పడగొట్టలేకపోయారు | India vs Australia 3rd Test ends in a draw | Sakshi
Sakshi News home page

పడగొట్టలేకపోయారు

Published Mon, Mar 20 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

పడగొట్టలేకపోయారు

పడగొట్టలేకపోయారు

‘డ్రా’గా ముగిసిన మూడో టెస్టు
రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 204/6
ఆదుకున్న హ్యాండ్స్‌కోంబ్, మార్ష్‌
ఆలౌట్‌ చేయడంలో భారత్‌ విఫలం ∙25 నుంచి చివరి టెస్టు   


ప్చ్‌...ఆశించిన ఫలితం దక్కలేదు. చివరి రోజు ఆటలో ఎనిమిది వికెట్లు తీసి ఆస్ట్రేలియా కథ ముగిద్దామని భావించిన భారత్‌ ఆ ప్రయత్నంలో విఫలమైంది. అనుకూలంగా కనిపిస్తున్న పిచ్‌పై స్పిన్‌ తంత్రంతో ప్రత్యర్థి పని పట్టవచ్చని టీమిండియా పెట్టుకున్న నమ్మకాన్ని కంగారూ బ్యాట్స్‌మెన్‌ వమ్ము చేశారు. ఆరంభంలో రెండు కీలక వికెట్లు తీసి ఆశలు రేపినా... ఆ తర్వాత 62 ఓవర్ల పాటు మరో వికెట్టే దక్కలేదు. చివర్లో మరో రెండు వికెట్లు పడగొట్టగలిగినా అప్పటికే విజయం చేజారిపోయింది. అనూహ్య మలుపులు తిరిగి, ఆసక్తికరంగా సాగిన రాంచీ టెస్టులో చివరకు కోహ్లి సేనకు ‘డ్రా’నందమే మిగిలింది.

నాలుగు పరుగుల వ్యవధిలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు అవుటయ్యాడు... సిరీస్‌లో ముందుండి నడిపిస్తున్న కెప్టెన్‌ స్మిత్‌ వెనుదిరిగే సమయానికి జట్టు ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది. ఈ దశలో ఆసీస్‌ కుప్పకూలిపోవచ్చని అనిపించింది. కానీ హ్యాండ్స్‌కోంబ్, షాన్‌ మార్ష్‌ ఆసీస్‌ను ఆదుకున్నారు. ప్రత్యర్థి ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా పట్టు వదలకుండా మొండిగా పోరాడారు. భారత బౌలింగ్‌ను పట్టుదలగా ఎదుర్కొంటూ ఒకరు 200 బంతులు ఆడితే, మరొకరు 197 బంతులు ఎదుర్కొని తమ జట్టును క్షేమంగా తీరం చేర్చారు. మూడు టెస్టుల్లో మూడు రకాల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక తాడోపేడో తేల్చుకోవాల్సింది ధర్మశాలలోనే.  

రాంచీ: హోరాహోరీగా సాగుతున్న బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో మరో టెస్టుకు ఆసక్తికర ముగింపు లభించింది. ఐదు రోజుల పాటు ఇరు జట్లు పట్టుదలగా, పట్టు విడవకుండా పోరాడిన అనంతరం రాంచీలో జరిగిన మూడో టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్‌ ఆఖరి రోజు సోమవారం ఓటమిని తప్పించుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దానిని విజయవంతంగా పూర్తి చేసింది. భారత్‌ మెరుగైన ప్రదర్శనే ఇచ్చినా... ఆసీస్‌ను పడగొట్టడంలో మాత్రం విఫలమైంది.

ఐదో రోజు మ్యాచ్‌ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (200 బంతుల్లో 72 నాటౌట్‌; 7 ఫోర్లు), షాన్‌ మార్‌‡్ష (197 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో జడేజాకు 4 వికెట్లు దక్కాయి. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో ఇరు జట్లు ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచాయి. చివరిదైన నాలుగో టెస్టు శనివారం నుంచి ధర్మశాలలో జరుగుతుంది.

  స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 451, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 603/9 డిక్లేర్డ్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) జడేజా 14; రెన్‌షా (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 15; లయన్‌ (బి) జడేజా 2; స్మిత్‌ (బి) జడేజా 21; మార్ష్‌ (సి) విజయ్‌ (బి) జడేజా 53; హ్యాండ్స్‌కోంబ్‌ (నాటౌట్‌) 72; మ్యాక్స్‌వెల్‌ (సి) విజయ్‌ (బి) అశ్విన్‌ 2; వేడ్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (100 ఓవర్లలో 6 వికెట్లకు) 204.

