హైదరాబాద్: టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కవర్ డ్రైవ్ షాట్లలో కోహ్లిని మించిన మరో బ్యాట్స్‌మన్ ఉండడని ప్రశంసించాడు. హర్ష బోగ్లే హోస్ట్‌గా క్రిక్ బజ్ నిర్వహించిన లైవ్ షోలో పాల్గొన్న అజామ్ కోహ్లిని ఆకాశానికి ఎత్తాడు. ‘ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకరు. అతనితో పోల్చి చూసుకుంటే నేను చాలా వెనకబడి ఉన్నాను. నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నేను పాకిస్తాన్ తరుపున కోహ్లిలా ఆడాలి.. మ్యాచ్‌లను గెలిపించాలి.. రికార్డులను సృష్టించాలి’ అంటూ బాబర్ పేర్కొన్నాడు. (‘అదే కోహ్లిని గ్రేట్ ప్లేయర్‌ను చేసింది’)
‘ఓపెనర్‌గా బరిలోకి దిగితే చివరి బంతి ఆడేవరకు ప్రయత్నం చేయాలి. అలా చేస్తే బ్యాటింగ్‌లో అన్ని దశలను చూస్తావు. అంతేకాకుండా చివరి బంతి వరకు ఆడితే పరుగులు సాధించడమే కాకుండా జట్టుకు కూడా అవసరమైన మంచి స్కోర్‌ను అందిస్తావు, సహచర బ్యాట్స్‌మన్‌కు సహకారం అందిస్తావు’ అని తన కోచ్ తరుచూ పేర్కొనేవాడని, దాని అర్థం ఇప్పుడిప్పుడే అర్థం అవుతందని బాబర్ వివరించాడు. (కోహ్లితో పాటు ఆడటం నా అదృష్టం)
ఇక అండర్-19 సమయంలో తొలి సారి రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయాబ్ అక్తర్‌ను కలిశానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో అతడి బౌలింగ్‌ను కూడా ఎదుర్కొన్నానని, అది మర్చిపోలేని అనుభూతి అని పేర్కొన్నాడు. ఇక బాబర్ అజామ్‌ను పాకిస్తాన్ కోహ్లి అని అక్కడి అభిమానులు పిలిచే విషయం తెలిసిందే. కేవలం అభిమానులే కాకుండా తాజా, మాజీ క్రికెటర్లు సైతం కోహ్లితో ఈ బ్యాట్స్‌మన్‌ను పోల్చడం విశేషం. ఇక ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ అయితే ఏకంగా విరాట్ కోహ్లి కంటే బాబర్ అజామ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment