'అక్షర్ అద్భుతం చేశాడు'
రాజ్ కోట్: 'హ్యాట్రిక్' నమోదు చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ప్రశంసలు కురింపించాడు. అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ... 'ఈ రోజు విజయం క్రెడిట్ అక్షర్ కు దక్కుతుంది. గత మ్యాచుల్లో అతడు ఒత్తిడికి గురయ్యాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు' అని పేర్కొన్నాడు.
ఆదివారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్ తో టాప్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపాడు. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను 'హ్యాట్రిక్' వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. మిల్లర్ ను తప్పించి విజయ్ కు కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
అక్షర్ తో పాటు పేసర్లు మొహిత్ శర్మ, సందీప్ శర్మ కూడా బాగా బౌలింగ్ చేశారని విజయ్ అన్నాడు. మిల్లర్ ఫామ్ గురించి అడగ్గా.. ఏ జట్టుకైనా అతడు ఎసెట్ అని పేర్కొన్నాడు. ఏడు మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.