ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌: భారత్‌కు ఐదు పతకాలు | Bajrang Punia, Ravi Kumar to fight for gold after reaching finals | Sakshi
Sakshi News home page

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌: భారత్‌కు ఐదు పతకాలు

Published Sun, Apr 18 2021 6:21 AM | Last Updated on Thu, Apr 22 2021 4:42 PM

Bajrang Punia, Ravi Kumar to fight for gold after reaching finals - Sakshi

అల్మాటీ (కజకిస్తాన్‌): మరోసారి తమ ఆధిపత్యం చాటుకుంటూ ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్లు అదరగొట్టారు. శనివారం బరిలోకి దిగిన ఐదు వెయిట్‌ కేటగిరీల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చాయి. రవి కుమార్‌ దహియా (57 కేజీలు) తన టైటిల్‌ను నిలబెట్టుకోగా... బజరంగ్‌ పూనియా (65) రజతం సాధించాడు. కరణ్‌ (70 కేజీలు), నర్సింగ్‌ యాదవ్‌ (79 కేజీలు), సత్యవర్త్‌ కడియాన్‌ (97 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.  

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చిన రవి కుమార్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో తన జోరు కనబరిచాడు. అలీరెజా (ఇరాన్‌)తో జరిగిన ఫైనల్లో ఢిల్లీకి చెందిన రవి కుమార్‌ 9–4తో గెలిచాడు. సెమీఫైనల్లో రవి 11–0తో అబురుమైలా (పాలస్తీనా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 9–2తో సఫరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించాడు. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రవి కుమార్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు.  

బజరంగ్‌కు గాయం
ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడో స్వర్ణం సాధించాలని ఆశించిన భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాకు నిరాశ ఎదురైంది. జపాన్‌ రెజ్లర్‌ టకుటో ఒటుగురోతో ఫైనల్‌ తలపడాల్సిన బజరంగ్‌ మోచేతి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బజరంగ్‌కు రజతం... ఒటుగురోకు స్వర్ణం దక్కాయి. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కిది ఏడో పతకం. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. ఈ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో బజరంగ్‌ 3–0తో జియోంగ్‌ యోంగ్‌సియోక్‌ (కొరియా)పై, సెమీఫైనల్లో 7–0తో బిల్‌గున్‌ సర్‌మన్‌డక్‌ (మంగోలియా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్‌లలో కరణ్‌ 3–1తో సీంగ్‌బోంగ్‌ లీ (కొరియా)పై, నర్సింగ్‌ యాదవ్‌ 8–2తో అహ్మద్‌ మోసిన్‌ (ఇరాక్‌)పై, సత్యవర్త్‌ 5–2తో మిన్‌వన్‌ సియో (కొరియా)పై విజయం సాధించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement