సూపర్‌ స్మిత్‌  | Captain Smith guides Rajasthan Royals to third win | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్మిత్‌ 

Published Sun, Apr 21 2019 1:11 AM | Last Updated on Sun, Apr 21 2019 1:11 AM

 Captain Smith guides Rajasthan Royals to third win - Sakshi

ప్లే ఆఫ్‌ ఆశలు నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ సమష్టిగా రాణించింది. కొత్త కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలో స్ఫూర్తిదాయక విజయాన్ని సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా స్మిత్‌ రాణించడంతో రాజస్తాన్‌ రాజసం ముందు రోహిత్‌ సేన మరోసారి తలవంచింది. ఐపీఎల్‌లో  రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్‌  ఓడిపోవడం గమనార్హం.   

జైపూర్‌: ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముంబైని ఓడించి ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ మూడో విజయం నమోదు చేసుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (47 బంతుల్లో 65; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... సూర్యకుమార్‌ (34; 1 ఫోర్, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది. ఇప్పటి వరకు టోర్నీలో పెద్దగా రాణించని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మిత్‌ (48 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రియాన్‌ పరాగ్‌ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సంజూ సామ్సన్‌ (19 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. ముంబై లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ 3 వికెట్లు పడగొట్టాడు.  

ఆకట్టుకున్న డికాక్‌... 
ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లోనే రోహిత్‌ శర్మ (5) వికెట్‌ తీసి  గోపాల్‌ ముంబైకి షాకిచ్చాడు. అదే ఓవర్‌లో వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద ఆర్చర్‌ క్యాచ్‌ వదిలేయడంతో డికాక్‌ ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. కానీ ధావళ్‌ కులకర్ణి వేసిన మరుసటి ఓవర్‌లోనే వరుసగా 4, 4, 4, 6తో డికాక్‌ చెలరేగిపోయా డు. దీంతో పవర్‌ప్లేలో ముంబై వికెట్‌ నష్టానికి 46 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేయగా... డికాక్‌ అప్పుడప్పుడు ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే అతను అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బిన్నీ విడగొట్టాడు. సూర్యకుమార్‌ను ఔట్‌ చేసి రెండో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. వెంటనే డికాక్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో 15 ఓవర్లకు జట్టు స్కోరు 112/3తో నిలిచింది. స్లో వికెట్‌కు తోడు ఆర్చర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో డెత్‌ ఓవర్లలోనూ ముంబై ధాటిగా ఆడలేకపోయింది. చివరి ఐదు ఓవర్లలో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఆర్చర్‌ 16 పరుగులే ఇచ్చి హార్దిక్‌ వికెట్‌ను దక్కించుకున్నాడు. పొలార్డ్‌ (10) విఫలమయ్యాడు. ఆర్చర్‌ రెండు సార్లు క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన హార్దిక్, కటింగ్‌ (13) చివర్లో కీలక పరుగులు జోడించారు.   

స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌... 
లక్ష్యఛేదనను రాజస్తాన్‌ రాయల్స్‌ ధాటిగా ప్రారంభిం చింది. మొదటి రెండు ఓవర్లలో ఐదు బౌండరీలతో సంజూ సామ్సన్‌ చెలరేగాడు. వేగంగా ఆడే క్రమంలో రహానే (12) ఔటయ్యాడు. స్మిత్‌ కూడా వేగంగా ఆడటంతో పవర్‌ ప్లేలో రాజస్తాన్‌ 60 పరుగులు చేసింది. లక్ష్యం దిశగా వేగంగా దూసుకెళ్తోన్న రాయల్స్‌ను కట్టడి చేసేందుకు చహర్‌ ప్రయత్నించాడు. ఒకే ఓవర్లో జోరు మీదున్న సామ్సన్, బెన్‌ స్టోక్స్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో స్మిత్‌కు 17 ఏళ్ల కుర్రాడు పరాగ్‌ జతయ్యాడు. వీరిద్దరూ చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ రాయల్స్‌ను గెలుపు దిశగా నడిపించారు. ఈ క్రమంలో స్మిత్‌ 40 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. విజయానికి 16 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో పరాగ్, టర్నర్‌ (0) వెంటవెంటనే ఔటైనప్పటికీ... స్టువర్ట్‌ బిన్నీ సహకారంతో స్మిత్‌ రాజస్తాన్‌ను గెలిపించాడు.  

రహానేపై వేటు 
ఐపీఎల్‌లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్‌ రహానేపై వేటు వేశారు. నూతన సారథిగా స్టీవ్‌ స్మిత్‌ను నియమించారు. జట్టు పురోగతి కోసం చిన్న పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టినట్లు రాయల్స్‌ యాజమాన్యం తెలిపింది. గతేడాది బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా స్మిత్‌ ఐపీఎల్‌కు దూరం కావడంతో అతని స్థానంలో రహానే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. కానీ ఈ సీజన్‌లో రహానే సారథ్యంలోని రాజస్తాన్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే విజయం సాధించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement