దాసోహం | Australia return the favour, halt India's grand run with crushing Pune | Sakshi
Sakshi News home page

దాసోహం

Published Sun, Feb 26 2017 2:18 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

దాసోహం

దాసోహం

333 పరుగులతో చిత్తుగా ఓడిన భారత్‌

ఆసీస్‌ స్పిన్‌ వలలో టీమిండియా విలవిల  
ఓకీఫ్, లియోన్‌ ధాటికి 107 పరుగులకే ఆలౌట్‌
అద్భుత సెంచరీతో రాణించిన స్మిత్‌
13 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆసీస్‌ విజయం  


న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌... ఇలా ఏ జట్టు భారత పర్యటనకు వచ్చినా దారుణ పరాజయాలను రుచి చూపించిన విరాట్‌ కోహ్లి బృందం జోరుకు చెక్‌ పడింది. సొంతగడ్డపై 2012 నుంచి ఎదురులేకుండా సాగుతున్న విజయ ప్రస్థానానికి ఆస్ట్రేలియా అడ్డుకట్ట వేసింది. బలహీన జట్టుగా తమను ఎంతో మంది వెక్కిరించినా కూడా ఉపఖండ పిచ్‌లపై రాణించాలంటే ఏ ఆయుధాన్ని ఉపయోగించుకోవాలో తెలుసుకుని మరీ వేటాడింది. ఇక స్పిన్‌ బౌలింగ్‌ను ఆడటంలో ఆరితేరిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ మాత్రం.. ఆడుతోంది మన పిచ్‌లపైనేనా లేక ఆసీస్‌ బౌన్సీ పిచ్‌లపైనా అనే అనుమానాన్ని కలిగిస్తూ రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ను అప్పగించడం విచిత్రమే!

అదే దృశ్యం.. రెండో రోజు ఆటనే భారత జట్టు సేమ్‌ టు సేమ్‌ దింపేసింది. కాకపోతే ఓ రెండు పరుగులు ఎక్కువ చేసింది.. అంతే. తొలి ఇన్నింగ్స్‌లో దిమ్మ తిరిగేలా షాకిచ్చిన స్పిన్నర్‌ ఓకీఫ్‌ ఈసారీ చావుదెబ్బ తీశాడు. 441 పరుగుల లక్ష్య ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత జట్టు ప్రత్యర్థి బౌలర్లకు శ్రమ ఎందుకని అనుకుందో తొలి ఇన్నింగ్స్‌కన్నా ఓ 7 ఓవర్లు తక్కువగానే ఆడి 107 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఫలితంగా 333 పరుగుల భారీ తేడాతో పరాజయం. టీమిండియాకు వరుసగా 20 టెస్టుల అనంతరం తగిలిన ఎదురుదెబ్బ ఇది. మరోవైపు 2004 అనంతరం ఆస్ట్రేలియా ఇక్కడ తొలి విజయాన్ని అందుకుంది. ఇంత కఠినమైన పిచ్‌పై కూడా ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఒక్కడే 109 పరుగులు చేయడం విశేషం.  

పుణే: అద్భుతమేమీ జరగలేదు. మ్యాచ్‌ ఫలితం ఎలా ఉండబోతోందో రెండో రోజే తెలిసిపోయింది. కాకపోతే కనీస పోరాటాన్ని ఆశించిన అభిమానుల ఆశలను అడియాసలు చేస్తూ దారుణ ఆటతీరుతో టీమిండియా ఆస్ట్రేలియా జట్టుకు దాసోహమైంది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ తొలి టెస్టులో కోహ్లి సేన ఏకంగా 333 పరుగుల తేడాతో ఓడింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 1–0తో ఆధిక్యాన్ని పొందింది. మార్చి 4 నుంచి బెంగళూరులో రెండో టెస్టు జరుగుతుంది. 2004లో సిరీస్‌ గెల్చుకున్న అనంతరం భారత గడ్డపై వరుసగా ఏడు టెస్టుల్లో ఓడిన ఆసీస్‌కు ఇది తొలి విజయం కాగా... 2012లో కోల్‌కతా టెస్టులో ఇంగ్లండ్‌పై చివరిసారిగా భారత్‌ ఓడింది. శనివారం కష్టసాధ్యమైన 441 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 33.5 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది.