వికెట్ల పతనం: 1–17; 2–23; 3–59; 4–63; 5–187; 6–190.

బౌలింగ్‌: అశ్విన్‌ 30–10–71–1; జడేజా 44–18–54–4; ఉమేశ్‌ 15–2–36–0; ఇషాంత్‌ 11–0–30–1.  

సెషన్‌–1: స్మిత్‌ (బి) జడేజా
ఓవర్‌నైట్‌ స్కోరు 23/2తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడగా, భారత బౌలర్లు చక్కటి బంతులతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఈ దశలో రెన్‌షా (15)తో వాదోపవాదాలు సాగిన అనంతరం అద్భుత బంతితో అతడిని అవుట్‌ చేసి ఇషాంత్‌ భారత్‌కు కీలక వికెట్‌ అందించాడు. మరో నాలుగు బంతులకే స్మిత్‌ (21)ను జడేజా బౌల్డ్‌ చేయడంతో భారత శిబిరంలో ఆనందం రెట్టింపైంది. జడేజా వేసిన బంతిని ముందుకొచ్చి ప్యాడ్‌తో స్మిత్‌ అడ్డుకునే ప్రయత్నం చేయగా, అది అతడిని దాటుకుంటూ వెళ్లి స్టంప్‌ను గిరాటేసింది.
ఓవర్లు: 28.4, పరుగులు: 60, వికెట్లు: 2

 సెషన్‌–2: కీలక భాగస్వామ్యం
లంచ్‌ తర్వాత షాన్‌ మ‌, హ్యాండ్స్‌కోంబ్‌ తమ పోరాటం కొనసాగించారు. ఒకవైపు జాగ్రత్తగా డిఫెన్స్‌ ఆడుతూనే, మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా చక్కటి షాట్లతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. 27 పరుగుల వద్ద ఉమేశ్‌ బౌలింగ్‌లో మార్ష్‌ ఎల్బీడబ్ల్యూ కోసం భారత్‌ కోరిన రివ్యూ వృథా అయింది. ఒక దశలో వరుసగా 32 బంతులపాటు పరుగే తీయని హ్యాండ్స్‌కోంబ్‌ ఆ తర్వాత అశ్విన్‌ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు బాదడం విశేషం.
ఓవర్లు: 33, పరుగులు: 66, వికెట్లు: 0

సెషన్‌–3: భారత్‌కు నిరాశ
చివరి సెషన్‌లో కూడా ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పట్టు వదల్లేదు. భారత బౌలర్లందరూ గట్టి ప్రయత్నం చేసినా వికెట్‌ మాత్రం తీయలేకపోయారు. ఉమేశ్‌ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్‌ 44 పరుగుల వద్ద అంపైర్‌ ఎల్బీని తిరస్కరించడంతో భారత్‌ రివ్యూ చేసింది. అయినా ఫలితం లభించలేదు. స్కోరు సమం చేసిన తర్వాత ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ మరింత స్వేచ్ఛగా ఆడారు. ఈ క్రమంలో ముందుగా హ్యాండ్స్‌కోంబ్‌ 126 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌ కొత్త బంతిని తీసుకున్నా కూడా లాభం లేకపోయింది. మరోసారి మార్ష్‌ విషయంలో రివ్యూ కోరి భారత్‌ భంగపడగా...ఆ వెంటనే అతను 190 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. అనంతరం తక్కువ వ్యవధిలో మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌ (2) వెనుదిరిగినా ఆసీస్‌కు ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది.
ఓవర్లు: 31, పరుగులు: 55, వికెట్లు: 2
                                                          ♦   ♦    ♦
నిజానికి 150 పరుగుల ఆధిక్యాన్ని మేం కూడా ఊహించలేదు. ముందు రోజు రెండు వికెట్లు తీసిన తర్వాత మాకు మంచి అవకాశం ఉందనిపించింది. కానీ ఇద్దరు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ చాలా బాగా ఆడారు. వారిని అభినందించక తప్పదు. చివరి రోజు బంతి చాలా తొందరగా మెత్తబడిపోవడమే రెండో సెషన్‌లో మాకు ఒక్క వికెట్‌ కూడా దక్కకపోవడానికి కారణం. బలమైన ప్రత్యర్థి పోరాడుతుందని, అంత సులువుగా వికెట్లు ఇవ్వదని కూడా తెలుసు. రెండో ఇన్నింగ్స్‌ ఆడే అవసరం లేకుండానే గెలిచే స్థితిలో నిలవడం మాకు సంతృప్తినిస్తే, డ్రాతో బయటపడినందుకు వారు కూడా సంతోషించి ఉంటారు. నా దృష్టిలో పుజారా అమూల్యమైన ఆటగాడు. చాలా మంది అతని విలువను గుర్తించలేకపోవడం నాకు బాధ కలిగిస్తుంది. అశ్విన్, జడేజా సీజన్‌లో చెరో 4 వేలకు పైగా బంతులు విసిరారని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. కానీ తప్పదు. జట్టు గెలవాలంటే అలాంటి విలువైన బౌలర్లను పూర్తిగా వాడుకోవాల్సిందే.    
–కోహ్లి, భారత కెప్టెన్‌
                                                          ♦   ♦    ♦
క్రికెట్‌లో జోరు కొనసాగించడం లాంటి మాట ఏదైనా ఉంటే నాలుగో టెస్టుకు ముందు అది ఇప్పుడు మా వైపే ఉందని చెప్పగలను. ఎందుకంటే మమ్మల్ని ఆలౌట్‌ చేయలేకపోవడం భారత్‌ను తీవ్రంగా బాధించి ఉంటుంది. మార్‌, హ్యాండ్స్‌కోంబ్‌ ప్రదర్శన అద్భుతం. నాకు గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి ఆటతీరు ప్రదర్శించడం గురించే మేం పదే పదే చర్చించుకున్నాం. ఐదు రోజులు టెస్టు సాగుతుందని నేను అనుకోలేదు. మేం మరో వంద పరుగులు చేయాల్సింది. పుజారా, సాహా చాలా బాగా ఆడారు. 210 ఓవర్లు ఫీల్డింగ్‌ చేయడం నా కెరీర్‌లో ఎప్పుడూ జరగలేదు. బాగా అలసిపోయాను.    
–స్టీవ్‌ స్మిత్, ఆసీస్‌ కెప్టెన్‌

భారత గడ్డపై ఒక విదేశీ జట్టు 150 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయి మ్యాచ్‌ను కాపాడుకోవడం 2008 తర్వాత ఇదే తొలిసారి. అదే విధంగా భారత్‌లో టెస్టు మ్యాచ్‌ చివరి రోజు కనీసం 75 ఓవర్లు ఎదుర్కొని ఓటమి తప్పించుకోవడం కూడా 2008 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ టెస్టులో జడేజా మొత్తం 93.3 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. 1990లో ఇంగ్లండ్‌తో నరేంద్ర హిర్వాణీ తర్వాత ఒక భారత బౌలర్‌ ఇన్ని ఓవర్లు వేయడం ఇదే మొదటిసారి.

కోహ్లి మరో ఆరోపణ!
బెంగళూరు టెస్టులో రివ్యూ వివాదం మరచిపోక ముందే కోహ్లి మరో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చాడు. భారత జట్టు ఫిజియో పాట్రిక్‌ ఫర్‌హర్ట్‌ను కొంత మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కావాలని అగౌరవపరిచారంటూ కోహ్లి ఆరోపించాడు. తనకు చికిత్స చేయడం అతని బాధ్యత అని, అనవసరంగా అతని పేరును ఎందుకు లాగారో తనకు అర్థం కావడం లేదని విరాట్‌ అన్నాడు. అయితే ఈ ఆరోపణలను స్మిత్‌ ఖండించాడు. కోహ్లి వ్యాఖ్యలతో తాను నిరాశ చెందానని, అసలు అలాంటిదేమీ జరగలేదని అతను వివరణ ఇచ్చాడు.

భారత్‌లో ఆడే సమయంలో మైదానంలో ఉద్రిక్తతలు సహజమేనని, అయితే క్రీడా స్ఫూర్తితో ఆడటం ముఖ్యమని స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు తన భుజం గాయం, మ్యాక్స్‌వెల్‌ వెక్కిరింతల అంశాన్ని చాలా చిన్నదిగా కోహ్లి కొట్టిపారేశాడు. చివరి రోజు కూడా భారత బౌలర్‌ ఇషాంత్‌కు, రెన్‌షాకు మధ్య మాటల యుద్ధం జరిగింది. కోపంగా కనిపించిన ఇషాంత్‌ ఒకే ఓవర్లో వరుస బౌన్సర్లతో రెన్‌షాను బెదరగొట్టాడు. చివరకు అదే ఓవర్లో ఒక ఫుల్‌ బంతితో రెన్‌షాను ఎల్బీగా అవుట్‌ చేసి విజయగర్వంతో అరిచేశాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement