శ్రేయస్ అయ్యర్ చితక్కొట్టుడు..
ముంబై: ఆస్ట్రేలియాతో ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో భారత్ యువ జట్టు దీటుగా బదులిస్తోంది. శనివారం రెండో రోజు ఆటలో తడబాటును కొనసాగించిన భారత్ 'ఎ' జట్టు.. శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుత ఆట తీరుతో తేరుకుంది. 85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్..లంచ్ సమయానికి 166 వ్యక్తిగత పరుగులు నమోదు చేశాడు. 186 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో భారీ శతకం నమోదు చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న అయ్యర్.. కొన్ని కీలక భాగస్వామ్యాలను నమోదు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.దాంతో చివరి రోజు ఆటలో లంచ్ విరామానికి భారత్ 'ఎ' జట్టు 83.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది.
అంతకుముందు176/4 ఓవర్ నైట్ స్కోరు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 'ఎ' జట్టు తొలి సెషన్ లో రిషబ్ పంత్(21) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత ఇషాన్ కిషన్(4) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో గౌతమ్ తో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ జోడి ఏడో వికెట్ కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ 'ఎ' గాడిలో పడింది. ఈ క్రమంలోనే గౌతమ్(65 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.