భారత్ డబుల్ ధమాకా
కాల్గరీ(కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిలో భారత షట్లర్లు సత్తా చాటారు. కాల్గరీలో జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ను భారత ఆటగాళ్లు కైవసం చేసుకుని డబుల్ ధమాకా సృష్టించారు. పురుషుల సింగిల్స్ తుది పోరులో సాయి ప్రణీత్ 21-12, 21-10 తేడాతో లీ హుయున్ (కొరియా)పై విజయం సాధించి టైటిల్ సాధించగా, పురుషుల డబుల్స్లో మను అత్రి-బి సుమీత్ రెడ్డి జోడి 21-8, 21-14 తేడాతో అడ్రియన్ లియూ-టోబీ నిగ్(కెనడా) ద్వయంపై గెలిచి టైటిల్ను దక్కించుకుంది.
పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. తొలి గేమ్లో ఆది నుంచి ఆధిక్యంలో దూసుకెళ్లిన ప్రణీత్.. ఆ గేమ్ను దక్కించుకుని పైచేయి సాధించాడు. ఆపై రెండో గేమ్లో ప్రణీత్ మరింత దూకుడుగా ఆడాడు. ప్రత్యర్ధి లీ హూన్ ముప్పు తిప్పలు పెట్టి భారీ తేడాతో రెండో గేమ్ను కైవసం చేసుకున్నాడు. తద్వారా కెనడా ఓపెన్ టైటిల్ను తొలిసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సిరీస్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ తుది పోరులో రెండు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వుయ్(మలేషియా)ను ఓడించి టైటిల్ను దక్కించుకున్న సాయి ప్రణీత్.. కెనడా గ్రాండ్ ప్రిలో ఆద్యంతం ఆకట్టుకుని విజేతగా నిలిచాడు.
మరోవైపు పురుషుల డబుల్స్ లో మను అత్రి-బి సుమీత్ రెడ్డిల జోడి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్ను అవలీలగా గెలుచుకున్న ఈ జోడి, రెండో గేమ్లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరి వరకూ పోరాడి టైటిల్ సాధించింది.