డబుల్ సెంచరీతో ఇరగదీశాడు..
ముంబై: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో భారత్ 'ఎ' ఆటగాడు శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీతో ఇరగదీశాడు. 210 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లతో 202 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్.. ఆద్యంత ఆకట్టుకుని డబుల్ సెంచరీతో మెరిశాడు.
అంతకుముందు176/4 ఓవర్ నైట్ స్కోరు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 'ఎ' జట్టు తొలి సెషన్ లో రిషబ్ పంత్(21) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత కాసేపటికి ఇషాన్ కిషన్(4) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో గౌతమ్ తో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ జోడి ఏడో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ 'ఎ' గాడిలో పడింది. ఈ క్రమంలోనే అయ్యర్ డబుల్ సెంచరీ చేయగా గౌతమ్(74) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అయితే గౌతమ్ అవుటైన తరువాత చివరి వరుస ఆటగాళ్ల ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో భారత్ 'ఎ' జట్టు 91.5 ఓవర్లలో403 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 469/7 డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రానే ఖాయంగా కనబడుతోంది.