చతేశ్వర్‌ పుజారా (58 బంతుల్లో 31; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. రహానే (21 బంతుల్లో 18; 3 ఫోర్లు), కోహ్లి (37 బంతుల్లో 13; 1 ఫోర్‌), రాహుల్‌ (9 బంతుల్లో 10; 1 ఫోర్‌) రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి ఓకీఫ్‌ ఆరు వికెట్లతో చెలరేగి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. ఇందులో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ వికెట్ల ముందే దొరికిపోగా ఒకరు బౌల్డ్‌ అయ్యారు. లియోన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 87 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. కెప్టెన్‌ స్మిత్‌ (202 బంతుల్లో 109; 11 ఫోర్లు) సెంచరీ చేయగా... స్టార్క్‌ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి వేగంగా ఆడాడు. మొత్తం 12 వికెట్లతో చెలరేగిన ఓకీఫ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 260; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 105; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వార్నర్‌ ఎల్బీడబ్లు్య (బి) అశ్విన్‌ 10; షాన్‌ మార్‌‡్ష ఎల్బీడబ్లు్య (బి) అశ్విన్‌ 0; స్మిత్‌ ఎల్బీడబ్లు్య (బి) జడేజా 109; హ్యాండ్స్‌కోంబ్‌ (సి) విజయ్‌ (బి) అశ్విన్‌ 19; రెన్‌షా (సి) ఇషాంత్‌ (బి) జయంత్‌ 31; మిషెల్‌ మార్‌‡్ష (సి) సాహా (బి) జడేజా 31; వేడ్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ యాదవ్‌ 20; స్టార్క్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 30; ఓకీఫ్‌ (సి) సాహా (బి) జడేజా 6; లియోన్‌ ఎల్బీడబ్లు్య (బి) ఉమేశ్‌ యాదవ్‌ 13; హాజెల్‌వుడ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (87 ఓవర్లలో ఆలౌట్‌) 285.

వికెట్ల పతనం: 1–10, 2–23, 3–61, 4–113, 5–169, 6–204, 7–246, 8–258, 9–279, 10–285. బౌలింగ్‌: అశ్విన్‌ 28–3–119–4; జడేజా 33–10–65–3; ఉమేశ్‌ యాదవ్‌ 13–1–39–2; జయంత్‌ 10–1–43–1; ఇషాంత్‌ 3–0–6–0.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: విజయ్‌ ఎల్బీడబలు్య (బి) ఓకీఫ్‌ 2; రాహుల్‌ ఎల్బీడబ్లు్య (బి) లియోన్‌ 10; పుజారా ఎల్బీడబ్లు్య (బి) ఓకీఫ్‌ 31; కోహ్లి (బి) ఓకీఫ్‌ 13; రహానే (సి) లియోన్‌ (బి) ఓకీఫ్‌ 18; అశ్విన్‌ ఎల్బీడబ్లు్య (బి) ఓకీఫ్‌ 8; సాహా ఎల్బీడబ్లు్య (బి) ఓకీఫ్‌ 5; జడేజా (బి) లియోన్‌ 3; జయంత్‌ యాదవ్‌ (సి) వేడ్‌ (బి) లియోన్‌ 5; ఇషాంత్‌  (సి) వార్నర్‌ (బి) లియోన్‌ 0; ఉమేశ్‌ యాదవ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (33.5 ఓవర్లలో ఆలౌట్‌) 107.

వికెట్ల పతనం: 1–10, 2–16, 3–47, 4–77, 5–89, 6–99, 7–100, 8–102, 9–102, 10–107. బౌలింగ్‌: స్టార్క్‌ 2–2–0–0; లియోన్‌ 14.5–2–53–4; ఓకీఫ్‌ 15–4–35–6; హాజెల్‌వుడ్‌ 2–0–7–0.

తొలి సెషన్‌:  స్మిత్‌ శతకం
ఓవర్‌నైట్‌ స్కోరు 143/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ ఏడు ఓవర్ల అనంతరం మిషెల్‌ మార్‌‡్ష (31) రూపంలో ఐదో వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు ఓవర్‌లో స్మిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకోలేకపోయాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 26 పరుగులు జోడించారు. అనంతరం స్మిత్, వేడ్‌ (42 బంతుల్లో 20; 2 ఫోర్లు) ఆచితూచి ఆడుతున్న క్రమంలో ఈ జోడిని ఉమేశ్‌ యాదవ్‌ విడదీశాడు. ఆ తర్వాత స్మిత్‌ 187 బంతుల్లో భారత గడ్డపై తొలి సెంచరీని సాధించాడు. ఇక స్టార్క్‌ తనదైన శైలిలో 73వ ఓవర్‌లో 4, 6తో జోరు చూపించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్‌లో స్మిత్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ నిర్ణయంపై తను రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. మరో రెండు సిక్సర్లు బాదిన స్టార్క్‌ను అశ్విన్‌ అవుట్‌ చేయడంతో ఆసీస్‌ చివరి వికెట్లు వేగంగా పడ్డాయి.

ఓవర్లు: 41, పరుగులు: 142, వికెట్లు: 6
రెండో సెషన్‌: వికెట్లు టపటపా
భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరోసారి పేకమేడను తలపించింది. ఓకీఫ్‌ మళ్లీ తన స్పిన్‌ పవర్‌తో మళ్లీ చెలరేగాడు. ఐదో ఓవర్‌లోనే విజయ్‌ (2)ను ఎల్బీ చేయగా అతను రివ్యూకు వెళ్లాడు. అయినా ఫలితం దక్కలేదు. తర్వాత ఓవర్‌లోనే రాహుల్‌ను లియోన్‌ ఎల్బీ చేయగా అతను కూడా రివ్యూకు వెళ్లి నిరాశ చెందాడు. ఇక 17వ ఓవర్‌లో ఓకీఫ్‌ వేసిన బంతిని కెప్టెన్‌ కోహ్లి ఆడకుండా వదిలేయడంతో అది కాస్తా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఓకీఫ్‌ బౌలింగ్‌లో రహానే రెండు ఫోర్లు కొట్టి ఆత్మవిశ్వాసంతో కనిపించినా ఎక్కువసేపు నిలవలేదు. వరుస నాలుగు ఓవర్లలో రహానే, అశ్విన్‌ (8), సాహా (5)లను ఓకీఫ్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ లంచ్‌ విరామానికి వెళ్లింది.

ఓవర్లు: 28.3, పరుగులు: 99, వికెట్లు: 6
చివరి సెషన్‌: అలా వచ్చి ఇలా వెళ్లి...
టీ బ్రేక్‌ తర్వాత తన మిగిలిన సగం ఓవర్‌లో నిలకడగా ఆడుతున్న పుజరాను ఓకీఫ్‌ ఎల్బీగా అవుట్‌ చేయడంతో భారత్‌ ‘ఆశలు’ వదులుకుంది. మరోవైపు లియోన్‌ విజృంభించి తన వరుస రెండు ఓవర్లలో జడేజా (3), ఇషాంత్, జయంత్‌ (5)లను అవుట్‌ చేయడంతో ఆసీస్‌ సంబరాల్లో మునిగింది. దీంతో భారత్‌ 8 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లను కోల్పోయింది.
ఓవర్లు: 5.2, పరుగులు: 8, వికెట్లు: 4

అత్యంత చెత్త ప్రదర్శన చేశాం...  
మేం ఎలా బ్యాటింగ్‌ చేయకూడదో ఈ టెస్టు చూపించింది. చాలా అరుదైన రీతిలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌ నిరాశపర్చింది. ఒక మంచి భాగస్వామ్యం లేదు. అసలు మా బ్యాటింగే స్థాయికి తగినట్లు లేదు. ఇలాంటి పిచ్‌పై 155 పరుగుల ఆధిక్యం ఇవ్వడం అంటే పెద్ద నేరం చేసినట్లే. 11 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి, ఒకే బ్యాట్స్‌మన్‌వి ఐదు క్యాచ్‌లు కూడా వదిలేసిన జట్టుకు గెలిచే అర్హత లేదు. గత కొంత కాలంగా మా ఆటను బట్టి చూస్తే ఇది అత్యంత చెత్త ప్రదర్శన. నేను బౌల్డ్‌ అయిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డాను. మా బౌలర్లు మంచి ప్రదర్శన కనబర్చారు. ప్రదర్శనను తప్పు పట్టను. నిజానికి మా స్పిన్నర్లకు వారికంటే ఎక్కువ టర్న్‌ లభించినా వికెట్లు మాత్రం దక్కలేదు. ఓటమి గురించి బెంగ లేదు. గతంలో శ్రీలంకతో ఓడిన తర్వాత ఎంతగా చెలరేగిపోయామో అందరికీ తెలుసు. నాకు, జట్టుకు ఇదో పాఠం వంటిది. లోపాలను సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతాం. ఇలాంటి టర్నింగ్‌ పిచ్‌పై గతంలోనూ ఆడాం కాబట్టి దానిని తప్పుపట్టను.         
–విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌

మ్యాచ్‌ ఆరంభ సమయంలో టెస్టులో చాలా కష్టపడాల్సి వస్తుందని భావించాం. టాస్‌ గెలవడం బోనస్‌గా మారింది. పిచ్‌ సిద్ధం చేసే బాధ్యత భారత్‌దే. నిజానికి ఈ పిచ్‌ భారత ఆటగాళ్లకు అనుకూలమైంది. వారు తమ కోసం తయారు చేసుకున్న పిచ్‌ మాకు బాగా పనికొచ్చింది. 4,502 రోజుల తర్వాత భారత గడ్డపై మా జట్టు గెలవడం గర్వంగా ఉంది. ఇక్కడి సవాల్‌ను మా ఆటగాళ్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. చాలా మంది మా గురించి అంచనా వేసినట్లు 0–4తో మాత్రం ఓడిపోవడం లేదు. మిగిలిన మ్యాచ్‌లలో కూడా ఇదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాం. బెంగళూరులో ఎలాంటి వికెట్‌ ఉంటుందో అని నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.    
–స్మిత్, ఆసీస్‌ కెప్టెన్‌

ఈ రోజు ఇంత గొప్పగా మలుపు తిరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. కెప్టెన్, కోచ్‌ నాపై ఉంచిన నమ్మకమే ఇలాంటి ఫలితాన్నిచ్చింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఆరేసి వికెట్లు తీస్తానని నేనూ అనుకోలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత భారత్‌లో విజయంలో నా పాత్ర ఉండటం ఆనందాన్నిచ్చింది. దీని కోసం ఎంతో శ్రమించాం. ఇక్కడికి వచ్చే ముందు దుబాయ్‌లో తీవ్రంగా సాధన చేశాం. గొప్ప బ్యాట్స్‌మెన్‌ ఉన్న భారత జట్టు నుంచి రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాకు తెలుసు.                  
 –స్టీవ్‌ ఓ కీఫ్, ఆసీస్‌ బౌలర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement