరుగులు జోడించారు. అనంతరం స్మిత్, వేడ్ (42 బంతుల్లో 20; 2 ఫోర్లు) ఆచితూచి ఆడుతున్న క్రమంలో ఈ జోడిని ఉమేశ్ యాదవ్ విడదీశాడు. ఆ తర్వాత స్మిత్ 187 బంతుల్లో భారత గడ్డపై తొలి సెంచరీని సాధించాడు. ఇక స్టార్క్ తనదైన శైలిలో 73వ ఓవర్లో 4, 6తో జోరు చూపించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ నిర్ణయంపై తను రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. మరో రెండు సిక్సర్లు బాదిన స్టార్క్‌ను అశ్విన్ అవుట్ చేయడంతో ఆసీస్ చివరి వికెట్లు వేగంగా పడ్డాయి. ఓవర్లు: 41, పరుగులు: 142, వికెట్లు: 6 రెండో సెషన్: వికెట్లు టపటపా భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పేకమేడను తలపించింది. ఓకీఫ్ మళ్లీ తన స్పిన్ పవర్‌తో మళ్లీ చెలరేగాడు. ఐదో ఓవర్లోనే విజయ్ (2)ను ఎల్బీ చేయగా అతను రివ్యూకు వెళ్లాడు. అయినా ఫలితం దక్కలేదు. తర్వాత ఓవర్లోనే రాహుల్‌ను లియోన్ ఎల్బీ చేయగా అతను కూడా రివ్యూకు వెళ్లి నిరాశ చెందాడు. ఇక 17వ ఓవర్లో ఓకీఫ్ వేసిన బంతిని కెప్టెన్ కోహ్లి ఆడకుండా వదిలేయడంతో అది కాస్తా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఓకీఫ్ బౌలింగ్‌లో రహానే రెండు ఫోర్లు కొట్టి ఆత్మవిశ్వాసంతో కనిపించినా ఎక్కువసేపు నిలవలేదు. వరుస నాలుగు ఓవర్లలో రహానే, అశ్విన్ (8), సాహా (5)లను ఓకీఫ్ అవుట్ చేయడంతో భారత్ లంచ్ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 28.3, పరుగులు: 99, వికెట్లు: 6 చివరి సెషన్: అలా వచ్చి ఇలా వెళ్లి... టీ బ్రేక్ తర్వాత తన మిగిలిన సగం ఓవర్లో నిలకడగా ఆడుతున్న పుజరాను ఓకీఫ్ ఎల్బీగా అవుట్ చేయడంతో భారత్ ‘ఆశలు’ వదులుకుంది. మరోవైపు లియోన్ విజృంభించి తన వరుస రెండు ఓవర్లలో జడేజా (3), ఇషాంత్, జయంత్ (5)లను అవుట్ చేయడంతో ఆసీస్ సంబరాల్లో మునిగింది. దీంతో భారత్ 8 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లను కోల్పోయింది. ఓవర్లు: 5.2, పరుగులు: 8, వికెట్లు: 4 అత్యంత చెత్త ప్రదర్శన చేశాం... మేం ఎలా బ్యాటింగ్ చేయకూడదో ఈ టెస్టు చూపించింది. చాలా అరుదైన రీతిలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్ నిరాశపర్చింది. ఒక మంచి భాగస్వామ్యం లేదు. అసలు మా బ్యాటింగే స్థాయికి తగినట్లు లేదు. ఇలాంటి పిచ్‌పై 155 పరుగుల ఆధిక్యం ఇవ్వడం అంటే పెద్ద నేరం చేసినట్లే. 11 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి, ఒకే బ్యాట్స్‌మన్‌వి ఐదు క్యాచ్‌లు కూడా వదిలేసిన జట్టుకు గెలిచే అర్హత లేదు. గత కొంత కాలంగా మా ఆటను బట్టి చూస్తే ఇది అత్యంత చెత్త ప్రదర్శన. నేను బౌల్డ్ అయిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డాను. మా బౌలర్లు మంచి ప్రదర్శన కనబర్చారు. ప్రదర్శనను తప్పు పట్టను. నిజానికి మా స్పిన్నర్లకు వారికంటే ఎక్కువ టర్న్ లభించినా వికెట్లు మాత్రం దక్కలేదు. ఓటమి గురించి బెంగ లేదు. గతంలో శ్రీలంకతో ఓడిన తర్వాత ఎంతగా చెలరేగిపోయామో అందరికీ తెలుసు. నాకు, జట్టుకు ఇదో పాఠం వంటిది. లోపాలను సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతాం. ఇలాంటి టర్నింగ్ పిచ్‌పై గతంలోనూ ఆడాం కాబట్టి దానిని తప్పుపట్టను. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ మ్యాచ్ ఆరంభ సమయంలో టెస్టులో చాలా కష్టపడాల్సి వస్తుందని భావించాం. టాస్ గెలవడం బోనస్‌గా మారింది. పిచ్ సిద్ధం చేసే బాధ్యత భారత్‌దే. నిజానికి ఈ పిచ్ భారత ఆటగాళ్లకు అనుకూలమైంది. వారు తమ కోసం తయారు చేసుకున్న పిచ్ మాకు బాగా పనికొచ్చింది. 4,502 రోజుల తర్వాత భారత గడ్డపై మా జట్టు గెలవడం గర్వంగా ఉంది. ఇక్కడి సవాల్‌ను మా ఆటగాళ్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. చాలా మంది మా గురించి అంచనా వేసినట్లు 0–4తో మాత్రం ఓడిపోవడం లేదు. మిగిలిన మ్యాచ్‌లలో కూడా ఇదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాం. బెంగళూరులో ఎలాంటి వికెట్ ఉంటుందో అని నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. –స్మిత్, ఆసీస్ కెప్టెన్ ఈ రోజు ఇంత గొప్పగా మలుపు తిరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. కెప్టెన్, కోచ్ నాపై ఉంచిన నమ్మకమే ఇలాంటి ఫలితాన్నిచ్చింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఆరేసి వికెట్లు తీస్తానని నేనూ అనుకోలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత భారత్‌లో విజయంలో నా పాత్ర ఉండటం ఆనందాన్నిచ్చింది. దీని కోసం ఎంతో శ్రమించాం. ఇక్కడికి వచ్చే ముందు దుబాయ్‌లో తీవ్రంగా సాధన చేశాం. గొప్ప బ్యాట్స్‌మెన్ ఉన్న భారత జట్టు నుంచి రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాకు తెలుసు. –స్టీవ్ ఓ కీఫ్, ఆసీస్ బౌలర్ -
ఇదిగో... దీన్ని కూడా కాస్త సర్దుతావా!
భారత ఆటగాళ్లు ఎప్పుడైనా ఇలా సూట్‌కేసులు మోయడం చూశారా..! విమానాశ్రయమైనా, హోటల్ అయినా ఎలాంటి లగేజీ బాధ్యతలు లేకుండా వారంతా చెవులకు హెడ్‌ఫోన్‌తో దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయే దృశ్యాలే మన కళ్ల ముందు కదులుతాయి. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం భారత్‌లో దిగీ దిగగానే ఇలా సూట్‌కేసులు సర్దే పనిలోకి దిగిపోయారు. ఆటపరంగా అగ్రశ్రేణి జట్టు, వ్యక్తిగతంగా స్టార్ హోదా ఉన్నా సరే, వారంతా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ‘శ్రమైక జీవన సౌందర్యం’ అంటూ కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్ ఇలా డీసీఎం వ్యాన్‌లోకి తమ బ్యాగేజీ తరలించడం చూసేవారందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘ఇదేమీ మాకు నామోషీగా అనిపించడం లేదు. ఇదంతా టీమ్ వర్క్లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇలా మా అంతట మేం చేసుకుంటేనే పని తొందరగా అవుతుంది’ అని ఆస్ట్రేలియా జట్టు ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. మరో వైపు తాము కూలీలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ఆసీస్ క్రికెటర్లు తామే లగేజీ ఎత్తేందుకు ఆసక్తి చూపించారని బీసీసీఐ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. వారు ఎంత సిద్ధమైనా అతిథిగా వచ్చిన జట్టును ఇలా వదిలేయడం మాత్రం ఏ రకంగా చూసినా అభిలషణీయం కాదు. ఆటతో, మాటతో కూడా మనకు బలమైన ప్రత్యర్థే అయినా... భేషజాలు లేని ఆస్ట్రేలియా ఆటగాళ్లను అభినందించకుండా ఉండలేం! -
ఆసీస్‌దే టి20 సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా
కేప్ టౌన్: లక్ష్య ఛేదనలో చెలరేగిన ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కెప్టెన్ స్మిత్ (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్సన్ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ కంగారులు 6 వికెట్ల తేడాతో సఫారీలపై విజయం సాధించారు. న్యూలాండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా (62 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) దుమ్మురేపాడు. కోల్టర్‌నీల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. వార్నర్ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (10 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. -
రెండో వన్డేలోనూ ఆసీస్ గెలుపు
లండన్ : ‘యాషెస్’ టెస్టు సిరీస్‌లో నిరాశపర్చిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో దుమ్మురేపుతోంది. కెప్టెన్ స్మిత్ (87 బంతుల్లో 70; 7 ఫోర్లు), మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 64; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో శనివారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూల జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 7 వికెట్లకు 309 పరుగులు చేసింది. స్మిత్, బెయిలీ (72 బంతుల్లో 54; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. మిడిలార్డర్లో మ్యాక్స్‌వెల్ (38 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్ (38 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగారు. తర్వాత ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 245 పరుగులకే పరిమితమైంది. మోర్గాన్ (87 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. టేలర్ (43), రాయ్ (31) మోస్తరుగా ఆడారు. ఓ దశలో 142 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను చివర్లో ఆసీస్ బౌలర్లు మరింత బెంబెలేత్తించారు. దీంతో 103 పరుగుల తేడాతో ఆఖరి ఐదు వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది. కమిన్స్‌కు 4, మ్యాక్స్‌వెల్‌కు 2 వికెట్లు దక్కాయి.