బజరంగ్ ‘పసిడి’ పట్టు
న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ పూనియా భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో ఈ హరియాణా రెజ్లర్ 6–2తో సెయుంగ్‌చుల్ లీ (దక్షిణ కొరియా)పై గెలిచాడు. తొలి రౌండ్‌లో బజరంగ్ 4–3తో హసనోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 7–5తో అబుల్‌ఫజిల్ నాసిరి (ఇరాన్)పై, సెమీఫైనల్లో 3–2తో కుక్‌గ్వాంగ్ కిమ్ (ఉత్తర కొరియా)పై గెలిచాడు.
భారత్‌కే చెందిన సత్యవర్త్ (97 కేజీలు), జితేందర్ (74 కేజీలు), సందీప్ తోమర్ (57 కేజీలు) పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మరోవైపు మహిళల ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగం ఫైనల్లో భారత రెజ్లర్ సరిత 0–6తో టినిబెకోవా (కిర్గిజిస్తాన్) చేతిలో ఓడిపోయి రజతంతో సంతృప్తి పడింది. ఓవరాల్‌గా భారత మహిళల జట్టు నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు నెగ్గి ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది.